Begin typing your search above and press return to search.

ఆ జాబితా నుండి బోర్న్ వీటా ఔట్!

బహుళజాతి సంస్థ క్యాడ్ బరీ ఉత్పత్తి అయిన బోర్న్ వీటాను ఇప్పుడు ఆరోగ్య పానీయాల జాబితా నుండి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   14 April 2024 3:45 AM GMT
ఆ జాబితా నుండి బోర్న్ వీటా ఔట్!
X

పిల్లలకు శక్తిని ఇచ్చే పానీయంగా పాలలో కలుపుకుని తాగే బోర్న్ వీటా అంటే తెలియని పిల్లలు ఉండరంటే అతిశయోక్తి కాదు. పిల్లలు ఉన్న ఇంట్లో బోర్న్ వీటా తప్పనిసరి. అది లేకుంటే పిల్లలు పాలు తాగడం కష్టమే. అందుకే తరాలుగా బోర్న్ వీటా దిగువ, మధ్య తరగతి కుటుంబాలలో భాగం అయ్యింది. బహుళజాతి సంస్థ క్యాడ్ బరీ ఉత్పత్తి అయిన బోర్న్ వీటాను ఇప్పుడు ఆరోగ్య పానీయాల జాబితా నుండి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు అన్ని ఈ కామర్స్ పోర్టళ్లకు సూచనలు జారీచేసింది. ఒక్క బోర్న్ వీటానే కాకుండా ఆయా పోర్టళ్లలో హెల్త్ డ్రింకులుగా చలామణీ అవుతున్న పానీయాలు, ఇతర ఉత్పత్తులకు ఇది వర్తిస్తుందని ఉత్తర్వులలో పేర్కొంది.

నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) సెక్షన్ 14 ఆఫ్ సీఆర్పీసీ యాక్ట్ 2005 కింద జరిపిన పలు విచారణలలో ఆరోగ్య పానీయాలు అంటూ ఏవీ లేవని నిర్ధారించినట్టు కేంద్రం తన ప్రకటనలో వెల్లడించింది. బోర్న్ వీటాలో నిర్దేశిత స్థాయి కంటే చక్కెర మోతాదు అధికంగా ఉన్నట్టు ఈ సంస్థ గుర్తించింది. బలవర్ధకమైన ఆరోగ్య పానీయాలు అంటూ ప్రచారం చేసుకుంటున్న వాణిజ్య ఉత్పత్తులపై చర్యలు తీసుకోవాలని ఎన్సీపీసీఆర్ గతంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)ని కోరింది.