బొత్స ఏడ్చింది అందుకే...పయ్యావుల చెప్పిన గుట్టు
సీనియర్ వైసీపీ నేత శాసనమండలి లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ వెక్కి వెక్కి ఏడ్చింది ఎందుకో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మీడియా మీటింగ్ పెట్టి మరీ గుట్టు విప్పారు.
By: Satya P | 10 April 2026 11:11 PM ISTసీనియర్ వైసీపీ నేత శాసనమండలి లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ వెక్కి వెక్కి ఏడ్చింది ఎందుకో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మీడియా మీటింగ్ పెట్టి మరీ గుట్టు విప్పారు. సీనియర్ నాయకుడు బొత్స అలా మీడియా ముందు ఏడవడం తమకు కూడా బాధేసింది అని ఆయన అంటూనే ఇంతకీ ఆయన ఎందుకు ఏడ్చారో ఎవరికీ అర్ధం కాలేదని అన్నారు. అయితే కాస్తా లోతుగా ఆలోచిస్తే ఆయన ఏడుపునకు బలమైన కారణాలే ఉన్నాయని అన్నారు జగన్ ని చూసి భయపడి బొత్స వెక్కి ఏడిచారు అని పయ్యావుల సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ నైజం తెలిసి :
బొత్సకు జగన్ నైజం బాగా తెలుసు అన్నారు. జగన్ ఫ్లాష్ బ్యాక్ చూస్తే అనేక విషయాలు అందరికీ తెలుస్తాయని అన్నారు. తన తండ్రి వైఎస్సార్ మరణం నుంచి బాబాయ్ వివేకా గొడ్డలి వేటు దాకా జగన్ ఎన్నెన్ని చేశారో అని పయ్యావుల సెటైర్లు వేశారు. వివేకా హత్య కేసులో తొలుత గుండె పోటు అని ప్రసారం చేసిందే వైసీపీ వారి సొంత చానల్ టీవీలో అని పయ్యావుల గుర్తు చేశారు. బాబాయ్ మర్డర్ అయితే వెంటనే చేరుకోవాల్సిన జగన్ ఎనిమిది గంటలు లేటుగా రావడం వెనక ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. అలాగే పరిటాల రవి మర్డర్ కేసులో జగన్ ని రక్షించడానికి అరవై రోజుల పాటు తాము శ్రమించామని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన విషయాలు గుర్తు చేశారు.
అందరూ దూరం :
జగన్ తో తొలి నుంచి ఉన్న వారు అంతా వీడిపోయారు అని పయ్యావుల చెప్పారు. ఆయనతో జైలులో గడిపిన విజయసాయిరెడ్డి, అలాగే మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇలా ఎంతో మంది దూరం అయ్యారని అదే జగన్ నైజం అని పయ్యావుల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు తన ప్రత్యర్థుల విషయంలో జగన్ కక్ష సాధింపు చర్యలు ఎంత తీవ్రంగా ఉంటాయో కూడా అందరికీ ఎరుకే అని చెప్పారు. అచ్చెన్నాయుడు ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్నాను అని చెప్పినా వినకుండా ఏపీ అంతా ఏడు వందల కిలోమీటర్లు తిప్పారని దాంతో కుట్లు ఊడి రక్తం కారిందని అన్నారు. అలాగే తన పార్టీకే చెందిన అప్పటి ఒక ఎంపీ మీద కూడా ఎంత పెద్ద ఎత్తున కక్ష కట్టి హింసించారో అంతా చూశారు అని పయ్యావుల గుర్తు చేశారు. బహుశా ఇవన్నీ తలచుకుని బొత్స వెక్కి వెక్కి ఏడుస్తున్నారని పయ్యావుల చెప్పారు.
బొత్స అన్నవే చెప్పారు :
బొత్స అన్నవే అచ్చెన్నాయుడు చెప్పారు తప్ప కొత్త విషయాలు అభూత కల్పనలు ఎవరూ చెప్పలేఅని పయ్యావుల అన్నారు. మంత్రిగా ఉంటూ బొత్స అప్పట్లో వైసీపీ మీద జగన్ కుటుంబం మీద చేసిన విషయాలు అన్నీ ఉన్నాయని చరిత్రలో జరిగిన వాటి మీదనే అచ్చెన్నాయుడు గుర్తు చేసి చెప్పారని అన్నారు. అయితే తన పాత విషయాలను గుర్తు చేయడం వల్ల జగన్ ఏమి చేస్తారో అన్న భయంతోనే బొత్స బహుశా ఏడిచి ఉండవచ్చు అని పయ్యావుల సెటైర్లు వేయడం విశేషం. మొత్తం మీద బొత్స ఏడుపు ఇపుడు ఏపీ రాజకీయాల్లో రాజకీయ చర్చకు హాట్ కామెంట్స్ కి కూడా కారణం అవుతోంది.
