‘బ్రహ్మోస్’ కు జన్మనిచ్చిన దార్శనికుడి గురించి తెలుసా?
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్థాన్ లోపల అనేక కీలకమైన ప్రాంతాలను కచ్చింతమైన లక్ష్యంతో కొట్టింది భారత్.
By: Tupaki Desk | 18 May 2025 10:00 PM ISTఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్థాన్ లోపల అనేక కీలకమైన ప్రాంతాలను కచ్చింతమైన లక్ష్యంతో కొట్టింది భారత్. ఈ సమయంలో స్వదేశీంగా అభివృద్ధి చేసిన ఆయుధాలను ఉపయోగించింది. ఇందులో బ్రహ్మోస్ క్షిపణి పాత్ర అత్యంత కీలకం అని చెబుతున్నారు. దీంతో.. అసలు ఈ క్షిపణి ఎప్పుడు, ఎలా, ఎవరివల్ల తయారైంది అనేది ఇప్పుడు చూద్దామ్..!
భూమి, సముద్రం, గాలి నుంచి దాడి చేయడానికి అనుకూలంగా రూపొందించబడిన బ్రహ్మోస్ క్షిపణులు.. పాక్ లోని మురిద్కే, నూర్ ఖాన్, రహీమ్ యార్ ఖాన్, రఫీకి, సుక్కూర్, చునియా వంటి కీలక సైనిక స్థావరాలను విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ సమయంలో ఇంతటి ప్రాముఖ్యమైన బ్రహ్మోస్ క్షిపణి అభివృద్ధిలో "క్షిపణి మనిషి" అబ్దుల్ కలాం కీలక పాత్ర పోషించారు.
అవును... భారత మాజీ రాష్ట్రపతి, క్షిపణి మనిషిగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.. బ్రహ్మోస్ క్షిపణి అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీ.ఆర్.డీ.వో.) అధిపతిగా.. ఆయన భారత్ - రష్యా మధ్య ప్రభుత్వ స్థాయి భాగస్వామ్యానికి నాయకత్వం వహించారు. ఈ క్షిపణి పుట్టుకకు కారకులయ్యారు!
1998లో డాక్టర్ అబ్దుల్ కలాం.. మాస్కోలో రష్యా డిప్యూటీ డిఫెన్స్ మిఖైలోవ్ మధ్య ఈ మేరకు చారిత్రక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై వీరిద్దరూ సంతకం చేశారు. ఇది బ్రహ్మోస్ ఎరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపనకు దారి తీసింది. ఇందులో భారతదేశం వాటా 50.5% కాగా.. రష్యా వాటా 49.5% గా నిర్ణయించబడింది.
ఇలా.. డాక్టర్ అబ్దుల్ కలాం కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు.. స్వయం సమృద్ధి, అంతర్జాతీయ సహకారం కలిపి బ్రహ్మోస్ వంటి ప్రాజెక్టుకు జన్మనిచ్చిన దార్శనికుడిగా నిలిచారు. ఇదే సమయంలో.. నేడు ఆ బ్రహ్మోస్... భారత రక్షణ సామర్థ్యానికి చిరస్మరణీయ చిహ్నంగా, డాక్టర్ అబ్దుల్ కలాం దార్శనికతకు నిదర్శనంగా నిలుస్తోంది.
వాస్తవానికి భారతదేశంలో సొంతంగా క్షిపణి తయారీ 1983లో ప్రారంభమైంది. దీనిపేరు ఇంటిగ్రేటెడ్ గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (ఐజీఎండీపీ). అయితే.. 1990లలో జరిగిన గల్ఫ్ యుద్ధం అత్యాధునిక క్రూయిజ్ క్షిపణి తక్షణ అవసరాన్ని హైలెట్ చేసింది. ఈ నేపథ్యంలోనే రష్యాతో లోతైన సహకారం వైపు అడుగులు పడ్డాయి.. ఫలితంగా, బ్రహ్మోస్ పుట్టింది!
ఈ క్రమంలో దీని మొదటి విజయవంతమైన పరీక్ష 2001 జూన్ 12న... డీల్.ఆర్.డీ.ఓ, రష్యా ఎన్.పీ.ఓ.ఎం. కంపెనీల ఉమ్మడి ప్రయత్నం ఫలితంగా జరిగింది. అదే నేడు ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణులలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఇక... భారత్ లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్క్వా నదుల పేర్లను కలిపి.. ఈ క్షిపణికి “బ్రహ్మోస్” అని నామకరణం చేశారు.
