పాక్ తాట తీసిన బ్రహ్మోస్.. అసలేం చేసింది?
తాజాగా లభిస్తున్న ఆధారాలతో ఆ క్షిపణుల్లో బ్రహ్మోస్ కూడా ఉందన్న అంశానికి బలం చేకూరింది.
By: Tupaki Desk | 12 May 2025 5:19 AMభారత - పాక్ ఉద్రిక్తతల వేళ.. ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడ్డ దాయాదికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది బ్రహ్మోస్ క్షిపణేనా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. రాజస్థాన్ లోని బికనీర్ లో పాక్ సరిహద్దు ప్రాంతంలో బ్రహ్మోస్ బూస్టర్.. నోస్ క్యాప్ లభించటం ఈ వాదనకు బలం చేకూరేలా చేసింది.
ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ మూలాల్ని పెకలిస్తూ పాక్ లోని బహావల్ పూర్ లో ఉన్న దాని హెడ్ క్వార్టర్ పై మే ఏడో తేదీ అర్థరాత్రి దాటిన తర్వాత భారత్ తన క్షిపణులతో విరుచుకుపడటం తెలిసిందే. బహావల్ పూర్ లోని జేషే భవనాల్ని కూల్చేందుకు శక్తివంతమైన క్షిపణుల్ని ప్రయోగించినట్లు భారత్ ప్రకటించినా.. అవేమిటో బయటకు రాలేదు. అయితే.. తాజాగా లభిస్తున్న ఆధారాలతో ఆ క్షిపణుల్లో బ్రహ్మోస్ కూడా ఉందన్న అంశానికి బలం చేకూరింది.
ఇప్పటివరకు బ్రహ్మోస్ క్షిపణుల్ని రియల్ టైంలో ప్రయోగించింది లేదు. పరీక్షలు జరపటం.. విజయవంతం కావటమే తప్పించి.. వార్ జోన్ లో వాడటం ఇదే తొలిసారి. అయితే.. ఈ విషయాల్ని కేంద్రం ధ్రువీకరించటం లేదు. ఈ క్షిపణి గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మోస్ క్షిపణి సత్తా ఆపరేషన్ సిందూర్ తో ప్రపంచానికి తెలిసి వచ్చిందన్న ఆయన.. ‘‘ఆ దెబ్బను రుచి చూసిన పాక్ ను అడిగి తెలుసుకోవచ్చు’’ అని వ్యాఖ్యానించారు. తాజాగా లక్నోలోని బ్రహ్మోస్ ఏరో స్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదం కుక్కతోక లాంటిదని.. దాన్నెప్పటికి సరి చేయలేమని.. కాకుంటే ఉగ్రవాదులకు వారికి అర్థమయ్యే భాషలోనే బుద్ది చెప్పాలన్నారు. బ్రహ్మోస్ సత్తా గురించి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన.. వేగవంతమైన సూపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. శత్రువులకు సింహస్వప్నం. లక్నోలో ప్రారంభించిన కేంద్రంలో 290 నుంచి 400 కి.మీ. దూరంలోని లక్ష్యాల్ని చేధించే బ్రహ్మోస్ క్షిపణుల్ని తయారు చేస్తారు. ఇది శక్తివంతమైన ఆయుధమే కాదు.. మన సాయుధ బలగాల అయేమ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక సందేశంగా పేర్కొన్నారు. ఇంతవరకు బయటకు రాని బ్రహ్మోస్ సత్తా.. ఆదివారం చోటు చేసుకున్న పరిణామాలతో వెలుగు చూసిందని చెప్పాలి.