Begin typing your search above and press return to search.

సైనికాధికారి నుండి పద్మశ్రీ పురస్కార గ్రహీతగా.. ఎవరీ బ్రెజిలియన్ వేద గురువు జోనాస్ మాసెట్టి ?

బ్రెజిల్ దేశంలోని రియో డి జెనిరియోలో జన్మించిన జోనాస్ మాసెట్టి, మిలిటరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ (IME) నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

By:  Tupaki Desk   |   30 May 2025 2:00 AM IST
సైనికాధికారి నుండి పద్మశ్రీ పురస్కార గ్రహీతగా.. ఎవరీ బ్రెజిలియన్ వేద గురువు జోనాస్ మాసెట్టి ?
X

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఆకర్షిస్తున్నాయి. మన జీవన విధానానికి ప్రభావితులై, ఇక్కడి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్న విదేశీయులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు బ్రెజిల్ దేశానికి చెందిన జోనాస్ మాసెట్టి. ఇక్కడ వేదాలను నేర్చుకోవడమే కాదు, వాటి గొప్పతనాన్ని తన దేశంలో ప్రచారం చేస్తూ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఆయన చేస్తున్న కృషికి స్వయంగా మన ప్రధాని మోదీ సైతం ప్రశంసలు కురిపించారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఆయన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇంతకీ ఈ జోనాస్ విశ్వనాథ్ మాసెట్టి ఎవరు? ఆయన ప్రయాణం ఎలా మొదలైంది? వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

బ్రెజిల్ దేశంలోని రియో డి జెనిరియోలో జన్మించిన జోనాస్ మాసెట్టి, మిలిటరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ (IME) నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రెజిలియన్ ఆర్మీలో ఐదేళ్ల పాటు సైనికాధికారిగా పనిచేశారు. సైన్యంలో విశేష సేవలందించిన తర్వాత, కొన్నాళ్లు కన్సల్టింగ్ స్టాక్ కంపెనీలలో కూడా పనిచేశారు. అయితే, ఆయన మనసు మాత్రం వేదాల వైపు, భారతీయ సంప్రదాయాల వైపే లాగింది. ఈ ఆకర్షణ ఎంత బలమైందంటే తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి భారతదేశానికి వచ్చి వేద విద్యను అభ్యసించాలని నిర్ణయించుకున్నారు.

భారతదేశానికి వచ్చిన తర్వాత, జోనాస్ మాసెట్టి తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉన్న అర్ష విద్యా గురుకులంలో చేరారు. అక్కడ ఏకంగా నాలుగేళ్ల పాటు నిష్టగా వేదాలను అభ్యసించారు. వేద జ్ఞానాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్న తర్వాత తిరిగి బ్రెజిల్‌కు వెళ్లారు. బ్రెజిల్‌లో ఆయన 'విశ్వ వైద్య' అనే ఆధ్యాత్మిక సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా వేదాల విలువను, వాటి సారాంశాన్ని, సనాతన ధర్మ గొప్పతనాన్ని తన దేశ ప్రజలకు బోధించడం ప్రారంభించారు. అంతేకాకుండా, ఈ జ్ఞానాన్ని మరింత మందికి చేరువయ్యేలా 'వేదాంత.లైఫ్' అనే వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించి టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటూ వేదాల విశిష్టతను ప్రపంచానికి చాటి చెబుతున్నారు.

జోనాస్ మాసెట్టి తన వేద అధ్యయనం, ప్రచారానికి గుర్తుగా తన పేరు చివరన 'విశ్వనాథ్'ను చేర్చుకోవడం విశేషం. ఆయన చేస్తున్న కృషిని స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నోసార్లు అభినందించారు. తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలోనూ జోనాస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. జోనాస్ తన 'ఫ్రీ ఓపెన్ కోర్సు' ద్వారా ఏడేళ్లలో సుమారు 1.5 లక్షలకు పైగా విద్యార్థులకు వేద విలువలను బోధించారని మోదీ తెలియజేశారు. ఆయన చేస్తున్న అద్భుతమైన ఆధ్యాత్మిక కృషికి గానూ భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో ఆయనను సత్కరించింది. 2024లో రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో వేద గురువు జోనాస్ చెప్పుల్లేకుండా, తెల్లటి ధోతి, నుదుటన తిలకంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. గతేడాది జరిగిన G20 శిఖరాగ్ర సమావేశానికి కూడా హాజరైన జోనాస్, తన బృందంతో కలిసి సంస్కృతంలో రామాయణాన్ని ప్రదర్శించి అలరించారు. జోనాస్ మాసెట్టి తన జీవితాన్ని వేదాలకు, సనాతన ధర్మానికి అంకితం చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఆధ్యాత్మికతను విస్తరిస్తున్న ఒక నిజమైన వేద గురువుగా నిలిచారు.