బొండా టార్గెట్ ఎవరు? పవన్ పేరు ఎందుకు ప్రస్తావించారు? సీఎంవో ఆరా!
అసెంబ్లీలో కాలుష్యంపై జరిగిన స్వల్ప చర్చ పెద్ద దుమారమే రేపింది.
By: Tupaki Desk | 20 Sept 2025 12:16 PM ISTఅసెంబ్లీలో కాలుష్యంపై జరిగిన స్వల్ప చర్చ పెద్ద దుమారమే రేపింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యవేక్షిస్తున్న కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, పీసీబీ చైర్మన్ క్రిష్ణయ్యను టార్గెట్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉండటం, డిప్యూటీ సీఎం పవన్ పేరు కూడా అసెంబ్లీలో ప్రస్తావించడంతో కాక రేగింది. సభ ముగిసిన వెంటనే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా సమీక్షించారని, ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పవన్ నొచ్చుకునేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉన్నాయనే ప్రచారంతో సీఎంవో కూడా రంగంలోకి దిగిందని అంటున్నారు.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా సీనియర్ నేత. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ కు అత్యంత సన్నిహితంగా ఉంటారని కూడా అంటారు. ఆయనకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే నేరుగా అధినేత, యువనేతతో చెప్పి చేయించుకోవచ్చు. కానీ, ఆయన తన నియోజకవర్గ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించాలని అనుకోవడమే ఆసక్తి రేపుతోంది. తన నియోజకవర్గానికి సంబంధించి కాలుష్యంపై పీసీబీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే.. ఏమైందో కానీ, తన ఫిర్యాదుకు అనుగుణంగా పీసీబీ చర్యలకు ఉపక్రమిస్తే అడ్డుపడినట్లు చెబుతున్నారు. మళ్లీ ఆయనే అసెంబ్లీలో పీసీబీపై రచ్చ చేయడం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఆయన పీసీబీ చైర్మన్ క్రిష్ణయ్యను టార్గెట్ చేయడానికే అలా మాట్లాడారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీలో కాలుష్యంపై ప్రశ్నోత్తరాల సమయంలో గుంటూరు ఎమ్మెల్యే మాధవి ప్రశ్నకు అనుబంధంగా మాట్లాడిన ఎమ్మెల్యే బొండా ఉమ పీసీబీ చైర్మన్ క్రిష్ణయ్యపై వ్యక్తిగత ఆరోపణలు దిగడం, ఏ పని చేయమన్నా డిప్యూటీ సీఎం పవన్ పేరు చెబుతున్నారని ఆక్షేపించడంతో ఇటు ఉప ముఖ్యమంత్రి, అటు సీఎంవో సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు. పీసీబీ చైర్మన్ సరిగా పనిచేస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే.. ఉప ముఖ్యమంత్రి పేరు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం చేయొద్దన్నారని, ఆయన ఆఫీసు నుంచి మాకు చెప్పాలని అంటున్నారు. ఇది సరికాదు, నాలాంటి ఎమ్మెల్యేలు గెలిస్తేనే ఆయన (క్రిష్ణయ్య) పీసీబీ చైర్మన్ సీట్లో కూర్చొన్నారని గుర్తించాలంటూ ఎమ్మెల్యే ఉమ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా పీసీబీ చైర్మన్ కాలుష్య నియంత్రణపై సరిగా వ్యవహరించడం లేదని, ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించడం లేదని మండిపడ్డారు.
ఇక బొండా వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ తీవ్రంగా పరిగణించారని అంటున్నారు. సభ ముగిసిన వెంటనే తన పేషీలో పీసీబీ అధికారులను పిలిపించి మాట్లాడారని అంటున్నారు. ఎమ్మెల్యే ఈ విధంగా ఎందుకు మాట్లాడి ఉంటారో అని క్రిష్ణయ్యను ఆరా తీశారు. దీంతో ఎమ్మెల్యే బొండా ఉమ ఆరోపణల పూర్వాపరాలను ఆయన డిప్యూటీ సీఎం పవన్ కి వివరించారని అంటున్నారు. క్రిష్ణయ్యతో మాట్లాడిన తర్వాత బొండా మాటలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని భావించిన ఉప ముఖ్యమంత్రి ఈ విషయమై సమగ్ర నివేదిక ఇవ్వాలని, దానిపై తాను ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడతానని చెప్పినట్లు సమాచారం. వ్యక్తిగత ఉద్దేశాలతో ఒకరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం కరెక్టు కాదని పవన్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.
కాగా, ఈ వివాదానికి అసలు కారణం పీసీబీ అధికారులు డిప్యూటీ సీఎంకి వివరించినట్లు సమాచారం. ‘క్రెబ్స్ బయో కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ వ్యర్థాలను భారీగా జక్కంపూడి ఏరియాలో డంప్ చేస్తోందని, ఇందులో కొంత భాగం బొండా నియోజకవర్గమైన విజయవాడ సెంట్రల్ పరిధిలోకి వస్తుందని చెబుతున్నారు. క్రెబ్స్ బయో కెమికల్స్ పై చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్యే లేఖ రాశారు. విజయవాడ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు చెబుతున్నారు. దీంతో పీసీబీ విచారణ జరిపి చర్యలకు సిద్ధమైతే , చర్యలు తీసుకోవద్దని ఎమ్మెల్యేనే ఆపారని పీసీబీ అధికారులు ఉప ముఖ్యమంత్రికి నివేదించినట్లు తెలుస్తోంది. దీంతో పీసీబీ చైర్మన్ ను టార్గెట్ చేయడానికే బొండా అలా మాట్లాడారని పవన్ అభిప్రాయపడినట్లు సమాచారం.
ఇంకోవైపు అసెంబ్లీలో ఎమ్మెల్యే బొండా ఉమ వ్యాఖ్యలు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ తో క్రిష్ణయ్య, పీసీబీ అధికారులు చర్చలుపై సీఎంవో ఆరా తీసినట్లు సమాచారం. ఎమ్మెల్యే వ్యాఖ్యలు, వాటి వెనుక ఉద్దేశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ద్రుష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అదేసమయంలో పీసీబీ చైర్మన్ కూడా అన్ని వివరాలను సీఎంవోకు నివేదించినట్లు చెబుతున్నారు.
