బొత్సను ఢీ కొట్టాల్సిందే !
అలా ఆయన కేబినెట్ ర్యాంక్ ని అందుకున్నారు. ఇక బొత్సకు ఉత్తరాంధ్రా జిల్లాలలో పలుకుబడి రాజకీయంగా చాలానే ఉంది. అంతే కాదు వెనకబడిన వర్గాలకు చెందిన నాయకుడిగా ఉన్నారు.
By: Tupaki Desk | 21 July 2025 10:00 AM ISTఉత్తరాంధ్రా జిల్లాలలో సీనియర్ వైసీపీ నేతగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయన 2024 ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. అయినా ఆయనకు అదృష్టం వేరే రూపంలో కలిసి వచ్చింది. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో ఆయన ఎమ్మెల్సీ అయిపోయారు. జగన్ ఆయన మీద నమ్మకం పెట్టి మరీ శాసనమండలిలో విపక్ష నాయకుడిని చేశారు.
అలా ఆయన కేబినెట్ ర్యాంక్ ని అందుకున్నారు. ఇక బొత్సకు ఉత్తరాంధ్రా జిల్లాలలో పలుకుబడి రాజకీయంగా చాలానే ఉంది. అంతే కాదు వెనకబడిన వర్గాలకు చెందిన నాయకుడిగా ఉన్నారు. దాంతో పాటు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. ఎత్తులు వ్యూహాలలో ఆయన ధీటైన నేతగా ఉన్నారు.
బొత్స వైసీపీకి ఒక విధంగా ఉత్తరాంధ్రాలో పెద్ద దిక్కుగా ఉన్నారు. దాంతో బొత్స తరచూ విశాఖను వేదికగా చేసుకుని తన ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశాలు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఆయన గట్టిగా విమర్శిస్తున్నారు. తప్పులను ఎండగడుతున్నారు. ఆయన లాజిక్ తో వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పే బాధ్యతను మాత్రం ఉత్తరాంధ్రా జిల్లాలలో ఉన్న ఏ కూటమి నేత తీసుకోవడం లేదని అంటున్నారు.
అంతవరకూ ఎందుకు బొత్సను చీపురుపల్లిలో ఓడించిన సీనియర్ టీడీపీ నేత మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు కూడా ఈ మధ్య ఎందుకో సైలెంట్ అయ్యారు. ఆయన తన నియోజకవర్గం తానూ అన్నట్లుగానే ఉంటున్నారు. ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆయన కేవలం చీపురుపల్లిలోనే పర్యటిస్తున్నారు. అక్కడ సమస్యల మీదనే ఫోకస్ పెడుతున్నారు.
అలాగే విశాఖలో చూస్తే మరో కీలక నేతగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన కూడా భీమిలీనే పట్టుకుని కూర్చున్నారు. ఆయన తన నియోజకవర్గంలోనే తిరుగుతున్నారు. దాంతో బొత్స వ్యాఖ్యలను ఖండించే వారు కూటమిలో కనిపించడం లేదు అని అంటున్నారు.
ఈ విషయాలు అన్నీ జాగ్రత్తగా గమనిస్తున్న కూటమి పెద్దలు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అయితే బొత్సను అలా వదిలేయడమేంటి అని సొంత పార్తీ నేతల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అని అంటున్నారు. బొత్స చూస్తే ఏకంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఏమీ చేయడం లేదన్న మేసేజ్ ని ఆయన ఇస్తున్నారని అది జనంలోకి పోకుండా కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీ పెద్దలు భావిస్తున్నారు. బొత్స విజయనగరం విశాఖలో తన రాజకీయ అజెండాను నిర్ణయించుకుని మీడియా ముఖంగా కూటమి మీద విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు.
దీంతో బొత్సని నిలువరించే ధెటైన నేతల కోసం టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. విజయనగరం జిల్లాలో ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సైతం దూకుడు చూపించడంలేదు అని అంటున్నారు. ఇక గతంలో అయితే విశాఖ నుంచి మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఎప్పటికపుడు ప్రత్యర్ధి పార్టీల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొడుతూ ఉండేవారు. ఇపుడు ఆయన స్పీకర్ పోస్టులోకి వెళ్ళారు. రాజ్యాంగబద్ధమైన అధికారాలతో ఆయన ఉంటున్నారు. రాజకీయాలను ఆయన పక్కన పెట్టేశారు. దీంతో బొత్సను నిలువరించాల్సిందే అని టీడీపీ తమ పార్టీ సీనియర్లను కోరుతోందిట. మరి బొత్సకు కౌంటర్లు ఫ్యూచర్ లో పడతాయా అన్నది చూడాల్సిందే అని అంటున్నారు.
