Begin typing your search above and press return to search.

బొత్స ఇంట్లో మరో వికెట్ ఔట్.. కన్నీళ్లు పెట్టుకున్నా నమ్మని వైసీపీ

వైసీపీ సీనియర్ నేత బొత్స కుటుంబంలో రాజకీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   2 Oct 2026 8:10 PM IST
బొత్స ఇంట్లో మరో వికెట్ ఔట్.. కన్నీళ్లు పెట్టుకున్నా నమ్మని వైసీపీ
X

వైసీపీ సీనియర్ నేత బొత్స కుటుంబంలో రాజకీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. గత నెలలో బొత్సతో విభేదించి ఆయన మేనల్లుడు, జడ్పీ మాజీ చైర్మన్ చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా చేశారు. ఇక తాజాగా చిన్నశ్రీను వియ్యంకుడు, బొత్సకు సమీప బంధువు అయిన నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. చిన్నశ్రీను పార్టీకి రాజీనామా చేయగానే బడ్డుకొండను నెల్లిమర్ల ఇంచార్జి పదవి నుంచి తొలగించిన వైసీపీ అధిష్టానం అక్కడితో ఆగకుండా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. ఇటీవల కాలంలో వైసీపీ అధిష్టానం పార్టీ నేతల విషయంలో ఇంతకఠినంగా వ్యవహరించిన సందర్భం ఇంకొకటి లేదని అంటున్నారు. గత నెలలో చిన్న శ్రీను రాజీనామా చేసిన తర్వాత నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో బొత్సతోపాటు బడ్డుకొండ కూడా కన్నీరు పెట్టుకున్నారు. తమ కుటుంబంలో చోటుచేసుకున్న రాజకీయాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ వైసీపీ అధిష్టానం ఆయనను నమ్మలేదని సస్పెన్షన్ వేటుతో నిరూపించిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడును వైసీపీ నుంచి సస్పెండ్ చేయడం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బడ్డుకొండ సీనియర్ నేత బొత్సకు సమీప బంధువు. వరుసకు తమ్ముడు అవుతాడని చెబుతున్నారు. బొత్స ప్రోత్సాహంతో ఒకసారి జిల్లా పరిషత్ చైర్మనుగా పనిచేసిన బడ్డుకొండ అప్పలనాయుడు రెండుసార్లు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక తాజాగా జడ్పీ మాజీ చైర్మన్ చిన్న శ్రీను రాజీనామా తర్వాత మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ రాజకీయ వ్యవహారాలపై వైసీపీలో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి అంటున్నారు. చిన్న శ్రీనుకు స్వయాన బావ, వియ్యంకుడు అయిన బడ్డుకొండ కూడా ఆయనతో చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయని భావించడంతో నెల్లిమర్ల ఇంచార్జి పదవి నుంచి తప్పించినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ తాను బొత్సతోనే ఉంటానని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ చెప్పారు. కానీ, వైసీపీ అధిష్టానం ఆయనను విశ్వసించలేదని తాజా సంఘటన రుజువు చేస్తోందని అంటున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగంతో బడ్డుకొండపై వేటు వేశారు. అయితే సీనియర్ నేత బొత్స సిఫార్సులతోనే పార్టీ ఈ చర్య తీసుకుని ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.

బొత్స ఫ్యామిలీలో పెను దుమారం

నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండను వైసీపీ నుంచి సస్పెండ్ చేయడం జిల్లా రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. జిల్లా వైసీపీలో బొత్స కుటుంబానిదే హవా. బొత్సతో సహా ముగ్గురు ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్ పదవి ఆ కుటుంబంలో ఉండేది. గత ఎన్నికల్లో ఎదురైన ఫలితాలతో బొత్సతోపాటు ఆయన సోదరుడు అప్పలనరసయ్య, మేనకోడలి భర్త అయిన బడ్డుకొండ అప్పలనాయుడు ఓటమి చెందారు. ఇక జడ్పీ చైర్మనుగా పనిచేసిన చిన్న శ్రీను పదవీకాలం చివరిలో టీడీపీలో చేరారు. అప్పటి నుంచి బొత్స కుటుంబంలో రాజకీయంగా అలజడి మొదలైంది. ఒకప్పుడు జిల్లాను శాసించిన బొత్స ఇప్పుడు సొంత ఫ్యామిలీలో లుకలుకలతో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారని చెబుతున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంలో ఎవరు తనవైపు, ఎవరు జడ్పీ మాజీ చైర్మన్ చిన్న శ్రీనువైపు అన్నది తేల్చుకోలేని పరిస్థితిని బొత్స ఎదుర్కుంటున్నట్లు చెబుతున్నారు.

బడ్డుకొండ వాట్ నెక్ట్స్

వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు భవిష్యత్తు రాజకీయ ప్రయాణంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన బావమరిది, వియ్యంకుడు అయిన చిన్న శ్రీను ఇప్పటికే టీడీపీలో చేరారు. చిన్న శ్రీనుతోపాటు ఆయన కుమార్తె సిరి సహస్ర కూడా టీడీపీలో యాక్టివ్ గా మారిపోయారు. సిరసహస్ర మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ కోడలు. ఈ కారణంతోనే ఆయనను వైసీపీ నుంచి తొలగించినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బడ్డుకొండ కూడా టీడీపీ కండువా కప్పుకుంటారా? లేక రాజకీయంగా విరామం తీసుకుంటారా? అన్నది చర్చకు తావిస్తోంది. నెల్లిమర్లలో ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీలో మార్క్ ఫెడ్ చైర్మను కర్రోతు బంగార్రాజు యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఈయనతోపాటు నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాల నాయకులు కూడా ఎమ్మెల్యే స్థాయి రాజకీయాలతో నియోజకవర్గంలో ప్రభావం చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండకు టీడీపీలో సరైన స్థానం దక్కుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంలో ఆయన నిర్ణయం ఏంటి అన్నది ముందు తేలాల్సివుందని అంటున్నారు.