Begin typing your search above and press return to search.

బొత్స రాజకీయ విశ్రాంతి.. ఇక హైదరాబాద్ కే పరిమితమా?

మండలిలో విపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ రాజకీయంగా పూర్తి విశ్రాంతి తీసుకునే ఆలోచనలో ఉన్నారా? అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   14 March 2026 9:00 PM IST
బొత్స రాజకీయ విశ్రాంతి.. ఇక హైదరాబాద్ కే పరిమితమా?
X

మండలిలో విపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ రాజకీయంగా పూర్తి విశ్రాంతి తీసుకునే ఆలోచనలో ఉన్నారా? అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఇటీవల అస్వస్థతకు గురైన బొత్స ప్రస్తుతం హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. పార్టీలో ఇతర నేతలు ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వం నుంచి రాజకీయంగా ఆయనపై పెద్దగా ఒత్తిడి లేకపోయినా, ఆరోగ్యం మాత్రం గతం మాదిరిగా సహకరించడం లేదని చెబుతున్నారు. దీంతో రాజకీయ కార్యక్రమాలు క్రమంగా తగ్గించుకోవాలనే ఆలోచనతో ఆయన ఉన్నారని అంటున్నారు. ఈ కారణంగానే హైదరాబాద్ కు మకాం మార్చారని అంటున్నారు.

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బొత్స ఎక్కువగా విశాఖలోనే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలు, మండలి సమావేశాలు ఉన్నప్పుడు విజయవాడకు వస్తుంటారు. సొంత ఊరు విజయనగరం, సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని ఆలోచనతో హైదరాబాద్ కు మకాం మార్చారని అంటున్నారు. ఆయన ఎదుర్కొంటున్న ఒత్తిడి వల్ల కుటుంబ సభ్యులు కూడా కొన్ని రోజులు రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని పట్టుబడుతున్నారని అంటున్నారు.

అయితే బొత్స ప్రస్తుతం తీసుకుంటున్న రాజకీయ విశ్రాంతి తాత్కాలికమా? కాదా? అన్నది సస్పెన్స్ గా మారిందని అంటున్నారు. మండలిలో విపక్ష నేతగా బొత్స ప్రస్తుతం కేబినెట్ హోదాలో ఉన్నారు. వచ్చే ఏడాది వరకు ఆయనకు ఈ పదవి ఉంటుందని చెబుతున్నారు. అప్పటివరకు క్రియాశీలంగా ఉండాలని, ఆ తర్వాత నెమ్మదిగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం జరగాలని కుటుంబ సభ్యులు బొత్సను కోరుతున్నట్లు చెబుతున్నారు. ఎలాగూ వారసులు అందుబాటులోకి వచ్చినందున రాజకీయాల నుంచి తప్పుకొని కొద్దికాలం విశ్రాంతి తీసుకుని ఆరోగ్యం మెరుగుపరచుకోవాలని సూచిస్తున్నారని చెబుతున్నారు.

బొత్సకు గతంలో బైపాస్ జరిగిందని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో ఆయన రక్తపోటు సమస్యలను ఎక్కువగా అనుభవిస్తున్నారు. విశ్రాంతి లేకుండా గడపడం వల్లే బొత్స అనారోగ్యం పాలవుతున్నారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాలతోపాటు పార్టీ వ్యవహారాలలో తీరిక లేకుండా గడపడం వల్ల బొత్సపై ఎక్కువ ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఇటీవల తనను కలవడానికి వచ్చిన సొంత నియోజకవర్గం నేతలతోనూ ఈ ఆలోచనను బొత్స పంచుకున్నారని, వచ్చే స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని హితవు పలికారని అంటున్నారు. దీంతో సమీప భవిష్యత్తులో ఆయన జిల్లాకు వచ్చే ఆలోచన లేదని, వచ్చినా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. తప్పనిసరి పార్టీ పనులకు మాత్రమే పరిమితం కావాలని ఆలోచనకు వచ్చిన బొత్స క్షేత్రస్థాయి రాజకీయ యుద్దానికి దూరంగా జరగాలని దాదాపు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.