జగన్ ఇంటి ముందు కలకలం.. బోరుగడ్డ యూటర్న్, సజ్జలపై తీవ్ర ఆరోపణలు
తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నివాసం ముందు వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ సంచలన ఆందోళనకు దిగారు.
By: Tupaki Desk | 4 Aug 2026 3:03 PM ISTతాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నివాసం ముందు వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ సంచలన ఆందోళనకు దిగారు. తనను పార్టీ కార్యాలయం లోపలకు అనుమతించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలతో అందరికీ షాక్ ఇచ్చారు. తాను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అభిమాని అని, ఆయన కోసం పనిచేసిన తనకు పార్టీలో కనీస గౌరవం లేకుండా చేస్తున్నారని బోరుగడ్డ ఫైర్ అయ్యారు. జగన్ కోసం పనిచేసిన తనపై 22 కేసులు నమోదు చేశారని, తన కంపెనీలు మూసివేతకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన భార్యతో కలిసి జగన్ నివాసం వద్ద బోరుగడ్డ బైఠాయించడంతో కలకలం చెలరేగింది.
వైసీపీ అధినేత జగన్ రెడ్డి నివాసం, పార్టీ కేంద్ర కార్యాలయం ముందు అనూహ్యంగా బోరుగడ్డ అనిల్ కుమార్ భార్యతో కలిసి బైఠాయించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ అభిమానిగా ఎన్నో త్యాగాలు చేసిన తాను అధినేతను కలుస్తానంటే పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా సజ్జల కోటరీతో తనను రౌడీషీటర్ అంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనపై రౌడీషీట్ లేదని హైకోర్టు చెప్పినా, వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్ రెడ్డి మాత్రం బోరుగడ్డ రౌడీషీటర్ అంటూ మాట్లాడుతున్నారని, ఆయనకు నోటీసులు పంపానని వెల్లడించారు. ఈ సమయంలో గతంలో తాను కారుమూరు వెంకటరెడ్డితో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను మీడియాకు వినిపించారు.
తాను పార్టీ కోసం కష్టపడ్డానని, 9 నెలలు జైలులో ఉన్నానని అయినా తనను పార్టీ ఆఫీసులోకి రానీయడం లేదన్నారు. దళితులు మా మేనమామలు అని చెప్పే జగన్ రెడ్డి ఈ విషయంలో కల్పించుకోవాలని డిమాండ్ చేశారు. తనపై సజ్జల రామకృష్ణారెడ్డి కుట్ర పన్నుతున్నారని, ఈ విషయాలు ఏవీ ఆయనకు తెలియవని ఆరోపించారు. తమకు జగన్ రెడ్డి మాత్రమే నాయకుడు అని, సజ్జల నాయకుడు కాదని వ్యాఖ్యానించారు. ఇస్త్రీ బట్టలు వేసుకుని పార్టీ కార్యాలయంలో కూర్చునే సజ్జలకు ఇక్కడ పనేమీ లేదన్నారు. తమలాంటి వారు పార్టీ కోసం కష్టపడుతున్నామని, కేసులు పెట్టించుకుని రోడ్డు మీదపడ్డామని వాపోయారు.
జగన్ సతీమణి భారతి, తల్లి విజయమ్మను అవమానించారనే తాను బయటకు వచ్చానని, అయినా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీసుకు రమ్మని నాలుగు గంటలు కూర్చోబెట్టారని అయినా జగన్ రెడ్డిని కలవనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, వైసీపీ అభిమానిగా చెప్పుకుంటున్న బోరుగడ్డ ఆకస్మికంగా నిరసనకు దిగడంతో తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద కలకలం చెలరేగింది. అంతేకాకుండా పార్టీలో జగన్ తర్వాత ఎక్కువ ప్రాధాన్యం ఉండే పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలపై అత్యంత తీవ్ర వ్యాఖ్యలతో బోరుగడ్డ విమర్శలు గుప్పించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
ఎన్నడూలేని విధంగా బోరుగడ్డ ఇలా ఆందోళనకు దిగడం వెనుక కారణాలు ఏంటి అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా, ఆ పార్టీ సానుభూతిపరుడిగా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో బోరుగడ్డ చేసిన వ్యాఖ్యలు, ప్రత్యర్థులపై దారుణ దూషణలతో వైసీపీకి తీవ్ర నష్టం జరిగిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు కావడం, 9 నెలలు జైలులో ఉండటం తెలిసిందే. ఆ తర్వాత సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న బోరుగడ్డ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. వైసీపీలో తనకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఆందోళన చేయడం వెనుక పార్టీపై అసంతృప్తా లేక పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వైఖరికి నిరసన అనేది తెలియాల్సివుందని అంటున్నారు.
