బొత్స బిగ్ డెసిషన్.. మంత్రి లోకేశ్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన సీనియర్ నేత
రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాసనమండలిలో మంగళవారం చోటుచేసుకున్న ఓ సంఘటన రాజకీయంగా ఆసక్తికరంగా మారింది
By: Tupaki Desk | 24 Sept 2025 2:19 PM ISTరాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాసనమండలిలో మంగళవారం చోటుచేసుకున్న ఓ సంఘటన రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ఏ ఇద్దరు నేతలు కలుసుకున్నా ఇప్పుడు ఇదే అంశం చర్చించుకుంటున్నారు. ప్రధానంగా మంత్రి లోకేశ్ చేసిన ప్రతిపాదనకు వైసీపీ నేత బొత్స ఓకే చెప్పడం పెను సంచలనంగా చెబుతున్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ లేనట్లు టీడీపీ ప్రభుత్వానికి సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకుని సహకరించలేదని, కానీ తొలిసారిగా ప్రభుత్వ తీర్మానాన్ని ఆమోదిస్తూ వైసీపీ ప్రకటన చేయడం పెద్ద రికార్డే అంటున్నారు.
ప్రస్తుతం శాసనసభతోపాటు శాసనమండలి వర్షాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష హోదా లేదన్న కారణంగా అసెంబ్లీకి వైసీపీ సభ్యుల గైర్హాజరు అవుతున్నారు. దీంతో అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా ఏకపక్షంగా ఆమోదం లభిస్తోంది. అదే సమయంలో అసెంబ్లీ కార్యకలాపాలు కూడా ఏకపక్షంగా సాగుతున్నాయి. కానీ, మండలిలో ప్రభుత్వ కూటమి కన్నా ప్రతిపక్షానికే ఎక్కువ బలం ఉంది. దీంతో మండలి సమావేశాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వాడివేడిగా సాగుతున్న మండలి సమావేశాలను టీవీలు, సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది వీక్షిస్తున్నారు.
ఇలాంటి సమయంలో మంగళవారం మండలి వేదికగా జరిగిన ఓ సంఘటన అందరినీ ఆకర్షించింది. ముఖ్యంగా మండలిలో ప్రతిపక్ష నేత బొత్స తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కి గురిచేసింది. ఈ సమావేశాలలో ప్రభుత్వం పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా, కొన్నింటిని వ్యతిరేకించడం, మరికొన్నింటిని వాకౌట్ ద్వారా బహిష్కరిస్తున్నట్లు వైసీపీ సభ్యులు ప్రకటించేవారు. తాజాగా జీఎస్టీపై తీర్మానం చేసిన సమయంలో కూడా వ్యతిరేకించలేదు కానీ, వాకౌట్ చేసి తీర్మానంపై తమ నిర్ణయం ఏంటీ వెల్లడించకుండా తప్పించుకున్నారు. కానీ, విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ మంత్రి లోకేశ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా వైసీపీ తప్పించుకోలేకపోయింది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మండలిలో వాడివేడి జరిగింది. అయితే వైసీపీ సభ్యుల విమర్శలకు గట్టిగా బదులిచ్చిన మంత్రి లోకేశ్ వంద సార్లు చెబుతున్నా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాదు అని తేల్చిచెప్పారు. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విజయవంతంగా అడ్డుకున్నందుకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు మంత్రి హెచ్.డీ.కుమారస్వామికి అభినందనలు తెలుపుతూ మంత్రి లోకేశ్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని సభ్యులు అంతా ఆమోదించాలని కోరారు. అప్పటివరకు స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైసీపీ సభ్యులు కూడా తీర్మానానికి మద్దతు తెలపడంతో ఆశ్చర్యం వ్యక్తమైంది. ఈ సమయంలో సభాధ్యక్ష స్థానంలో ఉన్న మండలి చైర్మన్ మోషేన్ రాజు తీర్మానానికి మద్దతు ఇస్తున్నారా? అంటూ బొత్సను ప్రశ్నించగా, ఆయన అవును అని చెప్పడం విశేషం.
