టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వైరల్ వీడియో.. రెండు పోలీసు కేసులు, అయినా తగ్గని భూమన!
గత కొన్ని రోజులుగా టీటీడీ కేంద్రంగా అనేక వివాదాలు రాజకీయ రచ్చ సృష్టిస్తున్నాయి.
By: Tupaki Political Desk | 3 March 2026 4:55 PM ISTటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కేంద్రంగా పొలిటికల్ డ్రామా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఓ మహిళతో టీటీడీ చైర్మన్ సన్నిహితంగా ఉన్నారంటూ ఓ వీడియో రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ వీడియోను మార్ఫింగ్ చేశారంటూ టీటీడీ చైర్మన్ ఖండించారు. అంతేకాకుండా తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఆ వీడియో ద్వారా తమ వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారంటూ ఇద్దరు మహిళలు పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు అనైతిక వ్యవహారాలకు పాల్పడిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా హాట్ డిబేట్ కు తెరలేపింది.
గత కొన్ని రోజులుగా టీటీడీ కేంద్రంగా అనేక వివాదాలు రాజకీయ రచ్చ సృష్టిస్తున్నాయి. తాజాగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై విమర్శలు చేస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని వైసీపీ అనుకూల వర్గాలు వైరల్ చేస్తున్నాయి. ఇదే సమయంలో ఈ వ్యవహారానికి సంబంధించి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ నాయుడు చెబుతున్నట్లు అది ఏఐ వీడియో కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నిపుణులు ధృవీకరించారని భూమన కొన్ని పత్రాలు చూపుతున్నారు.
అదే సమయంలో వీడియోలో ఉన్న మహిళతో తనకు 30 ఏళ్ల నుంచి అనుబంధం ఉందని బీఆర్ నాయుడు చెప్పారని భూమన గుర్తు చేశారు. అంతేకాకుండా 2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ కు ఆ మహిళ రాసిన లేఖ ఇది అంటూ భూమన ఓ లేఖ బయటపెట్టారు. ‘‘రిలేషనషిప్ విత్ బీఆర్ నాయుడు’’ అంటూ ఆయన ఆ లేఖ చదవి వినిపించారు. ఈ లేఖ ద్వారా బీఆర్ నాయుడిది తప్పని తేలిందని వ్యాఖ్యానించిన భూమన ఆయన తక్షణం రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.
వీడియో ద్వారా చైర్మన్ నాయుడిదే తప్పని భూమన ఆరోపిస్తుండగా, ఆ వీడియో ద్వారా తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మరో మలుపు తిరిగిందని చెబుతున్నారు. మార్ఫింగ్ చేసిన వీడియో, ఫొటోలను కొంతమంది సోషల్ మీడియాలో పోస్టు చేశారంటూ హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేయగా, అసలు పరిచయమే లేని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో వివాహేతర సంబంధం అంటకట్టారంటూ తెనాలికి చెందిన మరో మహిళ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో వైరల్ పోస్టులపై కొందరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు నిజమా? కల్పితమా? అనేది ఉత్కంఠ రేపుతోంది. వీడియోలో కనిపిస్తున్న ముగ్గురు ఫేక్ అంటూ ఖండిస్తుండటంతో అసలు ఆ పుటేజ్ ఎలా బయటకు వెళ్లింది? నిజమైన ఫుటేజ్ లో ఏముంది అన్నదానిపై క్లారిటీ రావాల్సివుందని అంటున్నారు.
