ఆ దేశ మాజీ అధ్యక్షుడి కాలికి ట్రాకింగ్ మెషీన్
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడికి సిత్రమైన సమస్య ఎదురైంది. అధికారం చేజారిన వేదనకు తోడుగా ఆయనకు తీవ్ర అవమానికి గురి చేసే ఆదేశాలు ఆ దేశ అత్యుత్తమ కోర్టు నుంచి జారీ అయ్యాయి.
By: Tupaki Desk | 19 July 2025 11:00 AM ISTబ్రెజిల్ మాజీ అధ్యక్షుడికి సిత్రమైన సమస్య ఎదురైంది. అధికారం చేజారిన వేదనకు తోడుగా ఆయనకు తీవ్ర అవమానికి గురి చేసే ఆదేశాలు ఆ దేశ అత్యుత్తమ కోర్టు నుంచి జారీ అయ్యాయి. ఆయన కాలి చీలమండ వద్ద నేరస్థుల కదలికల్ని అనుక్షణం పర్యవేక్షించేందుకు వీలుగా వినియోగించే ‘యాంకిల్ మానిటర్’ ధరించాల్సి వచ్చింది. దీనికి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలే కారణంగా చెప్పాలి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు సన్నిహిత స్నేహితుడిగా పేరున్న జైర్ బోల్సొనారో.. 2022లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఆ దేశంలోని వామపక్ష నేత లూయి ఇనాసియో లులా డసిల్వా గెలిచారు. అయితే.. ఈ ఎన్నిక చెల్లదని.. దాన్ని రద్దు చేసి తిరుగుబాటు చేసేందుకు కుట్ర పన్నినట్లుగా జైర్ బోల్సొనారో మీద ఆరోపణ ఉంది. 2022లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధ్యక్షుడు జైర్ బోల్సొనారో స్వల్ప వ్యత్యాసంతో ఓడారు. దీంతో ఫలితాల్ని అంగీకరించేందుకు ఆయన నో చెప్పినట్లుగా చెబుతారు.
ఈ వాదనను బలపరిచేలా.. ఆ సమయంలోనే వేలాది మంది ఆయన మద్దతుదారులు తిరుగుబాటుకు ప్లాన్ చేశారన్న ఆరోపణ ఉంది. దీనికి సంబంధించిన విచారణను ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటితో పాటు.. పార్టీ హెడ్డాఫీసు.. ఇతర పార్టీ నేతలకు చెందిన ఆస్తులు.. నివాసాలపై పోలీసులు సోదాలు నిర్వహించారు. బోల్సానారోతో పాటు.. మరో 33 మంది మీద అభియోగాలు నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా కోర్టు ఆయన విషయంలో కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. మాజీ అధ్యక్షుడు బోల్సొనారో రాత్రి వేళ ఇల్లు విడిచి వెళ్లకూడదని.. విదేశీ రాయబారులతో మాట్లాడకూడదని.. విదేశీ రాయబార కార్యాలయాల్ని సందర్శించకూడదన్న పరిమితుల్ని ఆ దేశ న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాదు.. మాజీ దేశాధ్యక్షుడు సోషల్ మీడియా ఖాతా వినియోగించకూడదని లాంటి పరిమితుల్ని ఎదుర్కొంటున్నారు.
తన విషయంలో సుప్రీం న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల్ని ఆయన అమలు చేశారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో తన కాలికి ట్రాకర్ ను అమర్చుకున్న ఆయన స్పందించారు. కోర్టు ఆదేశం తనకు జరిగిన తీవ్ర అవమానంగా ఆయన పేర్కొన్నారు. తాజా ఉదంతంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం స్పందించారు. తన మిత్రుడైన బోల్సొనారో పట్ల బ్రెజిల్ న్యాయస్థానం అన్యాయంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. జైర్ బోల్సొనారోత పాటు ఆయన కుమారుడు ఎడ్వర్డో బోల్సొనారో కూడా సుప్రీంకోర్టు విచారణను ఎదుర్కొంటున్నారు.
