Begin typing your search above and press return to search.

అల్లుడు.. వియ్యంకుడికి బొత్స దోచి పెట్టారు: జ‌న‌సేన

బొత్స మంత్రిగా ఉన్న స‌మ‌యంలో విశాఖ‌ప‌ట్నంలో మురికి వాడ‌ల అభివృద్ధి పేరుతో ప‌నులు చేప‌ట్టార ని మూర్తి యాద‌వ్ చెప్పారు.

By:  Tupaki Desk   |   26 May 2025 5:45 PM IST
అల్లుడు.. వియ్యంకుడికి బొత్స దోచి పెట్టారు:  జ‌న‌సేన
X

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మండ‌లిలో వైసీపీ ప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌పై జ‌న‌సేన నాయ‌కుడు మూర్తి యాద‌వ్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. బొత్స స‌త్య‌నారాయ‌ణ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న అల్లుడు, వియ్యంకుడికి అనుకూలంగా ప‌నిచేశార‌ని.. ఈ క్ర‌మంలో కోట్ల రూపాయ‌ల విలువైన భూముల‌ను దోచి పెట్టార‌ని ఆధారాల‌తో స‌హా ఆరోపించారు. దీనిపై విచార‌ణ చేయాల‌ని కోరుతూ.. తాను డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు లేఖ రాయ‌నున్న‌ట్టు మూర్తి చెప్పారు.

ఏం జ‌రిగింది?

బొత్స మంత్రిగా ఉన్న స‌మ‌యంలో విశాఖ‌ప‌ట్నంలో మురికి వాడ‌ల అభివృద్ధి పేరుతో ప‌నులు చేప‌ట్టార ని మూర్తి యాద‌వ్ చెప్పారు. ఈ స‌మ‌యంలో టీడీఆర్‌(ట్రాన్స్‌ఫ‌ర‌బుల్ డెవ‌ల‌ప్‌మెంట్ రైట్స్‌) బాండ్లు రూపంలో కోట్ల రూపాయ‌ల మేర‌కు ల‌బ్ధి జ‌రిగేలా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోపించారు. బొత్స స‌త్యనారాయ‌ణ వియ్యంకుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌కు.. చేప‌లుప్పాడ‌, కాపులుప్పాడ ప్రాంతంలో ఉన్న భూములు ఇచ్చార‌ని.. వీటి విలువ సుమారు 30 కోట్ల రూపాయ‌ల‌కు పైగానే ఉంటుంద‌ని తెలిపారు.

3720 గ‌జాల స్థ‌లంలో 720 గ‌జాల స్థ‌లానికి టీడీఆర్ పేరిట బాండ్లు ఇచ్చార‌ని తెలిపారు. ఇది అక్ర‌మ‌మ‌ని.. ఇంత పెద్ద మొత్తంలో టీడీఆర్ ఇచ్చేందుకు అవ‌కాశం లేద‌ని పేర్కొన్నారు. ఇక‌, బొత్స అల్లుడికి కూడా ఇలానే భూ పందేరం చేశార‌ని మూర్తి యాద‌వ్ ఆరోపించారు. వీటి విలువ కూడా.. 22 కోట్ల పైమాటేన‌ని వెల్ల‌డించారు. విశాఖ‌ప‌ట్నం గ్రేట‌ర్ కార్పొరేష‌న్ ప‌రిధిలో ఈయ‌న‌కు కూడా టీడీఆర్ బాండ్లు ఇచ్చార‌ని చెప్పారు. ఇవి భూముల క‌బ్జా కంటే కూడా ఘోర‌మ‌ని మూర్తి యాద‌వ్ పేర్కొన్నారు. వీటిపై విచార‌ణ‌కు డిప్యూటీ సీఎంను కోరుతామ‌ని చెప్పారు.