ఫస్ట్ నైట్‌లో వధువు కండీషన్… వరుడికి షాక్!
డబ్బు విషయంలో మొదలైన ఈ గొడవ కాస్తా రచ్చకెక్కింది. వరుడి కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు.
By: Madhu Reddy | 14 April 2026 11:54 AM ISTపెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు, కానీ ఇక్కడ మాత్రం మొదటి రాత్రే ముచ్చెమటలు పట్టించింది. శోభనం గదిలోకి అడుగుపెట్టిన వరుడికి వధువు పెట్టిన కండిషన్ విని మైండ్ బ్లాక్ అయిపోయింది. "నన్ను ముట్టుకోవాలంటే రూ. 90 లక్షలు ఇవ్వాల్సిందే" అంటూ ఆమె భీష్మించుకోవడంతో ఆ కొత్త పెళ్లికొడుకు నోట మాట రాలేదు. ఆశలతో మొదలవ్వాల్సిన సంసారం కాస్తా, మొదటి రోజే కోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్లిన ఈ వింత ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ముచ్చటగా మూడు ముళ్లు.. ముగియని గొడవలు:
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా జగదీష్‌పూర్‌లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు జరిగాయి, బంధుమిత్రుల సమక్షంలో వధూవరులు ఒక్కటయ్యారు. వివాహం ముగిశాక వధువు అత్తారింటికి చేరింది. ఆ రాత్రి శోభనం కోసం వరుడు ఎన్నో కలలతో గదిలోకి వెళ్లాడు. తీరా గదిలోకి వెళ్ళాక ఆమె అసలు స్వరూపం బయటపెట్టింది. తనను తాకాలి అంటే వెంటనే రూ. 90 లక్షల నగదు ఇస్తేనే ఈ పెళ్లికి గుర్తింపు ఉంటుందని, లేదంటే తన దగ్గరకు రావొద్దని తెగేసి చెప్పింది. ఇక దీంతో ఆ వరుడు ఏం చేయాలో తెలియక షాక్‌లో ఉండిపోయాడు.
హైడ్రామా.. గ్యాస్ పైప్‌లైన్ కట్ చేస్తానంటూ బెదిరింపులు:
డబ్బు విషయంలో మొదలైన ఈ గొడవ కాస్తా రచ్చకెక్కింది. వరుడి కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. పైగా తన పుట్టింటి వారికి సమాచారం అందించి రప్పించింది. వారు వచ్చాక పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇంట్లోని సామాన్లు పగలగొట్టడమే కాకుండా, ఏకంగా గ్యాస్ పైప్‌లైన్‌ను పీకేసి అందరినీ చంపేస్తానంటూ వధువు వీరంగం సృష్టించింది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న విలువైన బంగారు నగలు, అత్తగారు పెట్టిన ఆభరణాలు తీసుకుని ఆమె అక్కడి నుంచి పారిపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
పోలీస్ కేసు.. కోర్టు జోక్యం:
వధువు ఉద్దేశం పెళ్లి చేసుకోవడం కాదు, కేవలం తమను మోసం చేసి డబ్బులు వసూలు చేయడమేనని వరుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. మొదట ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేయడానికి వెనుకాడటంతో, బాధితులు చేసేదేమీ లేక కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు తాజాగా పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక అసలు ఆ యువతి వెనుక ఎవరున్నారు? ఆమె ఇలాంటి మోసాలకు ఇంకా ఎక్కడైనా పాల్పడిందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించడమే కాకుండా, పెళ్లి సంబంధాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో గుర్తు చేస్తోంది. కేవలం పైపై మెరుగులు చూసి మోసపోకుండా, సంబంధం కుదుర్చుకునే ముందే అవతలి వారి వివరాలను క్షుణ్ణంగా విచారించుకోవడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. లేదంటే ఇలాంటి "కండిషన్ల"తో కొత్త జీవితం మొదలవ్వక ముందే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది.
