Begin typing your search above and press return to search.

శునకాలతో ఆ దేశం వెళ్తే ఫైన్.. డీఎన్ఏ పరీక్షలు కూడా.. పరేషాన్ లో పర్యాటకులు..

కేవలం మానవ రద్దీ కాకుండా, వారితో పాటు వచ్చే పెంపుడు జంతువుల వల్ల కూడా పర్యావరణం, పరిశుభ్రత దెబ్బతింటుందని ఆ దేశాలు వాపోతున్నాయి.

By:  Tupaki Desk   |   25 Sept 2025 12:00 PM IST
శునకాలతో ఆ దేశం వెళ్తే ఫైన్.. డీఎన్ఏ పరీక్షలు కూడా.. పరేషాన్ లో పర్యాటకులు..
X

పర్యాటక ప్రాంతాలను కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారింది. కరోనా తర్వాత ఆయా దేశాలు అన్ని రంగాల్లో ఆర్థికంగా నష్టాలు చూస్తున్నాయి. కొన్ని దేశాలు ప్రముఖంగా పర్యాటకంపైననే ఆధారపడి ఉంటాయి. అలాంటి దేశాలకు వెళ్తున్న వారి నుంచి ఆయా ప్రాంతాలు, ప్రదేశాలను రక్షించుకోవడం ఆ దేశ ప్రభుత్వానికి, ప్రజలకు సవాలుగా మారింది. కేవలం మానవ రద్దీ కాకుండా, వారితో పాటు వచ్చే పెంపుడు జంతువుల వల్ల కూడా పర్యావరణం, పరిశుభ్రత దెబ్బతింటుందని ఆ దేశాలు వాపోతున్నాయి. దీని భారి నుంచి బయటపడేందుకు ఉత్తర ఇటలీలోని ప్రాచీన పర్యాటక నగరం బొల్జానో వినూత్నమైన.., వివాదాస్పద మైన నిర్ణయం తీసుకుంది. పెంపుడు జంతువులైన శునకాల (కుక్కల)పై వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రత్యేక సుంకం విధించనుంది.

రోజుకు 1.50 యూరోలు (సుమారు ₹156)

బొల్జానో నగరం అద్భుతమైన ప్రాంతం. పర్యాటకులు సందర్శిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు.. కానీ వారి వెంట శునకాలు ఉంటే ఒక్కో కుక్కకు రోజుకు 1.50 యూరోలు (సుమారు ₹156) పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనకు ముఖ్య ఉద్దేశ్యం నగర పరిశుభ్రత. డోలమైట్ పర్వతాలను సందర్శించేందుకు వచ్చే యాత్రికులకు బొల్జానో ప్రవేశ ద్వారం. ఇక్కడి వీధులు, పార్కులు తరచుగా మలమూత్రాలతో మురికిగా మారుతున్నాయి. పర్యాటకులతో ఎలాంటి ఇబ్బంది లేదు.. కానీ వారి వెంట వచ్చే పెంపుడు జంతువులతోనే అంటూ ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. స్థానికులు కూడా కుక్కలను పెంచుకుంటున్నారు. అయితే దానికి సంబంధించి వారు పన్ను కడుతున్నారు. ఇది సంవత్సరానికి 100 యూరోలు (సుమారు ₹10,400).

డీఎన్ఏ పరీక్షలు తప్పనిసరి.. పైగా రాయితీ కూడా..

పన్నుతో పాటు ప్రతి శునకానికి డీఎన్ఏ పరీక్షలు తప్పనిసరి చేసింది అక్కడి ప్రభుత్వం. ఒక వేళ పర్యాటకుల శునకాలు వీధుల్లో మల, మూత్ర విసర్జన చేస్తే తమ శునకం చేయలేదని యజమాని వాదిస్తే ఈ డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తారు. అప్పుడు వారి కుక్కే అని తెలిస్తే జరిమానా మొత్తం 600 యూరోలు (సుమారు ₹62,500). ఇది యూరప్‌లో పెంపుడు జంతువుల నిర్వహణకు ఇప్పటి వరకు తీసుకున్న కఠిన చర్యల్లో ఒకటిగా నిలుస్తుంది.

ఈ నిర్ణయంపై దేశ, విదేశాల పర్యటకుల భిన్నభిప్రాయం..

అయితే ఇటలీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పెంపుడు జంతువులపై పన్ను వేయడం అమానుషం అనిపించవచ్చు. కానీ నగర ప్రాధాన్యత, పర్యాటకులను ఆకర్షించే శుభ్రమైన వాతావరణం కపాడుకోవడం, విలువైన ప్రదేశాలను రక్షించుకోవాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిందే అని అక్కడి ప్రభుత్వం చెప్తోంది. ఇందులో ఒక సదవకాశం కల్పించింది. ‘శునకానికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించి వివరాలు నమోదు చేసిన యజమానులకు రెండేళ్ల పాటు పన్ను మినహాయింపు అని ప్రకటించింది.’ ఇలాంటి ప్రోత్సాహకాలు కూడా అక్కడి వారికి ఉన్నాయి.

పర్యాటకంపై ప్రభావం ఎలా ఉండబోతోంది..

ప్రభుత్వం తీసుకున్న పెంపుడు జంతువులపై సుంకం నిర్ణయం పర్యాటకుల సంఖ్యపై ప్రతికూల ప్రభావం చూపుతుందా..? అన్న సందేహం కలిగిస్తుంది. శునకాలు ఉన్న యజమానులు వచ్చేందుకు ఆసక్తి చూపకపోవచ్చు. ఒక వేళ పన్ను చెల్లించేందుకు సిద్ధపడినవారు శుభ్రమైన వాతావరణాన్ని ఆస్వాదించగలరు.

బొల్జానో ప్రయోగం సక్సెస్ అయ్యేనా.?

మొత్తానికి, బొల్జానో నిర్ణయం పర్యాటక కేంద్రాల సంరక్షణలో కొత్త ప్రయోగం చేసిందనే చెప్పాలి. ఈ విధానం విజయవంతమైతే.. ఇతర దేశాలు కూడా తమ పర్యాటక ప్రాంతాలను కాపాడుకునేందుకు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పెంపుడు జంతువుల హక్కులు, మానవ సమాజ ప్రయోజనాలు ఈ రెండింటి మధ్య సున్నితమైన సమతుల్యం సాధించగలమా? అనే ప్రశ్నకు సమాధానం రాబోయే కాలమే ఇస్తుంది.