జూనియర్ బొత్స రంగంలోకి దిగినట్లేనా ?
ఇది వారసుల కాలం. రాజకీయాల్లో సినీ రంగంలో వారిదే హవా. తండ్రుల వారసత్వాన్ని అంది పుచ్చుకునే కొడుకులు ఉంటే ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు ఉండవు.
By: Satya P | 25 May 2026 9:27 AM ISTఇది వారసుల కాలం. రాజకీయాల్లో సినీ రంగంలో వారిదే హవా. తండ్రుల వారసత్వాన్ని అంది పుచ్చుకునే కొడుకులు ఉంటే ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు ఉండవు. విజయనగరం జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ కుటుంబంలో కూడా వారసుడు వచ్చేసారు. బొత్స అయితే సర్వ సాధారణ కుటుంబం నుంచి వచ్చి రాజకీయంగా అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ఆయన ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఈ రోజుకి ఈ స్థాయిని అందుకున్నారు. తానే ఒక వట వృక్షంగా ఎదిగి తన వాళ్లకు బంధువులకు సన్నిహితులకు రాజకీయంగా అండ దండ అయ్యారు. అందరినీ అందలాలు ఎక్కించారు.
నూతన ఉత్సాహంతో :
దాదాపుగా నాలుగు దశాబ్దాల పై చిలుకు బొత్స రాజకీయ జీవితం సాగుతూ వచ్చింది. ఎన్నో సార్లు మంత్రి అయ్యారు. అలాగే పార్టీ పరంగా కీలక పదవులు నిర్వహించారు. ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా పనిచేశారు. తృటిలో తప్పిపోయింది కానీ చీఫ్ మినిస్టర్ కావాల్సిందే. సరే ఇంత దాకా వచ్చిన బొత్స తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించకుండానే పదవీ విరమణ చేస్తారా అన్న చర్చ అయితే అభిమానులలో ఉంటూ వచ్చింది. దానికి కారణాలు ఉన్నాయి. వారసులలో పెద్దగా ఆసక్తి లేదని వార్తలు వచ్చాయి. మరో వైపు చూస్తే బొత్స ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఏకంగా రెండు నెలల పాటు క్రియాశీల రాకేయేలకు కూడా దూరం అయిపోయారు. దాంతో బొత్స స్వచ్చందంగా తప్పుకుంటారు అని రకరకాలైన ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే సడెన్ గా బొత్స మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని తెగనాడుతూ జగన్ని పొగుడుతూ ఆయన ప్రెస్ మీట్ అంతా సాగింది.
బొత్స కుమారుడి సందడి :
ఇక బొత్స మళ్ళీ జనంలోకి కూడా వచ్చేశారు. తాజాగా విజయనగరం జిల్లా రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల కార్యాలయం నూతనంగా ప్రారంభోత్సవం జరిగింది. అందులోనే కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం కూడా జరిగంది. దానికి బొత్స ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మొత్తం జిల్లాకు చెందిన క్యాడర్ కూడా తరలివచ్చింది. వారూ వీరూ కాదు వైసీపీ నేతలు అంతా అక్కడే ఉన్నారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించినది ఒకే ఒకరు. ఆయనే బొత్స కుమారుడు. డాక్టర్ బొత్స సందీప్ బాబు ఈ మీటింగులో పాలుపంచుకోవడం తో క్యాడర్ ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి. అంతే కాదు బొత్స వర్గంలోనూ వారసుడు వచ్చాడు అన్న సంబరం కనిపించింది.
చీపురుపల్లి లోనేనా :
బొత్స అయిదు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచిన సీటు చీపురుపల్లి. బొత్స బంధు వర్గం అభిమాన ఘనం అంతా అక్కడే ఉంది. కొన్ని ఊళ్ళకు ఊళ్ళే బొత్స వర్గం ఉన్న ఏరియా అది. అందుకే అక్కడ నుంచే సందీప్ బాబు పోటీకి దిగుతారు అని అంటున్నారు. వైసీపీ యువ నాయకుడు బొత్స సందీప్ అని క్యాడర్ కూడా హడావుడి చేస్తోంది. ఇక జగన్ సైతం బొత్స కుమారుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని అంటున్నారు.మొత్తానికి బొత్స 2029 ఎన్నికల దాకా తన అనారోగ్యాన్ని రాజకీయ విరామాన్ని పక్కన పెట్టి ఫుల్ జోష్ తో జనంలో ఉంటారని కూడా అంటున్నారు. అలా బొత్స తీసుకున్న నిర్ణయంతో వైసీపీకి కూడా ఊపు వచ్చింది అని చెబుతున్నారు.
