Begin typing your search above and press return to search.

బాయ్ కాట్ తుర్కియే ఎఫెక్ట్ ఎంత ఎక్కువంటే?

తుర్కియోతో పాటు అజర్ బైజాన్ లపైనా భారతీయుల్లో కోపం కనిపిస్తోంది. ఇప్పటివరకు పర్యాటక దేశాలుగా.. భారతీయుల జాబితాలో ఎక్కువగా ఉండే ఈ రెండు దేశాలకు వెళ్లేందుకు భారతీయులు ససేమిరా అంటున్నారు.

By:  Tupaki Desk   |   15 May 2025 10:15 AM IST
బాయ్ కాట్ తుర్కియే ఎఫెక్ట్ ఎంత ఎక్కువంటే?
X

ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్ కు బాహాటంగా మద్దతు ప్రకటించటమే కాదు.. వారికి సైనిక సాయాన్ని అందించిన తుర్కియే మీద భారతీయుల్లో అగ్రహం అంతకంతకూ పెరుగుతోంది. తుర్కియోతో పాటు అజర్ బైజాన్ లపైనా భారతీయుల్లో కోపం కనిపిస్తోంది. ఇప్పటివరకు పర్యాటక దేశాలుగా.. భారతీయుల జాబితాలో ఎక్కువగా ఉండే ఈ రెండు దేశాలకు వెళ్లేందుకు భారతీయులు ససేమిరా అంటున్నారు.

ఇటీవల షురూ అయిన బాయ్ కాట్ తుర్కియే ఎఫెక్ట్ ఎంత ఎక్కువగా ఉందంటే.. ఈ రెండు దేశాలకు సంబంధించిన బుకింగ్ క్యాన్సిలేషన్లు ఏకంగా 250 శాతానికి చేరుకున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. దేశ వ్యాప్తంగా పలు ట్రావెల్ ఏజెన్సీలు ఈ రెండు దేశాలకు ఆన్ లైన్ బుకింగ్ లను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించాయి. కొత్త బుకింగ్ లు 60 శాతం పడిపోయాయని.. క్యాన్సలేషన్లు 250 శాతానికి చేరినట్లుగా ట్రావెల్ సంస్థ మేక్ మై ట్రిప్ వెల్లడించింది.

తుర్కియే.. అజర్ బైజాన్ లకు బాయ్ కాట్ నినాదం ప్రభావం గడిచిన వారం రోజుల్లో స్పష్టంగా కనిపిస్తోందని.. ఈ రెండు దేశాలకు బుకింగ్ లు అరవై శాతం తగ్గగా.. గత ఏడాదితో పోలిస్తే క్యాన్సిలేషన్లు చేసుకునే వారి సంఖ్య 250 శాతం పెరిగినట్లుగా మేక్ మై ట్రిప్ చెబుతోంది. దేశ సంఘీభావానికి.. మన సాయుధ బలగాలపై గౌరవంతో పర్యాటకుల నిర్ణయాన్ని తాము కూడా గౌరవిస్తున్నట్లు మేక్ మై ట్రిప్ చెబుతోంది. అత్యవసర ప్రయాణాల్ని మాత్రమే తాము సూచిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

కొద్ది రోజుల క్రితమే మరో పర్యాటక బుకింగ్ పోర్టల్ ఈజీమైట్రిప్ సైతం ఈ రెండు దేశాలకు సంబంధించి ఈ తరహా ప్రకటనే చేయటం తెలిసిందే. గత వారంలో తుర్కియేకు 22 శాతం.. అజర్ బైజాన్ కు 30 శాతం క్యాన్సిలేషన్లు జరిగినట్లుగా ఆ సంస్థ చెబుతోంది. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారిని రద్దు చేసుకోవద్దని చెప్పినా.. టూరిస్టులు మాత్రం ఆ దేశాలకు వెళ్లేందుకు అస్సలు ఇష్టం చూపటం లేదని చెబుతున్నారు. మరోవైపు బాయ్ కాట్ తుర్కియేలో భాగంగా ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే టర్కీ యాపిల్స్ ను అమ్మేందుకు హోల్ సేలర్లు మాత్రం నో చెప్పటం తెలిసిందే.

తుర్కియే యాపిల్స్ ను సీజన్ లో దాదాపు రూ.1000 నుంచి రూ.1200 కోట్ల వరకు టర్నోవర్ ఉంటుందని చెబుతారు. దీంతో.. వ్యాపారులు టర్కీ యాపిల్స్ ను బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయంతో పండ్ల మార్కెట్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా హిమాచల్.. ఉత్తరాఖండ్.. ఇరాన్.. ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొత్తంగా బాయ్ కాట్ తుర్కియే నినాదం అంతకంతకూ విస్త్రతమవుతుందని చెప్పక తప్పదు.