Begin typing your search above and press return to search.

మాకు బుర్ర లేదా.. ఉమ్మడి రాజధాని ఎందుకు అంటాం..!?

విభజన హామీలు చాలా వరకూ నెరవేరనివి ఇంకా ఉన్నాయని వాటిని సాధిస్తామని మాత్రమే వైవీ చెప్పారని అన్నారు.

By:  Tupaki Desk   |   14 Feb 2024 9:23 AM GMT
మాకు బుర్ర లేదా.. ఉమ్మడి రాజధాని ఎందుకు అంటాం..!?
X

మాకు బుర్ర లేదనుకుంటున్నారా లేక రాజకీయాల్లోకి కొత్తగా వచ్చామని అనుకుంటున్నారా అని మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాను ప్రశ్నిస్తూ ఫైర్ అయ్యారు. పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు మరి కొద్ది నెలలలో తీరిపోతుందని ఆయన గుర్తు చేశారు. అలాంటి హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా ఎందుకు కొనసాగించాలని కోరుకుంటామని బొత్స ప్రశ్నించారు.

తమ పార్టీ విధానం ఎప్పటికీ మూడు రాజధానులు అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స ఈ సందర్భంగా హాట్ కామెంట్స్ చేశారు. విభజన చట్టం ప్రకారం పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాల్సింది అని దాన్ని వదిలేసి అర్ధరాత్రి చంద్రబాబు పారిపోయి ఏపీకి వచ్చారు అని నిందించారు.

అలా కనుక జరగకపోయి ఉంటే ఈపాటికి ఉమ్మడి ఆస్తులతో పాటు అనేక అంశాలు ఒక కొలిక్కి వచ్చి ఉండేవి అన్నదే తమ పార్టీ ఆలోచన. ఆ విషయమే తమ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి చెప్పారని దాన్ని మీడియా వక్రీకరించిందని బొత్స అన్నారు. రాజ్యసభ మెంబర్ గా అవుతున్న వేళ మీ ప్రయారిటీస్ ఏమిటి అని మీడియా అడిగిన దానికి వైవీ సుబ్బారెడ్డి అనేక అంశాలు చెబుతూ విభజన హామీలను తాము సాధించుకుంటామని చెప్పారని అన్నారు.

విభజన హామీలు చాలా వరకూ నెరవేరనివి ఇంకా ఉన్నాయని వాటిని సాధిస్తామని మాత్రమే వైవీ చెప్పారని అన్నారు. అయితే ప్రతిపక్షాలు ఈ విషయంలో దిగజారి మాట్లాడుతున్నాయని అన్నారు. విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని ఆయన మరోసారి నొక్కి చెప్పారు.

ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదని అన్నారు. కొన్ని దుష్ట శక్తులు అడ్డుకోవడం వల్ల విశాఖ సహా మూడు రాజధానుల వ్యవహారం ఆగింది అని బొత్స మండిపడ్డారు. హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా ఒప్పుకోమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు అన్న దాని మీద మాట్లాడుతూ అసలు ఆ ఉద్దేశ్యమే తమకు లేదు అంటే మళ్లీ ఈ మాటలు సవాళ్ళు ఎందుకని బొత్స ప్రశ్నించారు.

తమ పార్టీ ఎపుడూ ఏపీ శ్రేయస్సు కోసమే పనిచేస్తుందని అన్నారు. ఉమ్మడి ఆస్తులతో పాటు చట్టంలో ఏమి ఉందో అవన్నీ తాము సాధిస్తామని అన్నారు. ఏపీకి విభజన వల్ల జరిగిన అన్యాయన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. ఇక హైదరాబాద్ లొ జగన్ ఆస్తులు కాపాడుకోవడానికే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటున్నారు అన్న దాని మీద ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లొ ఆస్తులు ఉంటే రాజధాని లేకపోతే ఎవరైనా తీసుకుంటారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశం ఇదని ఆయన గుర్తు చేశారు.

ప్రభుత్వాలు మారినంత మాత్రమా ఏదో జరిగిపోతుందని ఎందుకు అనుకుంటారు అని ఎదురు ప్రశ్నించారు. ఏపీలో ఉంటూ హైదరాబాద్ కి వస్తున్న చంద్రబాబు ఆయన మిత్రులకు సొంత ఇల్లు కూడా ఏపీలో లేదని గుర్తు చేశారు. వారు ఏపీ గురించి మాట్లాడడం విడ్డూరం అన్నారు. మీడియా కూడా ఇలాంటి నాయకుల విషయంలో నిలదీయాలని ఆయన సూచించారు. మొత్తం మీద చూసుకుంటే బొత్స వైవీ సుబ్బారెడ్డి చేసిన కామెంట్స్ కి వివరణ ఇచ్చేశారు.