తుర్కియేను చావుదెబ్బ తీసిన భారత్
అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు.. కేవలం ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని అంటారు.
By: A.N.Kumar | 10 Feb 2026 5:00 AM ISTఅంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు.. కేవలం ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని అంటారు. కానీ ఒక దేశ అంతర్గత విషయాల్లో పదే పదే తలదూర్చుతూ శత్రు దేశానికి వంత పాడుతుంటే చూస్తూ ఊరుకునే రోజులు పోయాయని భారత్ నిరూపిస్తోంది. ముఖ్యంగా తుర్కియే విషయంలో భారతీయులు ప్రదర్శిస్తున్న 'ఆర్థిక నిరసన' ఇప్పుడు ఆ దేశ పర్యాటక రంగాన్ని కుదిపేస్తోంది. భారత్‌ను తక్కువ అంచనా వేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పడానికి తుర్కియే తాజా ఆర్థిక గణంకాలే నిదర్శనం.
చితికిన పర్యాటక రంగం: అంకెల్లో వాస్తవాలు
తుర్కియే ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం ఒక కీలక వెన్నెముక. భారతీయులు విదేశీ యాత్రల కోసం అత్యధికంగా ఎంచుకునే దేశాల్లో తుర్కియే ఒకటి. అయితే గత రెండేళ్ల గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి తలకిందులైందని స్పష్టమవుతోంది. 2024లో సుమారు 3.30 లక్షల మంది భారతీయులు తుర్కియేను సందర్శించగా 2025 నాటికి ఆ సంఖ్య 2.5 లక్షలకు పడిపోయింది. కేవలం ఒక్క ఏడాదిలోనే 25 శాతం మేర పర్యాటకుల సంఖ్య తగ్గడం అంటే అది ఆ దేశ హోటళ్లు, విమానయాన సంస్థలు, స్థానిక వ్యాపారాలపై ఎంతటి తీవ్ర ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.
రాజకీయ అతివ్యాప్తి
తుర్కియే అధ్యక్షుడు రెజెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అవలంబిస్తున్న భారత్ వ్యతిరేక ధోరణే ఈ పతనానికి ప్రధాన కారణం. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడం ఎర్డోగాన్ చేస్తున్న పెద్దతప్పుగా చెప్పొచ్చు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వడమే కాకుండా అజర్‌బైజాన్‌తో కలిసి ఆయుధ సరఫరా చేస్తున్నారన్న వార్తలు భారతీయులను ఆగ్రహానికి గురిచేశాయి. ప్రభుత్వాల మధ్య దౌత్యపరమైన విబేధాల కంటే సామాన్య భారతీయుడు తన పర్యటనను రద్దు చేసుకోవడం ద్వారా ఇచ్చిన 'ఆర్థిక సందేశం' తుర్కియేకు గట్టిగా తగిలింది.
'బాయ్‌కాట్' - ఒక శక్తివంతమైన ఆయుధం
సోషల్ మీడియా వేదికగా సాగిన #BoycottTurkey ఉద్యమం కేవలం హ్యాష్‌ట్యాగ్‌లకే పరిమితం కాలేదు. ఇది ఒక దేశం యొక్క బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయగలదని నిరూపించింది. భారత్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్. భారతీయుల పర్యటనలు, పెట్టుబడులు , కొనుగోలు శక్తి ఏ దేశానికైనా వరం. దాన్ని కాదనుకుని భారత్ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే భవిష్యత్తులో మరింత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
భారత్‌తో పెట్టుకుంటే అంతే!
తుర్కియే ఉదంతం ప్రపంచ దేశాలకు ఒక స్పష్టమైన హెచ్చరిక. భారత్ కేవలం సైనిక శక్తిలోనే కాదు.. ప్రజల ఐక్యతలోనూ, ఆర్థిక శక్తిలోనూ తిరుగులేని మేటి అని రుజువైంది. "ఆత్మనిర్భర్ భారత్" అంటే కేవలం వస్తువుల తయారీ మాత్రమే కాదు, దేశ ప్రయోజనాల కోసం స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకోగల భారతీయుల ఆత్మవిశ్వాసం కూడా. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను వ్యతిరేకించే ముందు.. ఆ దేశాలు తమ ఆర్థిక ప్రయోజనాలను ఒక్కసారి బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే తుర్కియేలాగానే గుణపాఠం తప్పదు.
