Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రా బాధ్యతలు బొత్స మీదనేనా...!?

బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మికి విశాఖ ఎంపీ సీటు ఇవ్వాలనుకోవడం అందులో భాగమని అంటున్నారు

By:  Tupaki Desk   |   9 Jan 2024 3:30 AM GMT
ఉత్తరాంధ్రా బాధ్యతలు బొత్స మీదనేనా...!?
X

వైసీపీ సీనియర్ల మీద మరోమారు భారం పెట్టబోతోంది. రాయలసీమ జిల్లాలకు సంబంధించి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదనే కీలకమైన బాధ్యతలు పెట్టిన వైసీపీ కోస్తాలో సైతం సీనియర్ నేతల మీదనే బరువు పెట్టింది. ఇక ఉత్తరాంధ్రా జిల్లాలకు సంబంధించి సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మీదనే భారాలు అన్నీ మోపే చాన్స్ ఉంది.

బొత్స సత్యనారాయాణ మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేత. పైగా శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాలలో ఆయనకు అనుచర గణం ఉంది. సామాజిక నేపధ్యం దృష్ట్యా ఈ మూడు జిల్లాలలో బొత్సకు దన్ను బాగా ఉంది. దాంతో ఆయనతోనే చక్రం తిప్పాలని వైసీపీ డిసైడ్ అయింది అంటున్నారు.

బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మికి విశాఖ ఎంపీ సీటు ఇవ్వాలనుకోవడం అందులో భాగమని అంటున్నారు. దాంతో విశాఖ సిటీ మీద బొత్స మార్క్ పాలిటిక్స్ చూపిస్తారు అని అంటున్నారు. విశాఖ ఎంపీ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ రోజుకు చూసుకుంటే టీడీపీకి మెజారిటీ సీట్లలో పట్టు ఉంది. దాన్ని బ్రేక్ చేయాలంటే బొత్స వంటి సీనియర్ ని దింపడమే మార్గం అని ఆలోచిస్తున్నారు.

ఆయన సతీమణి ఎంపీగా పోటీలో ఉంటే అసెంబ్లీ సీట్లలో కూడా వైసీపీకి బలం పెరగడమే కాకుండా మెజారిటీ సీట్లు కైవశం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా విజయనగరం జిల్లాలో ఎటూ బొత్స మార్క్ ఉంటుంది. ఇక శ్రీకాకుళం జిల్లాకు బొత్స ఇంచార్జిగా ఉన్నారు. దాంతో అక్కడ కూడా పార్టీని విజయపధంలో నడిపించే బాధ్యతలను ఆయనకు అప్పగించారు అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే బొత్స ఈసారి ఉత్తరాంధ్రాలోని మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో అత్యధికం వైసీపీ పరం చేయాల్సిన గురుతర బాధ్యతలను తలకెత్తుకుంటున్నారు అని అంటున్నారు. గతసారి ఎన్నికల్లో ఉత్తరాంధ్రా రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి మూడు జిల్లాలను సక్సెస్ ఫుల్ గా వైసీపీ వైపు నడిపించారు. 2019 ఎన్నికల్లో జగన్ హవా గొప్పగా సాగింది. దాంతో మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గానూ 28 సీట్లను వైసీపీ గెలుచుకుని అద్భుతమైన రికార్డుని క్రియేట్ చేసింది.

ఈసారి కేవలం సామాజిక నేపధ్యంతో పాటు రాటు దేలిన రాజకీయ వ్యూహాలను అమలు చేయడం ద్వారానే విజయం సొంతం చేసుకోవాల్సి ఉంది. అందుకే బొత్స మీదనే వైసీపీ బాధ్యతలు పెడుతోంది అని అంటున్నారు. ఇక ఉత్తరాంధ్రా జిల్లాల ఇంచార్జిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయిస్తారు అని టాక్ నడుస్తోంది.

దాంతో ఆయన ఎన్నికల వేళ విశాఖలో పార్టీని నడిపించేందుకు సిద్ధంగా ఉండలేరు అని అంటున్నారు. దాంతో పాటు వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టాక పార్టీ గ్రాఫ్ కొంత తగ్గిందని కూడా అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలను గమనంలోకి తీసుకున్న వైసీపీ అధినాయకత్వం బొత్స వంటి లోకల్ లీడర్ కే బాధ్యతలు ఇస్తే పార్టీకి అదే సక్సెస్ రూట్ వేస్తుంది అని తలపోస్తోంది అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.