Begin typing your search above and press return to search.

గెలుపుపై జగన్‌ ధీమా... సీఎం ప్రమాణస్వీకారం ఎప్పుడో చెబుతున్న బొత్స!

ఈ సమయంలో... తాజాగా మీడియా ముందుకు వచ్చిన బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   14 May 2024 2:02 PM GMT
గెలుపుపై జగన్‌ ధీమా... సీఎం ప్రమాణస్వీకారం ఎప్పుడో చెబుతున్న బొత్స!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. ఈ మేరకు దేశంలో చివరి దశ ఎన్నికలు పూర్తయిన అనంతరం జూన్ 4న ఫలితాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక జూన్ 1 వరకూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పలు విశ్లేషణలు... వైసీపీ గెలుపును కన్ఫాం చేస్తున్నాయనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తుంది. ఈ సమయంలో వైసీపీ నేతలు మరింత ధీమాగా కనిపిస్తుండటం గమనార్హం.

అవును... ఏపీలో పోలింగ్ ముగిసింది. ఈ సమయంలో ఏపీలో కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుందని.. అన్ని స్థానాల్లో కూటమే గెలవబోతోందని చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... తాజాగా మీడియా ముందుకు వచ్చిన బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా... ఎన్నికల వేళ టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిందని తెలిపారు.

ఈ సందర్భంగా జూన్ 4న వచ్చే ఫలితాల్లో వైసీపీ విజయం ఖాయమని చెప్పిన బొత్స సత్యనారాయణ... విశాఖలోనే రెండోసారి సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమం కన్నులపండుగగా జరుగుతుందని చెబుతూ.. ఆ ప్రమాణ స్వీకార తేదీని రేపు లేదా ఎల్లుండు ప్రకటిస్తామని వెల్లడించారు. దీంతో... ఈ ధీమా వైరల్ గా మారింది.

ఆ సంగతి అలా ఉంటే... అంతకంటే ముందు ట్విట్టర్ వేదికగా స్పందించిన జగన్.. గెలుపుపై మరింత ధీమా వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా... "నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని అన్నారు.

ఇదే సమయంలో... "మన వైఎస్సార్సీపీ పార్టీ గెలుపు కోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను" అని ఆ ట్వీట్ ను కొనసాగించారు. దీంతో... వైసీపీ గెలుపుపై జగన్ & కో ధీమా చూస్తుంటే.. వారికి పక్కా సమాచారం ఉన్నట్లుందనే కామెంట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి!