Begin typing your search above and press return to search.

వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు... బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాలంటీర్లు కు సంబంధించిన విషయాలు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత చర్చనీయాంశం అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   1 April 2024 10:45 AM GMT
వాలంటీర్ల మూకుమ్మడి  రాజీనామాలు... బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాలంటీర్లు కు సంబంధించిన విషయాలు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత చర్చనీయాంశం అవుతున్నాయి. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వొద్దని.. రేషన్ పంపిణీలోనూ వారి పాత్ర ఉండకూడదంటూ తాజాగా విడుదలైన ఆదేశాల మేరకు... పని చేయకుండా జీతం తీసుకోవడం ఎందుకు అనుకున్నారో.. లేక, మరేదైనా కీలకమైన కారణం ఉందో తెలియదు కానీ... రాష్ట్ర వ్యాప్తంగా మూకుమ్మడి రాజీనామాలకు తెరలేపారు వాలంటీర్లు!

అవును... ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల క్రితం 2.67 లక్షల మంది వాలంటీర్లను నియమించిన సంగతి తెలిసిందే. వీరంతా సుమారు నాలుగున్నరేళ్లకు పైగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు - లబ్దిదారులకూ వారదులుగా ఉంటున్నారు. ప్రధానంగా వృద్ధులకు పెన్షన్ ని ఒకటోతేదీన ఇంటికి పట్టుకెళ్లి ఇవ్వడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

అయితే... ఇలా ప్రభుత్వ పథకాలను వాలంటీర్లు పంపిణీ చేయడాన్ని ఆపాలంటూ కొంతమంది పిటిషన్లు వేయడం, ఫిర్యాదులు చేయడంతో... వీరితో పెన్షన్స్ ఇప్పించొద్దని, రేషన్ పంపిణీ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. మరోపక్క పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు కనిపించిన వాలంటీర్లను ఎప్పటికప్పుడు సస్పెండ్ చేస్తూనే ఉన్నారు. ఈ సమయంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.

ఇందులో భాగంగా ఆ సంస్థకు సంబంధించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్, మొదలైన వారు.. వృద్ధులకు అందించే పెన్షన్, మొదలైన సంక్షేమ పథకాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కోరారు! దీంతో... అవ్వాతాతల ఉసురు తీసుకుంటున్నారు.. పేదల నోట్లో మట్టికొడుతున్నారంటూ చంద్రబాబు & కో పై వైసీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాల బాట పట్టారు.

వాస్తవానికి ఈసీ ఆదేశాలు రాకముందు వివిధ కారణాలతో పలువురు వాలంటీర్లు రాజీనామాలు చేసినా... అవి కేవలం పదుల సంఖ్యల్లోనే ఉన్నాయి. కానీ... వాలంటీర్లను పెన్షన్, రేషన్ మొదలైన సంక్షేమ పథకాలను అందించే విషయంలో దూరంగా ఉంచడంతో... ఇప్పుడు వందలు, వేల వరకూ మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు వాలంటీర్లు! దీంతో... ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. రాజీనామాల అనంతరం వీరి నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. మరోపక్క... రాజీనామా చేస్తున్న వాలంటీర్ల ఉద్యోగాలు ఎక్కడికీ పోవని వైసీపీ నేతలు హామీలిస్తున్నారని తెలుస్తుంది!!

తాజాగా ఈ విషయాలపై స్పందించిన మంత్రి బొత్సా సత్యనారాయణ... ఫోరం ఫర్ సిటిజన్ డెమోక్రసీ పేరుతో నిమ్మగడ్డ రమేష్ వంటి వ్యక్తులు, చంద్రబాబుకు వత్తాసు పలికేందుకు ఇదంతా చేశారంటూ ఈ విషయాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. నూటికి నూరు శాతం పేదవాడి మీద కక్షతో, పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందకుండా చూడాలనే బుదితోనే ఇలా చేశారని మండిపడ్డారు. ఈ సమయంలో చంద్రబాబు నంగనాచిలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలంటూ లేఖలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఇదే సమయంలో... ఏదో ఒక కారణంతో రాజీనామా చేస్తే వాళ్ల అభ్యర్థన పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని.. రాజకీయ లబ్ధికోసం ప్రజలను ఫూల్స్ చేయాలని అనుకుని చంద్రబాబు ఫూల్ అయ్యాడని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఒక్క మచిలీపట్నం నియోజకవర్గంలోనే 1200 మంది వరకూ వాలంటీర్లు రాజీనామాలు చేయగా... పలు నియోజకవర్గాల్లోనూ వీరి సంఖ్య వందల్లో ఉందని అంటున్నారు!!