ఎమ్మెల్యే పదవిపైనే ఇంట్రెస్ట్.. బొత్స తనయ మనసులో మాట
వైసీపీ సీనియర్ నేత, మండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష పొలిటికల్ ఎంట్రీ ఆసక్తి రేపుతోంది.
By: Tupaki Desk | 25 Aug 2026 8:00 PM ISTవైసీపీ సీనియర్ నేత, మండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష పొలిటికల్ ఎంట్రీ ఆసక్తి రేపుతోంది. తన కుమార్తెను జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థినిగా బరిలో దింపుతున్నట్లు బొత్స స్వయంగా ప్రకటించారు. కానీ, తాజాగా జరుగుతున్న ప్రచారంతో అనూష స్థానిక ఎన్నికల్లో పోటీకి విముఖంగా ఉన్నారని అంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే ఆమె ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. దీంతో బొత్స ప్రతిపాదన కార్యరూపం దాల్చేనా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అవ్వాలనే ఆలోచనతోనే అనూష గత కొద్దిరోజులుగా పనిచేస్తున్నారని, కానీ ఆమె మనోగతం తెలుసుకోకుండా బొత్స జడ్పీ చైర్ పర్సన్ చేస్తానని ప్రకటించేశారని అంటున్నారు. దీంతో తన ఆలోచనను తండ్రికి చెప్పేందుకు ఆమె తర్జనభర్జన పడుతున్నారని, ఈ విషయమై సన్నిహితులు, కుటుంబ సభ్యుల ద్వారా ఇప్పటికే సంకేతాలిచ్చారని చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి బొత్స కుమార్తె అనూష పొలిటికల్ ఎంట్రీపై ఉత్కంఠ నెలకొంది. విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి బొత్స కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, మూడు నియోజకవర్గాల్లో బొత్స కుటుంబ సభ్యులే వైసీపీ ఇంచార్జులుగా ఉన్నారు. అదేవిధంగా బొత్స మేనల్లుడు చిన్నశ్రీను ప్రస్తుతం జడ్పీ చైర్మనుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈయనను భీమిలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో దింపాలని బొత్స భావిస్తున్నారు. దీనికి పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, భీమిలి సమన్వయకర్తగా నియమించి వచ్చే ఎన్నికల్లో ఆయనే అభ్యర్థిగా బరిలోకి దిగుతారని భరోసా ఇచ్చిందని చెబుతున్నారు. దీంతో విజయనగరం జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే విషయమై ఆలోచించిన బొత్స తన కుమార్తె అనూషను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
అయితే తండ్రి ఆలోచనతో షాక్ తిన్న అనూష తన మనోగతాన్ని తెలియజేయాలని ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనతో అనూష కొద్ది నెలలుగా తండ్రి ప్రాతినిధ్యం వహించిన చీపురుపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటీవల జరిగిన ఆమె పుట్టిన రోజు వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. చీపురుపల్లి నియోజకవర్గంతో బొత్స కుటుంబానికి చాలా అనుబంధం ఉండటం, ఆ నియోజకవర్గంలో బొత్సకు వ్యక్తిగత ఇమేజ్ ఉండటంతో తనకు కలిసివస్తుందని అనూష భావిస్తున్నారు. ఇక్కడ నుంచి బొత్స మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. రెండు సార్లు ఓటమి చెందారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనూష సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
కానీ, అనూషను జడ్పీ బరిలో దింపనున్నట్లు బొత్స చేసిన ప్రకటనతో ఆమె షాక్ కు గురయ్యారని అంటున్నారు. జిల్లాలో మూడు నియోజకవర్గాలలో తమ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలుగా పోటీ పడుతున్నప్పటికీ, కుటుంబంలో అంతర్గత సమస్యలు రాకుండా తండ్రి ప్రాతినిధ్యం వహించిన చీపురుపల్లిని ఆమె ఎంచుకోవడానికి కూడా ప్రత్యేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. జిల్లాలో చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతినగరం నుంచి బొత్స కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తుంటారు. ఇందులో చీపురుపల్లి నుంచి బొత్స స్వయంగా పోటీ చేస్తుండగా, గజపతినగరం నుంచి ఆయన సోదరుడు అప్పలనరసయ్య, నెల్లిమర్ల నుంచి వరుసకు సోదరుడు అయ్యే బడుకొండ అప్పలనాయుడు పోటీలో ఉంటున్నారు.
అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్న అనూష తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన చీపురుపల్లిపైనే ఫోకస్ చేశారు. గజపతినగరం, నెల్లిమర్ల నియోజకవర్గాలవైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీనికి కారణం కుటుంబంలో ఇబ్బందులు రాకూడదనే ఆలోచనే అంటున్నారు. చీపురుపల్లి నుంచి వచ్చే ఎన్నికల్లో తన తండ్రి పోటీ చేయరనే అంచనాతోనే ఆమె అక్కడ చురుగ్గా రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే బొత్స మాత్రం కుమార్తె అంతరంగం గుర్తించకుండా, జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించడమే పార్టీలో విస్తృత చర్చకు దారితీస్తోందని అంటున్నారు. అనూష రాజకీయాల్లో చురుగ్గా ఉండటం వల్ల ప్రత్యక్ష ఎన్నికల్లో దింపాలనే ఆలోచనతోనే బొత్స ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, కుమార్తె మనోగతం భిన్నంగా ఉందని గుర్తించలేకపోవడమే రాజకీయంగా చర్చకు దారితీస్తోందని అంటున్నారు.
