బొత్స ఇంట్లో అనూహ్య ఫలితాలు.. కోడలు విజయం, కూతురు ఓటమి
జిల్లా పరిషత్ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గరివిడి జడ్పీటీసీగా బొత్స కోడలు పూజిత విజయం సాధించగా, బొండపల్లి నుంచి పోటీ చేసిన కుమార్తె అనూష టీడీపీ అభ్యర్థి నీరజ చేతిలో సుమారు 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరోవైపు, బొత్స సోదరి వెంకటలక్ష్మి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చీపురుపల్లిలో వైసీపీ రెండు స్థానాల్లో గెలవడం బొత్సకు ఊరటనిచ్చింది.
By: Tupaki Desk | 8 Nov 2026 8:30 AM ISTజిల్లా పరిషత్ ఎన్నికల్లో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స కుటుంబ సభ్యులు అనూహ్య ఫలితాలు సాధించారు. ఈ ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోవాలన్నట్లు బరిలోకి దిగిన బొత్స సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో పట్టు నిలుపుకున్నారు. గరివిడి జడ్పీటీసీ అభ్యర్థిగా తన కోడలు బొత్స పూజితను గెలిపించుకున్నారు. అంతేకాకుండా ఆ మండలంలో మెజార్టీ ఎంపీటీసీ ఫలితాలను బొత్స అనుచరులు కైవసం చేసుకోవడం విశేషం. ఇక బొత్స వారసురాలిగా అరంగేట్రం చేసిన కూతురు అనూష మాత్రం పరాజయం పాలయ్యారు. విజయనగరం జిల్లా బొండపల్లి జడ్పీటీసీగా అనూష పోటీ చేయగా, ఆమెపై తెలుగుదేశం అభ్యర్థి నీరజ సుమారు 5 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
జిల్లా పరిషత్ ఎన్నికల్లో తన పట్టు నిరూపించుకోవాలని బొత్స ప్రయత్నించారు. సొంత నియోజకవర్గంలో ఉనికి చాటుకోగా, ఆయన సోదరుడు బొత్స అప్పలనరసయ్య ప్రాతినిధ్యం వహించిన గజపతినగరం నియోజకవర్గంలోని బొండపల్లి నుంచి కూతురు అనూషను పోటీకి పెట్టారు. అనూష గెలుపును సవాల్ గా తీసుకున్న బొత్స కుటుంబ సభ్యులు తీవ్రంగా శ్రమించారు. అయితే ఈ స్థానాన్ని టీడీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. హోరాహోరీగా సాగిన పోరులో అంతిమ విజయం టీడీపీకే దక్కింది. వైసీపీ తరఫున పోటీ చేసిన బొత్స వారసురాలు అనూష ఓటమిని మూటగట్టుకోవాల్సివచ్చింది.
బొత్స కోడలు రికార్డు విక్టరీ
టీడీపీకి కంచుకోట లాంటి గరివిడి జడ్పీటీసీగా బొత్స కోడలు పూజిత విజయం సాధించారు. ఆమె ప్రత్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కోడలు సంధ్య పోటీ చేశారు. నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో అంతిమ విజయం బొత్స పూజితకే దక్కింది. పోస్టల్ బ్యాలెట్ నుంచి పూజిత ఆధిక్యం కనబరిచారు. బ్యాలెట్ పత్రాల లెక్కింపులో తొలి రెండు రౌండ్లలో టీడీపీ అభ్యర్థి సంధ్య ఆధిక్యం కనబరిచినా, చివరికి వైసీపీ అభ్యర్థి పూజితనే అంతిమ విజయం వరించింది. ఇక్కడ నుంచి కళా కోడలు సంధ్య గెలిస్తే టీడీపీ జడ్పీ చైర్ పర్సన్ అయ్యేవారని ప్రచారం జరిగింది. అయితే బొత్స వ్యూహాత్మకంగా తన కోడలును రంగంలోకి దింపి ఎమ్మెల్యే కళా వెంకటరావు ఆధిపత్యాన్ని దెబ్బతీశారని విశ్లేషిస్తున్నారు.
ఆధిక్యంలో బొత్స సోదరి
ఇక చీపురుపల్లి నియోజకవర్గంలోని మరో జడ్పీటీసీ స్థానం నుంచి బొత్స సోదరి వెంకటలక్ష్మి పోటీ చేశారు. ఈమె కూడా ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ లో ఆధిక్యం కనబరిచిన వెంకటలక్ష్మి రౌండు రౌండుకు ఆధిక్యం పెంచుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఇంకా అంతిమ ఫలితం ప్రకటించాల్సివుంది. కాగా, బొత్స కుటుంబం నుంచి ఈ ఎన్నికల్లో ముగ్గురు పోటీ చేయగా, కూతరు అనూష తప్ప మిగిలిన ఇద్దరు ఆధిక్యం కనబరచడమే హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా బొత్స సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలో వైసీపీ రెండు స్థానాల్లో విజయం సాధించడం ఆ పార్టీకి కొత్త ఊపిరిలూదినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఫలితాలతో చీపురుపల్లిలో సీనియర్ నేత బొత్స పునర్వైభవం సాధించే దిశగా అడుగులు వేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
