టార్గెట్ పవన్: ఎవరీ ఉమా.. ఏమా కథ?!
టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను టార్గెట్ గా చేసుకుని చేసిన వ్యాఖ్యలు అంతర్గతంగానే కాకుండా.. బహిరంగంగా కూడా వివాదానికి దారితీశాయి.
By: Garuda Media | 20 Sept 2025 3:55 PM ISTఏపీ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం చోటు చేసుకున్న కీలక పరిణామం.. కూటమిని కుదిపేస్తోంది. టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను టార్గెట్ గా చేసుకుని చేసిన వ్యాఖ్యలు అంతర్గతంగానే కాకుండా.. బహిరంగంగా కూడా వివాదానికి దారితీశాయి. అంతేకాదు.. ఆ మరుసటి చోటు శనివారం(సెప్టెంబరు 20) నాడు అదే ఉమా మహేశ్వరరావు కేంద్రంగా బార్ యజమాని చేసిన సెల్ఫీ వీడియో మరింత దుమారం రేపింది. బార్లకు టెండర్ దరఖాస్తు దాఖలు చేసేందుకు వస్తే.. తనను అడ్డుకున్నారని, ఎమ్మెల్యే ఉమాను కలిసి రావాలని అధికారులే చెబుతున్నారని ఆయన ఆరోపించారు.
ఈ రెండు వ్యవహారాలు కూడా.. కూటమిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చకు వచ్చాయి. దీంతో ఎవరీ ఉమా? ఏంటాయన పరిస్థితి? అనేది ఆసక్తిగా మారింది. స్టీలు గిన్నెలు తయారు చేసే పరిశ్రమను పెట్టుకుని వ్యాపార వేత్తగా ఎదిగిన బొండా ఉమా.. 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన.. విజయవాడ సెంట్రల్‌పై దృష్టి పెట్టి.. 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై ఇక్కడ విజయం దక్కించుకున్నా రు. ఆది నుంచి కూడా ఆయన వివాదాలకు కేంద్రంగా నిలిచారనే వాదన సొంత పార్టీలోనే ఉంది.
తొలి నాళ్లలోనే మంత్రిపదవిని ఆశించారు. అయితే.. అది దక్కలేదు. దీంతో అసెంబ్లీలో విపక్ష వైసీపీని అప్పట్లో టార్గెట్ చేసుకుని.. కొడాలి నానీ సహా ఇతరులపై `నా.. కొ..క చేతులు ఇరిచేస్తా` అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్రదుమారం రేపాయి. దీనిపై సభలోనే ఉన్న చంద్రబాబు రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలు తొలగిస్తామని హామీ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇక, 2019లో ఓడిపోయినా.. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ఇక, పారిశ్రామికంగా తన వాటాదారు దారుణ హత్యకు గురైన ఘటనలో తొలినాళ్లలో ఆయన పేరు కూడా వినిపించింది. అదే సమయంలో మాజీ సైనికుడి భూములను ఆక్రమించుకున్నారన్న కేసుకూడా ఉంది.
ఇవన్నీ ఇలా.. ఉంటే, కూటమి కారణంగానే తనకు మంత్రి పదవి దక్కలేదన్నది ప్రస్తుతం ఆయనను వేధిస్తున్న విషయం. అయితే.. చంద్రబాబు ఆయన `విప్` హోదాను ఇచ్చారు. అయినా.. ఆయన మనుసు మాత్రం మంత్రి పీఠం చుట్టూనే తిరుగుతోంది. ఈ క్రమంలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్, మాజీ అధికారి పనబాక కృష్ణయ్య పై విమర్శలు చేస్తూ.. తన బాణాలను ఏకంగా ఆశాఖ మంత్రి పవన్ కల్యాణ్‌పై దూసుకుపోయేలా చేసి.. వివాదాలకు కేంద్రంగా మారారు.
తన శాఖను పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదని, పవన్‌కు బాధ్యత లేదా? అని ఆయన సభలో నిలదీశారు. ఇక, మర్నాడే బార్ యజమాని పెట్టిన సెల్ఫీ వీడియో మరింత దుమారం రేపింది. మరి ఇలాంటి నాయకులకు చంద్రబాబు తనదైన శైలిలో ముకుతాడు వేయకపోతే.. మున్ముందు కూటమిలో చిచ్చు మరింత పెరిగే అవకాశం ఉందని తమ్ముళ్లే చెబుతున్నారు.
