ఓటుకు రూ.3 వేలు.. బొత్స వర్సెస్ కిమిడి పోరు, ఓటర్లకు గరిష్ట ధర!
విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలు రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి.
By: Tupaki Desk | 29 Oct 2026 2:46 PM ISTవిజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలు రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలోని గరివిడి మండల జడ్పీటీసీ స్థానానికి సీనియర్ నేతలు కిమిడి కళావెంకటరావు, బొత్స సత్యనారాయణ కోడళ్లు పోటీ పడుతున్నారు. దీంతో గరివిడి జడ్పీటీసీ ఎన్నిక ఇరువురు నేతలకు ప్రతిష్టాత్మకంగా మారిందని అంటున్నారు. కళావెంకటరావు ప్రస్తుతం చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉండగా, బొత్స ఇదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు.
గత ఎన్నికల్లో బొత్సను ఓడించిన కళావెంకటరావు చీపురుపల్లిని సుస్థిరం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో కోడలిని జడ్పీటీసీగా బరిలో దింపి జడ్పీ చైర్మన్ స్థానాన్ని ఆశిస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో బొత్స కూడా గత ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి సమాధానంగా నియోజకవర్గంలోని నాలుగు స్థానాలు గెలుచుకునే లక్ష్యంతో పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇరువురు నేతలు వ్యక్తిగత ప్రతిష్టకు తీసుకుని విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నారని చెబుతున్నారు.
చీపురుపల్లి నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీలు ఉండగా, ఇందులో రెండు చోట్ల బొత్స కుటుంబం నుంచి కోడలు పూజిత (గరివిడి), చెల్లెలు వెంకటలక్ష్మి (గుర్ల) పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో బొత్స కోడలు పూజిత గెలుపు ఆయనకు వ్యక్తిగతంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిందని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం సిట్టింగ్ ఎమ్మెల్యే కళావెంకటరావు కోడలు సంధ్య పోటీ ఉండటమే అంటున్నారు. గరివిడి మండలం తొలి నుంచి టీడీపీకి కంచుకోటగా చెబుతున్నారు. అయితే ఇక్కడ బొత్స వ్యక్తిగత ఇమేజ్ కూడా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు.
గత ఎన్నికల్లో బొత్సపై గెలిచిన ఎమ్మెల్యే కళావెంకటరావు తన గెలుపు గాలివాటం కాదని నిరూపించుకోవాలని భావిస్తున్నారని చెబుతున్నారు. తన సొంత నియోజకవర్గమైన రాజాం ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉండటం వల్ల తన కుటుంబ రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకం అన్న ఆలోచనలో కళా ఉన్నారని అంటున్నారు. ఇక బొత్స కూడా ఇంచుమించు ఇదే ఆలోచనతో స్థానిక ఎన్నికలపై గట్టిగా ఫోకస్ చేశారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో అనూహ్య ఓటమితో డీలా పడిన బొత్స.. ఈ ఎన్నికల ద్వారా తిరిగి పుంజుకోవాలని, చీపురుపల్లి తన కంచుకోటగా నిరూపించుకోవాలని తాపత్రయ పడుతున్నారని చెబుతున్నారు.
దీంతో ఇద్దరు సీనియర్ నేతలు ఎత్తుకుపైఎత్తులు వేస్తుండటంతో గరివిడి జడ్పీటీసీ ఎన్నిక హీట్ పుట్టిస్తోందని అంటున్నారు. ఇరువురు నేతలు గెలుపు కోసం ఎంతవరకు అయినా వెళ్లేలా కనిపిస్తుండటంతో ఓటర్లకు మంచి కానుకలు అందుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఒక్కో ఓటుకు మూడు వేల రూపాయలు అయినా చెల్లించేందుకు ఆయా పార్టీలు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. గ్రామాలకు గ్రామాలను కొనేసి ఎన్నికను ఏకపక్షం చేసుకోవాలనే ఆలోచనతో నాయకులు ఉన్నారని అంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఇంతకు ముందు ఎన్నడూ లేనట్లు ప్రస్తుతం ఓటుకు గరిష్ట రేటు పలుకుతోందని చెబుతున్నారు.
