Begin typing your search above and press return to search.

ఏపీలో టీచర్ల జీతాలెప్పుడంటే... విషయం చెప్పిన బొత్స!

ఈ నేపథ్యంలో టీచర్స్ డే సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆలస్యానికి గల కారణాలు వివరించారు.

By:  Tupaki Desk   |   5 Sep 2023 1:36 PM GMT
ఏపీలో టీచర్ల జీతాలెప్పుడంటే... విషయం చెప్పిన బొత్స!
X

ఏపీలో కొన్ని డిపార్ట్మెంట్లలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆలస్యం అవుతున్నాయంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీచర్ల జీతాలు ఆలస్యం అయ్యాయి! ఈ నేపథ్యంలో టీచర్స్ డే సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆలస్యానికి గల కారణాలు వివరించారు.

అవును... ఏపీలో టీచర్లకు జీతాలు ఆలస్యం కావడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. గురుపూజోత్సవం సందర్భంగా విశాఖ ఏయూ కన్వెన్షన్‌ హాల్‌ లో జరిగిన కార్యక్రమంలో ఈ విషయాలపై వివరణ ఇచ్చారు. ఏపీలో టీచర్లకు జీతాలు ఇంకా వేయలేదనే విమర్శలపై అసహనం వ్యక్తం చేసిన ఆయన... సాంకేతిక కారణాలతోనే జీతాలు ఆలస్యం అయ్యాయని క్లారిటీ ఇచ్చారు!

కేవలం సాంకేతిక కారణాలతోనే జీతాలు ఆలస్యం అవుతున్నాయని, అంతే తప్ప మరో కారణం లేదని తెలిపిన బొత్స... ఈ నెల 7న లేదా 8వ తేదీల్లో టీచర్లకు వేతనాలు జమ చేస్తామని బొత్స తెలిపారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించారు. గురుపూజోత్సవం వేళ ఈ కార్యక్రమం విశాఖలో ఘనంగా జరిగింది.

ఇదే సమయంలో యూనివర్శిటీలలోని నియామకాలపైనా బొత్స స్పందించారు. ఇందులో భాగంగా... రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాలు లేకపోవడానికి గత ప్రభుత్వ విధానాలే కారణం అని తెలిపిన ఆయన... ప్రస్తుతం నియామకాలపై సీఎం జగన్‌ దృష్టిసారించారని అన్నారు.

ఇందులో భాగంగా రాష్ట్రంలో సుమారు 3,200 పోస్టులు భర్తీ చేయాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించినట్లు బొత్స వెల్లడించారు. ఈ ప్రక్రియ ఆలస్యం కాదని.. నెల రోజుల్లోనే ఈ నియామక ప్రక్రియ చేపడతామని తెలిపారు. ఇదే సమయంలో నాడూ నేడూ కార్యక్రమంపైన స్పందించిన బొత్స... ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చిన సమూల మార్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

గతంలో ప్రభుత్వ పాఠశాలలు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపిన మంత్రి... నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. ఫలితంగా... ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ముందు "సీట్లు లేవు" అనే బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఏపీలో తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను పరిశీలించాలని నీతి ఆయోగ్ కూడా చెబుతోందని అన్నారు!

ఇదే క్రమంలో గతంలో ఇతర రాష్ట్రాల విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకునే వారని.. కాని ఇప్పుడు మాత్రం ఏపీ రాష్ట్ర విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నారని తెలిపిన బొత్స... విద్య కోసం సీఎం జగన్‌ రూ.12వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఇందులో భాగంగా సుమారు 60వేల క్లాస్ రూములలో డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు!