Begin typing your search above and press return to search.

బంగ్లాదేశ్ లో బాయ్ కాట్ భారత్? ఏమిటీ లొల్లి?

ఈ ప్రచారానికి దన్నుగా భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల్ని కొనొద్దని.. వాడొద్దని బంగ్లాదేశ్ ప్రజల్ని కోరుతున్నారు.

By:  Tupaki Desk   |   2 April 2024 5:48 AM GMT
బంగ్లాదేశ్ లో బాయ్ కాట్ భారత్? ఏమిటీ లొల్లి?
X

బంగ్లాదేశ్.. ఈ దేశ ఉనికికి కారణం భారతదేశం. వారి ఆశలకు.. ఆకాంక్షలకు తగ్గట్లు బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసిన భారత్ అంటే.. ఆ దేశీయుల్లో ప్రత్యేకమైన అభిమానం ఉంటుందన్న సంగతి తెలిసిందే. భారత్ తో అత్యంత సుదీర్ఘమైన భూసరిహద్దు కలిగి ఉన్న ఈ దేశం వాణిజ్య అవసరాల కోసం మన మీద ఆధారపడుతుంది. అంతేకాదు.. భారత్ కు ఎంతో దగ్గరైన దేశంగా పేరుంది. అలాంటి దేశంలో ఇప్పుడు కొత్తగా బాయ్ కాట్ భారత్ అన్న నినాదం మొదలు కావటమే కాదు.. అంతకంతకూ విస్తరిస్తోంది. దీనికి కారణమేంటి? దీని వెనుకున్నదెవరు? దీనిపై అక్కడి ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికార పార్టీ స్టాండ్ ఏంటి? విపక్షం తీరు ఎలా ఉంది? ఇప్పుడే ఈ వ్యవహారం తెర మీదకు రావటానికి కారణాలు ఏమని చెబుతున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని వెతికితే.. అసలీ అంశంపై క్లారిటీ రావటం ఖాయం.

ప్రస్తుతం బంగ్లాదేశ్ కు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు షేక్ హసీనా. ఆమె ఈ జనవరిలో ఐదోసారి అధికారంలోకి వచ్చారు. ఆమె పవర్లోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా మొదలైన ఈ ప్రచారం అంతకంతకూ పెరిగి.. ఉద్యమంగా మారింది. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందని.. తమసొంత ప్రయోజనాల కోసమే షేక్ హసీనాను మళ్లీ ప్రధానిగా చేస్తున్నారంటూ ఐరోపా.. అమెరికాలో ఉంటున్న ప్రవాస బంగ్లాదేశీయులు ఈ ప్రచారాన్ని మొదలు పెట్టారు.

ఈ ప్రచారానికి దన్నుగా భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల్ని కొనొద్దని.. వాడొద్దని బంగ్లాదేశ్ ప్రజల్ని కోరుతున్నారు. ప్రస్తుతం పారిస్ లో ఉంటున్న బంగ్లాదేశీ వైద్యుడు పినాకీ భట్టాచార్య ఈ ఆన్ లైన్ ఉద్యమానికి తెర తీసినట్లుగా చెబుతారు. ప్రవాసీ బంగ్లాదేశీల పిలుపుతో బంగ్లాదేశ్ లోని కొన్ని వర్గాలు ఈ నినాదానికి మద్దతు ఇవ్వటంతో దీన్ని రాజకీయ అస్త్రంగా మార్చింది అక్కడి ప్రతిపక్ష పార్టీ బీఎన్ పీ.

బాయ్ కాట్ భారత్ నినాదాన్ని అందిపుచ్చుకొని ప్రధాని షేక్ హసీనా భారత అవసరాల కోసమే పని చేస్తున్నట్లుగా ప్రచారాన్ని షురూ చేశారు. తమ వాదనకు బలం చేకూరేలా వారు కొన్ని వాదనల్ని వినిపిస్తున్నారు. అందులో ముఖ్యమైనది.. తాజాగా ముగిసిన బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు. ఇవి అత్యంత వివాదాస్పదమైనవిగా ముద్ర పడింది. ప్రతిపక్షాలు ఎన్నికల్ని బహిష్కరించినప్పటికీ హసీనా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ఆమె విజయం సాధించారన్న వార్తలు వచ్చినంతనే.. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆమెకు శుభాకాంక్షలు తెలపటం.. తమ మద్దతును ప్రకటించటమే దీనికి నిదర్శనంగా పేర్కొంటున్నారు.

అయితే.. బాయ్ కాట్ బంగ్లాదేశ్ ఉద్యమం అక్కడి ప్రజల్లో కాకుండా రాజకీయ ఎజెండాతోనే మొదలైనట్లుగా పలువురు వాదనలు వినిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం ట్రెండింగ్ లో ఉన్నదే తప్పించి వాస్తవంలో ఈ అంశానికి అంత జనాదరణ లేదంటున్నారు. బాయ్ కాట్ భారత్ ఉద్యమంపై ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల్ని బాయ్ కాట్ చేయాలంటే ప్రతిపక్ష బీఎన్ పీ నేతలు ముందు తమ భార్యల చీరలన్నింటికి కాల్చేయాలన్నారు.

బీఎన్ పీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతల భార్యలు భారత్ కు వెళ్లి భారీ సంఖ్యలో చీరలు కొనుక్కొని రావటం.. వాటిని బంగ్లాదేశ్ లో అమ్మటం చూశానని చెప్పిన ఆమె.. ‘వాటన్నింటిని కాల్చేస్తారా? భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న మసాలాలు.. ఉల్లిపాయలు.. అల్లం.. వెల్లుల్లి లాంటివి లేకుండా విపక్ష నేతలు.. వారి కుటుంబాలు తమ వంటల్ని తయారు చేసుకొని తినాలి’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. మాల్దీవుల్లోనూ భారత వ్యతిరేక నినాదంతోనే అక్కడ అధికారంలోకి వచ్చారు మయిజ్జు. తాజాగా బంగ్లాదేశ్ లోనూ ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేస్తున్న వైనం చూస్తే.. సమ్ థింగ్ రాంగ్ అన్న భావన కలుగక మానదు. ఇదిలా ఉంటే రంజాన్ నేపథ్యంలో బంగ్లాదేశ్ కు 50వేల టన్నుల ఉల్లిగడ్డల్ని పంపాలని భారత్ నిర్ణయించటం గమనార్హం. ఏమైనా ఈ తరహా ఉద్యమాల్ని షురూ చేసే వారి బ్యాక్ గ్రౌండ్ విషయంలో భారత మీడియా సైతం చురుగ్గా పని చేయటంతో పాటు.. అందులోని కుట్రల్ని చేధించాల్సిన అవసంర ఉందని చెప్పక తప్పదు.