పవన్‌కు వైసీపీ కీలక డిమాండ్.. విషయం ఏంటంటే!
ఆంధ్రుల హక్కుగా ఏర్పడిన విశాఖ ఉక్క పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయ త్తం అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే తెరమీదికి వచ్చింది.
By: Tupaki Desk | 23 Aug 2025 9:00 PM ISTవైసీపీ వర్సెస్ జనసేన మధ్య వివాదాలు, రాజకీయ విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఎన్ని కల తర్వాత.. తరచుగా పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎం హోదాలో వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నా.. వైసీపీ నాయకులు ఎవరూ కూడా పవన్ జోలికి రావడం లేదు. కారణాలు ఏవైనా.. పవన్ కళ్యాణ్‌ను కూడా వైసీపీ నేతలు ఎవరూ కెలకడం లేదు. అయితే.. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు బొత్స సత్య నారాయణ పవన్‌ను ఉద్దేశించి కీలక డిమాండ్‌ను తెరమీదికి తెచ్చారు. ఈ నెల 30న దీనిపై తేల్చాలని కూడా షరతు విధించారు.
విషయం ఏంటంటే..
ఆంధ్రుల హక్కుగా ఏర్పడిన విశాఖ ఉక్క పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయ త్తం అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే తెరమీదికి వచ్చింది. ఈ ప్రతిపాదన సరికాదంటూ.. అప్పటి సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖలు కూడా రాశారు. ఇక, ఉద్యోగులు, కార్మికల సంఘాల నాయకులు ఉద్యమానికి దిగారు. ప్రస్తుతం రెండున్నరేళ్లుగా ఇవి కొనసాగుతున్నాయి. అయితే.. ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం పట్టుదలతోనే ఉంది. కానీ, రాష్ట్ర హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణలు పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.
దీంతో ఈ ప్రక్రియ నెమ్మదిస్తోంది. అయినా.. తరచుగా ఏదో ఒక విభాగాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్రం పావులు కదుపుతూనే ఉంది. ఇక, రాష్ట్రంలో కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. విశాఖ ఉక్కును కాపాడు కునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే 1400 కోట్ల రూపాయలను విడుదల చేయించా రు. ప్రధానంగా ముడి ఇనుము గనులను కేటాయించాలన్న ప్రతిపాదన కూడా ఉంది. అయితే.. తాజాగా 32 కీలక విభాగాలను ప్రైవేటీకరిస్తూ.. విశాఖ ఉక్కు యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేసింది.
వీటిలో ఫర్నేజ్, గనులు, సహా ఇతర కీలక విభాగాలు ఉన్నాయి. వీటిని కనుక ప్రైవేటీకరిస్తే.. ఇక, మిగిలేది పెద్దగా ఏమీ ఉండదని కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న(లేఖలు రాసిన తర్వాత) వైసీపీ నాయకులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నట్టు ప్రకటించారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరంగా కాపాడే లక్ష్యంతో ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న ఆందోళనలకు తాము మద్దతిస్తామని బొత్స సత్యనారాయణ తాజాగా ప్రకటించారు.
ఈ క్రమంలోనే జనసేనకు కొన్ని ప్రశ్నలు సంధించారు. అసెంబ్లీ వేదికగా.. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఏం చెబుతారని.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. అంతేకాదు.. ఈ నెల 30న విశాఖలో జరిగే జనసేన సభలో దీనిపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవలం మాటలు చెప్పి వదిలేయడం కాదని.. మీ రు ఏం చేయాలని అనుకుంటున్నారో.. ఈ 32 విభాగాల ప్రైవేటీకరణపై మీ ఆలోచన ఏంటో చెప్పాలని కోరారు. మరి దీనిపై జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
