Begin typing your search above and press return to search.

రెండు చేతులతో రసగుల్లా తిన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

వారిని సాదరంగా ఆహ్వానించారు. తర్వాత పెళ్లితంతు మొదలైంది. వధువు వరుడికి వరమాల వేసిన వెంటనే ఇద్దరికీ స్వీట్లు తినడానికి ఇచ్చారు.

By:  Tupaki Desk   |   9 May 2025 4:00 PM IST
రెండు చేతులతో రసగుల్లా తిన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు
X

బీహార్‌లోని నలందాలో ఓ పెళ్లిలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. వరమాల వేసిన తర్వాత వరుడు స్టేజీ మీద అందరి ముందు చేసిన పనికి వధువుకు పట్టరాని కోపం వచ్చింది. దీంతో ఈ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. వరుడు ఎంత బతిమాలినా ఆమె వినిపించుకోలేదు. చివరికి పెళ్లి బృందం ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటన సిలావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భుయి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. ఇక్కడ ఒక ఇంటికి బాజా భజంత్రీలతో పెళ్లి బృందం చేరుకుంది. వారిని సాదరంగా ఆహ్వానించారు. తర్వాత పెళ్లితంతు మొదలైంది. వధువు వరుడికి వరమాల వేసిన వెంటనే ఇద్దరికీ స్వీట్లు తినడానికి ఇచ్చారు.

అప్పుడే వరుడు రసగుల్లాలను రెండు చేతులతో పట్టుకుని తినడం మొదలుపెట్టాడు. ఇది చూసిన వధువు ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వరుడు మానసిక రోగి అని ఆమెకు అర్థమైంది. ఆగ్రహంతో ఊగిపోతూ వధువు స్టేజ్ దిగిపోయింది. నేను ఈ పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్పింది. వరుడు పెళ్లిని ఆపవద్దని ఆమె ముందు బతిమాలాడు. వరుడి కుటుంబ సభ్యులు కూడా వధువును బుజ్జగించడానికి ప్రయత్నించారు. కానీ వధువు తన నిర్ణయానికి కట్టుబడి ఉంది. దీంతో పెళ్లి బృందం పెళ్లి కూతురు లేకుండానే తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది.

గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం.. భుయికి చెందిన నిషాకు నూర్‌సరాయ్‌లోని ఝామావరాకు చెందిన వినీత్ కుమార్ రక్షక్‌తో పెళ్లి నిశ్చయమైంది. రాత్రి పెళ్లి బృందం చేరుకుంది. పెళ్లి సమయంలో వరుడు రెండు చేతులతో రసగుల్లాను తినడం మొదలుపెట్టాడు. అతని ప్రవర్తన చూసి వరుడు మానసిక రోగి అని వధువు భావించింది. వెంటనే ఆమె అతడితో పెళ్లికి నిరాకరించింది.

వధువు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, "పెళ్లి సంబంధం కుదిరినప్పుడు వరుడు మానసిక రోగి అని మాకు చెప్పలేదు. కానీ వరమాల సమయంలో అతని ప్రవర్తన చూసి మాకు విషయం అర్థమైంది. సమయానికి అతని నిజ స్వరూపం బయటపడటంతో మా కూతురి జీవితం నాశనం కాకుండా తప్పింది" అని అన్నారు.