Begin typing your search above and press return to search.

వెక్కివెక్కి ఏడ్చిన బొత్స.. ఏమైంది?

మంత్రి పదవిని కాపాడుకోవడానికే అచ్చెన్నాయుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

By:  Tupaki Political Desk   |   9 April 2026 7:30 PM IST
వెక్కివెక్కి ఏడ్చిన బొత్స.. ఏమైంది?
X

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స.. మీడియా ప్రతినిధుల సమక్షంలోనే బోరున విలపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. రాజకీయాల కోసం మరణించిన వైఎస్ పేరు తీసుకురావడం ఏంటి అంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం రాజశేఖరరెడ్డిని తలచుకుని బొత్స కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ ఘటన వెనుక వైసీపీ అధినేత జగన్ పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయని, ఈ విషయమై సీనియర్ నేత బొత్స గతంలోనే అనుమానాలు వ్యక్తం చేశారని, తాను ఇప్పుడు వాటిని గుర్తు చేస్తున్నానని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. దీనిపై మాజీ మంత్రి బొత్స తీవ్రంగా స్పందించారు. మంత్రి అచ్చెన్నాయుడు మీడియా సమావేశం ముగిసిన కొద్దిసేపటికే విశాఖలో మీడియా ముందుకు వచ్చిన బొత్స మంత్రి అచ్చెన్నపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మంత్రి పదవిని కాపాడుకోవడానికే అచ్చెన్నాయుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను రాజకీయాల కోసం బతకడం లేదని, రాజకీయాల కోసం దిగజారనని, రాజకీయాల కోసం లేనిమాటలు ఆడటం లేదని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. తన గుండెల్లో ఎన్నో విషయాలు ఉన్నాయని తెలిపారు. అచ్చెన్నాయుడు మాటలను ఖండించడానికి తాను ప్రెస్మీట్ పెట్టలేదని, రాజశేఖరరెడ్డి పేరు ప్రస్తావించారు కనుకే మీడియా సమావేశం పెట్టాల్సివచ్చిందని వివరించారు.

రాజశేఖరరెడ్డి మరణించిన సమయంలో జగన్ లేరని చెబుతున్నారని, అప్పుడు తాను, తన భార్య ఝాన్సీలక్ష్మి కలిసి జగన్ రెడ్డిని క్యాంపు ఆఫీసు నుంచి బయటకు తీసుకువచ్చామని గుర్తు చేశారు. అంతేకాని రాజకీయాల కోసం దిగజారి మాట్లాడొద్దని హితవుపలికారు. యువజన కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి రిలయన్స్ మీద దాడి తామే ఆపించామని తెలిపారు. రాజకీయంగా పోరాడాలంటే జగన్ కోసం మాట్లాడాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నీచమైన ఆలోచనతో చనిపోయిన రాజశేఖరరెడ్డిని తీసుకువస్తున్నారని అన్నారు. పదవుల కోసం ఎంత మాటైనా మాట్లాడుతున్నారని బొత్స మండిపడ్డారు.