Begin typing your search above and press return to search.

వైసీపీ కి భారీ షాక్.. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్ట్!

హైదరాబాద్ గండిపేటలోని రూ.1500 కోట్ల విలువైన భూ కుంభకోణం ఆరోపణలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు అయ్యారు.

By:  Tupaki Political Desk   |   5 Jun 2026 4:51 PM IST
వైసీపీ కి భారీ షాక్.. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్ట్!
X

హైదరాబాద్ గండిపేటలోని రూ.1500 కోట్ల విలువైన భూ కుంభకోణం ఆరోపణలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు అయ్యారు. నకిలీ జీవోలతో ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గండిపేట తహశీల్దార్ ఫిర్యాదుతో బ్రహ్మనాయుడుతోపాటు మరికొందరిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో ప్రయత్నించినా, ప్రతికూల తీర్పు రావడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. జైలు భయంతో ఆయన తమిళనాడులోని కాంచీపురంలో తలదాచుకోగా, సాంకేతిక ఆధారాలతో గుర్తించిన పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.

కాంచీపురంలో అరెస్టు అయిన మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ రాత్రికి ఆయనను తీసుకువచ్చి, కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ గండిపేట పరిధిలో సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో కొనుగోలు చేసేందుకు బ్రహ్మనాయుడు ప్రయత్నించారని పోలీసులు అభియోగాలు మోపారు. అయితే భూయజమానులే బ్రహ్మనాయుడిని మోసగించి ఆయన నుంచి రూ.12 కోట్లు వసూలు చేశారని కుటుంబసభ్యులు, వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

ఇక ఈ వ్యవహారంపై తహసీల్దార్ ఫిర్యాదుతో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అండర్ గ్రౌండ్‌కి వెళ్ళిపోయారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కేసు తీవ్రత దృష్ట్యా కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిందని అంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు, సైబరాబాద్ ఈవోడబ్ల్యూ బృందాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి, కాంచీపురంలో బ్రహ్మనాయుడును అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.

పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతోపాటు ఆయన బంధువు బొల్లా రమేష్, మీడియేటర్ రాధాకృష్ణ, నకిలీ పత్రాలు సృష్టించిన నిమ్మల కుటుంబ సభ్యులు నిందితుల జాబితాలో ఉన్నారు. ఇంతకుముందే నిందితుడు రాధాకృష్ణతో పాటు డ్రైవర్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నకిలీ పత్రాల తయారీ వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉంది? రెవెన్యూ అధికారుల పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో సైబరాబాద్ పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారని చెబుతున్నాు. కాగా, మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌తో ఏపీ, తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.