బొత్స ట్రబుల్ షూటరా ?
వైసీపీలో పెద్ద తలకాయలా కనిపిస్తోంది మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అని అంటున్నారు.
By: Tupaki Desk | 27 Jun 2025 4:02 AMవైసీపీలో పెద్ద తలకాయలా కనిపిస్తోంది మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అని అంటున్నారు. ఆయన ఆరున్నర పదుల వయసులో ఉన్నా కొంత వరకూ అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వైసీపీకి ఇపుడు ఆయనే కొండంత అండగా ఉంటున్నారు. వైసీపీకి ఏ కష్టం వచ్చినా ఏ రకంగా సమస్యలు ఎదుర్కొన్నా బొత్స ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అంతే కాదు గవర్నర్ ని కలవడం అయినా లేక ప్రభుత్వ వ్యవస్థలో పెద్దలను కలవడం అయినా ఆయన చేస్తూ వస్తున్నారు.
ఇక మీడియా ముందుకు వచ్చి పెద్ద మనిషి తరహాలో కూటమి ప్రభుత్వం మీద నిశితంగా విమర్శలు చేస్తున్నారు. జగన్ సైతం ఆయనను బాగా విశ్వసిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినపుడు శాసనమండలి ప్రతిపక్ష నాయకుని హోదాలో ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తూ తన బాధ్యతలను నెరవేరుస్తున్నారు.
ఇక వైసీపీకి ఒక చిక్కు ఏమిటి అంటే తరచూ ట్రబుల్స్ వెంటాడుతూండడం. అంతే కాదు ఈ ట్రబుల్స్ లో సగానికి సగం పార్టీ కోరి తెచ్చుకుంటున్నవి అని అంటున్నారు. దాంతో ట్రబుల్ షూటర్ గా బొత్స రంగంలోకి దిగుతున్నారు అని అంటున్నారు. ఒక మాజీ సీఎం అయిదేళ్ళ పాటు రాష్ట్రాన్ని ఏలిన వారు. పదిహేనేళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఒక ప్రాంతీయ పార్టీని నడుపుతున్నారు అలాంటి జగన్ నివాసం నుంచి ఆయన పర్యటనలకు ఉపయోగించే కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే దీని మీద వైసీపీ నుంచి రావాల్సిన రేంజిలో ఘాటు స్పందన రాలేదని అంటున్నారు. దాంతో ఇంత హాట్ ఇష్యూ కూడా చప్పబడిపోయింది. అయితే బొత్స ఫీల్డ్ లోకి దిగాక దీని మీద మళ్ళీ డిస్కషన్ మొదలైంది. ఆయన గవర్నర్ ని కలసి వచ్చి మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఇన్ని ఇబ్బందులు పెడతారా ఆయన వాహనం తీసుకుని వెళ్తారా అంటూ ప్రభుత్వం మీద విమర్శలు కురిపించారు.
ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వమే కదా అని ఆయన లాజిక్ పాయింట్ తీశారు. ప్రభుత్వ డ్రైవర్ నడుపుతున్న వాహనం ప్రమాదానికి గురి అయితే బాధ్యత ఎవరిది అని కూడా నిలదీసారు. తాము అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు పవన్ లోకేష్ పర్యటనలకు అనుమతించామని గుర్తు చేశారు.
జగన్ పర్యటనలకు జనాలు వస్తారని ఆయన చెప్పారు. మరి వారిని నియంత్రించాల్సిన పోలీసులు ఏరీ అని ఆయన అంటున్నారు. జగన్ కి భద్రత కల్పినడం అంటే ఇదేనా అని ఆయన నిలదీశారు. జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడం లేదని అన్నారు. ఒక మాజీ సీఎం కి ఇవ్వాల్సిన భద్రత లేదని ఆ లోపాలను కూడా కప్పిపుచ్చుకుంటూ జగన్ వాహనం మీద మృతి చెందారు అని మళ్ళీ తమ పార్టీ మీదనే కేసులు పెట్టడమేంటి అని ఆయన ప్రశ్నించారు.
పైగా కారుని సీజ్ చేయడం కంటే అరాచకం ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. జగన్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడని ఆయనకు భద్రత కల్పించకుండా ప్రభుత్వం కేసులతో కుట్రలు చేస్తోందని ఆగ్రహించారు మొత్తానికి బొత్స ఫీల్డ్ లోకి వస్తే కానీ జగన్ కారు సీజ్ వేడి అయితే మీడియాకు కూడా ఎక్కలేదు. మరి వైసీపీలో సీనియర్ల కొరత ఉందా లేక వారిని ఉపయోగించుకోవడంలో లోపం ఉందా అన్నది తెలియడం లేదని అంటున్నారు. ఇక బొత్స మాత్రం కీలక సందర్భాలలో రంగంలోకి రావడంతో ఆయనే వైసీపీకి ట్రబుల్ షూటర్ అని అంటున్నారు.