మేము మనుషులం కాదు.. కోతులం... నెట్టింట సంచలన వీడియో!
వివరాళ్లోకి వెళ్తే... ఒడిశాలోని ఒక కోతుల గుంపు ఉప్పునీటి మొసలి నుండి తన సహచరుడి కోసం సాహసోపేతమైన ప్రయత్నం చేసింది.
By: Tupaki Desk | 29 Dec 2025 3:50 PM ISTఇటీవల బెంగళూరులో మానవత్వం మరణించిన ఘటన ఒకటి తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే! తన భర్త రోడ్డుపై పడి గాయాలతో ఉండగా, నొప్పితో విలవిల్లాడుతుండగా.. సాయం కోసం అటుగా వెళ్తున్న పదుల సంఖ్యలో వాహనాలను ఓ మహిళ బ్రతిమాలింది.. ఆపమని అడిగింది. కానీ అక్కడ మానవత్వం మరుగైపోయింది! ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి! ఈ సమయంలో తాము మనుషులం కాదని.. తాము కోతులమని చెబుతున్నట్లున్న ఓ ఘటన సంచలనంగా మారింది.
అవును... ఒక కాకి చనిపోతే దాని చుట్టూ వందల సంఖ్యలో కాకులు వచ్చి చేరుతుంటాయి.. తమ తోటికి ప్రాణికి కష్టం వస్తే చాలా జంతువులు, పక్షులూ చుట్టూ చేరి, విలవిల్లాడిపోతుంటాయి.. తమకు వచ్చిన బాషలో తమ బాధను వ్యక్తపరుస్తుంటాయి! ఈ క్రమంలో తాజాగా ఓ భారీ మొసలి బారిన పడిన తమ సహచరుడి కోసం కోతుల గుంపు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. నీటిలో ఏనుగును సైతం ఓడించగలిగే మొసలిపై ఎదురు తిరిగింది.
వివరాళ్లోకి వెళ్తే... ఒడిశాలోని ఒక కోతుల గుంపు ఉప్పునీటి మొసలి నుండి తన సహచరుడి కోసం సాహసోపేతమైన ప్రయత్నం చేసింది. కెమెరాలో రికార్డైన ఈ సంఘటన కేంద్రపారా జిల్లాలోని మహాకలపాద ప్రాంతంలో జరిగింది. తాజాగా వైరల్ గా మారిన ఈ ఫుటేజ్ లో కోతుల పెద్ద గుంపు.. మొసలి వైపు ఈదుతూ, తమ సహచరుడిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది. ఇలా ఆపదలో ఉన్న తమ సహచరుడి కోసం మొసలితోనే పోరాటానికి అవి చేసిన ప్రయత్నం సంచలనంగా మారింది.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం... ఒక మొసలి అకస్మాత్తుగా దాడి చేసి కోతులలో ఒకదాన్ని నదిలోకి లాగేసింది. ఈ సమయంలో చాలా మంది మిగిలిన కోతులు పారిపోయి ఉంటాయని అనుకుంటారు! కానీ... అక్కడున్న మిగిలిన కోతులన్నీ ఒక్కసారిగా నీటిలోకి దూకి, తమ స్నేహితుడిని రక్షించే ప్రయత్నంలో మొసలిని వెంబడించాయి. కాకపోతే... వారి ఎంత తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఆ గుంపును అధిగమించిన మొసలి, పట్టుకున్న కోతిని చంపేసింది!
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వేళ.. నెటిజన్లు కామెంట్లతో స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా... వాటి మేధస్సు, సానుభూతి, త్యాగం, సహచరుడి కోసం నిలబడే ధైర్యాన్ని అభినందిస్తున్నారు. ఈ ఘటనను చూసి చాలా మంది మనుషులు చాలా విషయాలు నేర్చుకోవాలని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.
