బొత్సను డైలమాలో పడేసిన జగన్.. మండలిలో ప్రతిపక్ష నేతకు ఎదురుదెబ్బ
వైసీపీ సీనియర్ నేత, మండలిలో ఆ పార్టీ పక్ష నేత బొత్స సత్యనారాయణకు శాసనమండలిలో ఎదురుదెబ్బ తగిలింది.
By: Tupaki Desk | 23 Sept 2025 12:55 PM ISTవైసీపీ సీనియర్ నేత, మండలిలో ఆ పార్టీ పక్ష నేత బొత్స సత్యనారాయణకు శాసనమండలిలో ఎదురుదెబ్బ తగిలింది. జీఎస్టీ 2.0 సంస్కరణలపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత తీసుకున్న నిర్ణయంతో శాసనమండలిలో బొత్స కంగుతిన్నారని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీలో చర్చించి ఈ విషయమై ఒక స్టాండు తీసుకోవాల్సివుండగా, అధినేత ఒకలా, మండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న బొత్స మరోలా స్పందించడంతో ప్రభుత్వం ఎదురుదాడి చేసే అవకాశం ఇచ్చినట్లైందని అంటున్నారు. వైసీపీలో భిన్నవైఖరి ఉండటంతో ప్రభుత్వం విపక్షాన్ని ఇరుకున పెట్టిందని, మంత్రుల వాగ్బాణాలతో సీనియర్ నేత బొత్స నిశ్చేష్టుడై నిల్చొవాల్సివచ్చిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
జీఎస్టీ 2.O సంస్కరణలు సోమవారం నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తూ అసెంబ్లీ, శాసనమండలిలో తీర్మానం ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో తీర్మానం ఏకపక్షంగా ప్రవేశపెట్టగా, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఉత్తర భారతదేశంలో తినే పరోటా, చపాతీపై జీఎస్టీ తగ్గించారని, దక్షిణ భారతదేశంలో తినే ఇడ్లీ, దోశపై జీఎస్టీ తగ్గిందా? లేదా? అనేది స్పష్టం చేయాలని సభలో నిలదీశారు. మరోవైపు ఎన్టీఏ ప్రభుత్వం 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టి సుమారు 55 లక్షల కోట్లు వసూలుచేసిందని చెప్పిన బొత్స, ఇప్పుడు సంస్కరణల పేరిట రూ.2.5 లక్షల కోట్ల ఉపశమనం మాత్రమే కల్పించారని విమర్శించారు.
అయితే బొత్స విమర్శలపై స్పందించిన ప్రభుత్వం.. జీఎస్టీ సంస్కరణలపై వైసీపీ స్టాండ్ ఏంటో స్పష్టం చేసి మాట్లాడాలని నిలదీసింది. ఆర్థిక మంత్రి కేశవ్ మాట్లాడుతూ, బొత్స గారూ జీఎస్టీ సంస్కరణలపై మీ వైఖరి ఏంటి అంటూ పయ్యావుల సూటిగా ప్రశ్నించారు. శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ)లో జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెడతే మీ పార్టీ పరంగా వ్యతిరేకిస్తామని చెప్పారు కదా? కానీ మీరు తీర్మానాన్ని వ్యతిరేకించరు. వ్యతిరేకించలేరు కూడా అంటూ ఎద్దేవా చేశారు. దీనికి కారణం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఎక్స్ లో జీఎస్టీపై చేసిన పోస్టు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జీఎస్టీ సంస్కరణలపై ఎక్స్ లో అధికారికంగా పోస్టు చేసిన మాజీ సీఎం జగన్.. విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారని ప్రధాని నరేంద్ర మోదీని అభినందించారు. దీంతో సభలో తాము జీఎస్టీ సంస్కరణలను వ్యతిరేకిస్తామని బీఏసీలో చెప్పిన బొత్స మాటలకు విలువ లేకుండా పోయిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మండలిలో బొత్స విమర్శలు గుప్పిస్తుండగా, జగన్ ట్వీట్ ను అడ్డు పెట్టుకుని ఆర్థిక మంత్రి పయ్యావుల ఎదురుదాడి చేయడం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. జగన్ ట్వీట్ ను అధికార పక్షం ప్రస్తావించడంతో అంతవరకు ధాటిగా మాట్లాడిన బొత్స.. కాసేపు నీళ్లు నమలాల్సిన పరిస్థితిలో డైలమాలో పడిపోయారని అంటున్నారు. అయితే కాసేపటికే అధికార పక్షం విమర్శల నుంచి తేరుకున్న బొత్స.. తన అనుభవంతో జీఎస్టీపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారని అంటున్నారు. రూ.55 లక్షలు పన్నులుగా వసూలు చేసి ఇప్పుడు కేవలం కంటితుడుపుగా రూ.2.40 లక్షల మేర భారం తగ్గించామని చెబుతున్నారంటూ సంస్కరణల వల్ల ప్రజలకు స్పల్ప ఊరట మాత్రమే దక్కుతుందని చెప్పే ప్రయత్నం చేశారని అంటున్నారు
