Begin typing your search above and press return to search.

బొత్సకు బాధ్యతలు తగ్గించారా ?

ఇదిలా ఉంటే బొత్స సత్యనారాయణ శాసనమండలిలో కీలకమైన నేతగా తనకు పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు.

By:  Satya P   |   4 March 2026 10:30 AM IST
బొత్సకు బాధ్యతలు తగ్గించారా ?
X

వైసీపీలో కీలక నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల కాలంలో అస్వస్థతకు గురి అయ్యారు. ఆయన కొంతకాలం నుంచి తీవ్ర ఒత్తిడితో ఉన్నారని రాజకీయంగా కూడా ఆయన మీద పెద్ద బాధ్యతలు వైసీపీ అధినాయకత్వం పెట్టింది అని కూడా ప్రచారంలో ఉంది. వైసీపీ అసెంబ్లీకి వెళ్ళడం లేదు, దాంతో శాసన మండలి వైసీపీకి కీలకంగా మారింది. అందుకే అనుభవం కలిగిన బొత్సకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు అప్పగించారు అని అంటున్నారు. ఆయన మీదనే మొత్తం ఆధార పడింది వైసీపీ అని చెప్పుకుంటూ వచ్చారు.

దూకుడు చేసినా :

ఇదిలా ఉంటే బొత్స సత్యనారాయణ శాసనమండలిలో కీలకమైన నేతగా తనకు పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన దూకుడు చేస్తూ అధికార కూటమిని ఇరకాటంలో పెడుతున్నారు. అయితే ఇంకా దూకుడు చేయాలని ఒత్తిళ్ళు వచ్చాయని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే బొత్స ఇబ్బందిపడ్డారని ఆ ప్రభావం ఆరోగ్యం మీద పడింది అని అంటున్నారు. ఇక బొత్స ఇపుడు పూర్తిగా రెస్ట్ తీసుకుంటారు అని చెబుతున్నారు. దాంతో ఆయన ప్లేస్ లో శాసనమండలిలో ఎవరు వైసీపీకి నాయకత్వం వహిస్తారు అన్నది చూడాల్సి ఉంది. శాసనమండలి సమావేశాలు మార్చి 4 నుంచి తిరిగి మొదలవుతున్నాయి. మార్చి 7వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. ఈ సమావేశాలకు బొత్స రాకపోవచ్చు అని అంటున్నారు.

సగం బాధ్యతలే :

మరో వైపు చూస్తే బొత్సను ఉభయ గోదావరి జిల్లాలకు రీజనల్ కో ఆర్డినేటర్ గా పార్టీ గతంలో నియమించింది. తాజాగా పార్టీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం చూస్తే బొత్సకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను మాత్రమే ఉంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు రీజనల్ కో ఆర్డినేటర్ గా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి బాధ్యతలు అప్పగించారు. దాంతో బొత్స మీద సగానికి సగం భారం తగ్గించారు అని అంటున్నారు.

ఉత్తరాంధ్రాలో సైతం :

ఇక ఉత్తరాంధ్రా జిల్లాలలో కూడా బొత్స ప్రభావం గణనీయంగా ఉంది. ఆయన రాజకీయంగా విరామం కోరుతున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రాలో పార్టీ కీలక మార్పులను చేసింది అని అంటున్నారు. ఉత్రరాంధ్రా రీజనల్ కో ఆర్డినేటర్ గా మొత్తం ఉమ్మడి మూడు జిల్లాలకు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇప్పటిదాకా చూసేవారు. ఇపుడు ఆయనను విశాఖ విజయనగరం జిల్లాలకు మాత్రమే పరిమితం చేసారు. ఉమ్మడి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాలకు రీజనల్ కో ఆర్డినేటర్ గా మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుకు బాధ్యతలు కొత్తగా అప్పగించారు. దాంతో ఉత్తరాంధ్రాలో ఇక మీదట ఇద్దరు సీనియర్ నేతల పర్యవేక్షణ ఉంటుంది అని అంటున్నారు. అలాగే ఉత్తరాంధ్రా అంటే కాపులు వెలమలు రాజకీయంగా కీలకంగా ఉంటారని అంటున్నారు దాంతో వెలమ సామాజిక వర్గానికి చెందిన బూడిని శ్రీకాకుళం మన్యం జిల్లాలకు పంపించారు అని కాపు సామాజిక వర్గానికి చెందిన కురసాలకు విశాఖ విజయనగరం కేటాయించారని అంటున్నారు.