Begin typing your search above and press return to search.

కేటీఆర్ సన్నిహితుడు బీజేపీ వైపు చూస్తున్నారా?

తాజాగా గ్రేటర్ హైదరాబాద్ కు మేయర్ గా వ్యవహరించి.. కొన్నేళ్లుగా మాజీగా బండి లాక్కొస్తున్న బొంతు రామ్మోహన్ చూపు ఇప్పుడు బీజేపీ వైపు పడిందా?

By:  Tupaki Desk   |   24 Aug 2023 4:52 AM GMT
కేటీఆర్ సన్నిహితుడు బీజేపీ వైపు చూస్తున్నారా?
X

రాజకీయాల్లో కాలానికి మించింది లేదు. శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు ఈ రంగంలో ఉండరన్న విషయం తెలిసిందే. ఎంతటివాడైనా అధికారానికి దాసుడే. ఈ క్రమంలో తనకు దక్కని అవకాశం కోసం అత్యంత ఆప్తుల్ని సైతం పక్కన పెట్టేసే వైనం తరచూ చూస్తున్నదే. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ కు మేయర్ గా వ్యవహరించి.. కొన్నేళ్లుగా మాజీగా బండి లాక్కొస్తున్న బొంతు రామ్మోహన్ చూపు ఇప్పుడు బీజేపీ వైపు పడిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఉప్పల్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా బండారు లక్ష్మారెడ్డిని ఎంపిక చేస్తూ గులాబీ బాస్ తీసుకున్న నిర్ణయం బొంతును బాధించిందని చెబుతున్నారు. మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకడిగా వ్యవహరించే తనకు యువరాజు ఆశీస్సులున్నా.. టికెట్ ఇచ్చే విషయంలో మాత్రం మొండి చెయ్యి చూపించటాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించిన బొంతు.. అక్కడ లెక్కలు తనకు సూట్ అయ్యేలా లేవన్న ఉద్దేశంతో ఇప్పుడు బీజేపీ వైపు కన్నేసినట్లుగా చెబుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా సుపరిచితమైన బొంతుకు.. అదే వరంగా మారి హైదరాబాద్ మహానగర మేయర్ కావటం తెలిసిందే. యూవర్సిటీ సమయంలో ఏబీవీపీలో చురుగ్గా వ్యవహరించేవారు. ఇప్పుడు ఆ లింకులే.. బీజేపీ టికెట్ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

ఇదిలా ఉంటే.. ఈ ప్రచారంపై బీఆర్ఎస్ నేతలు.. కార్యకర్తలు అవాక్కు అవుతున్నారు. మిగిలిన నేతలకు లేని అడ్వాంటేజ్ బొంతుకు ఉంది. అదేమంటే.. మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకడిగా గుర్తింపు ఉన్న బొంతు.. ఎంత టికెట్ ఇవ్వకుంటే మాత్రం ఇలా ప్లేట్ మార్చేయటమా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం నిజమైతే.. బొంతు దిద్దుకోలేని తప్పు చేస్తున్నట్లుగా పేర్కొంటున్నారు. ఎంత టికెట్ ఇవ్వకపోతే మాత్రం పార్టీజెండా మార్చేసుకోవటం ఏమిటి? కేటీఆర్ సన్నిహితుడిగా పేరున్న ఆయన.. ఇప్పుడు కాసింత ఓపిక పడితే మంచి ఫ్యూచర్ ఉంటుందన్న మాటలు చెబుతున్నారు. మరి.. తనపై జరుగుతున్న ప్రచారంపై బొంతు ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.