మిరాకిల్: 600 మైళ్లు 7గం.ల జర్నీని 40ని.లకు తగ్గించిన సముద్రగర్భ బుల్లెట్ ట్రైన్!
సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలకు సవాళ్లు విసరడం చైనాకు కొత్తేమీ కాదు. ముఖ్యంగా నిర్మాణం, రవాణా, మౌలిక వసతుల కల్పనలో ఆ దేశం వేస్తున్న అడుగులు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి.
By: Sivaji Kontham | 20 May 2026 9:41 AM ISTసాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలకు సవాళ్లు విసరడం చైనాకు కొత్తేమీ కాదు. ముఖ్యంగా నిర్మాణం, రవాణా, మౌలిక వసతుల కల్పనలో ఆ దేశం వేస్తున్న అడుగులు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. తాజాగా సముద్ర గర్భంలో గంటకు 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకెళ్లే సరికొత్త బుల్లెట్ రైలు ప్రాజెక్టును చైనా ప్రతిపాదించింది. `బోహై జలసంధి క్రాస్-సీ కారిడార్` పేరిట రూపుదిద్దుకుంటున్న ఈ ప్రతిష్టాత్మక మెగా ప్రాజెక్ట్ రెండు కీలక నగరాల మధ్య దూరాన్ని.. ప్రయాణ సమయాన్ని ఊహించని రీతిలో తగ్గించనుంది. ప్రస్తుతం పరిశీలన.. పరిశోధనల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ భవిష్యత్ రవాణా రంగంలో ఒక అద్భుతంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ మెగా ప్రాజెక్ట్ చైనాలోని షాన్‌డాంగ్ - లియానోడాంగ్ ద్వీపకల్పాలను కలుపుతూ యాంటాయ్ -డాలియన్ నగరాల మధ్య హై-స్పీడ్ అండర్ సీ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా నిర్ధేశించినది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య నేరుగా ఎలాంటి వంతెన గానీ.. సొరంగం గానీ లేదు. దీనివల్ల ప్రయాణికులు సముద్రం గుండా నౌకల (ఫెర్రీ) లో దాదాపు 7 గంటల పాటు ప్రయాణించాల్సి వస్తోంది. ఒకవేళ రోడ్డు మార్గంలో వెళ్లాలనుకుంటే సముద్రం చుట్టూ తిరిగి C-ఆకారంలో సుమారు 600 మైళ్లకు పైగా ప్రయాణించాల్సి వస్తోంది. ఈ తీవ్రమైన కాలయాపనకు ఇంధన వృధాకు చైనా ప్రతిపాదించిన సముద్ర గర్భ బుల్లెట్ రైలు శాశ్వత చెక్ పెట్టనుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే 7 గంటల ప్రయాణ సమయం కేవలం 40 నిమిషాలకు తగ్గిపోవడం ఒక నిజమైన మిరాకిల్.
ఇంతటి సుదీర్ఘమైన సముద్ర గర్భ సొరంగాన్ని నిర్మించడం వెనుక అధునాతన ఇంజనీరింగ్ ప్రణాళిక దాగి ఉంది. బ్రిటన్-ఫ్రాన్స్ మధ్య ఉన్న ప్రఖ్యాత `ఛానల్ టన్నెల్` నమూనాలోనే దీనిని కూడా డిజైన్ చేయాలని చైనీ ఇంజినీరింగ్ నిపుణులు భావిస్తున్నారు. ఇందులో రైళ్ల రాకపోకల కోసం రెండు వేర్వేరు సింగిల్-ట్రాక్ ట్యూబ్‌లను, అత్యవసర నిర్వహణ సేవల కోసం ఒక ప్రత్యేక సర్వీస్ టన్నెల్‌ను నిర్మిస్తారు. సాధారణంగా చాలా పొడవైన రోడ్డు సొరంగాలలో గాలి వెలుతురును కాపాడుతూ.. పొగ నియంత్రణ చర్యలు చేపట్టడం.. ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సహాయక చర్యలు అందించడం అత్యంత క్లిష్టమైన సమస్య. అందుకే నిపుణులు దీనిని కేవలం రైల్వే సొరంగంగానే రూపొందించనున్నారు. రోడ్డు వాహనాలను, కార్లను సైతం ప్రత్యేక రైళ్లలోనే ఎక్కించి ఈ సముద్ర గర్భ సొరంగం దాటించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
పర్యావరణ పరిరక్షణ, ఉద్గారాల నియంత్రణ పరంగా కూడా ఈ ప్రాజెక్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికుల్లో 7 శాతం, సరుకు రవాణాలో 6 శాతం రైల్వేల ద్వారానే జరుగుతున్నా.. మొత్తం రవాణా రంగ ఉద్గారాలలో దీని వాటా కేవలం 1 శాతం మాత్రమే. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ రైలు కారిడార్ అందుబాటులోకి వస్తే రోడ్లపై ట్రక్కులు, కార్ల ఒత్తిడి తగ్గి కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. అయితే సుమారు 75 మైళ్లకు పైగా సముద్ర గర్భంలో సొరంగం నిర్మించడానికి వాడే భారీ కాంక్రీట్, ఉక్కు - యంత్రాల వల్ల నిర్మాణ దశలో పర్యావరణంపై పడే కార్బన్ ప్రభావాన్ని.. నిర్మాణ వ్యయాన్ని సమతుల్యం చేయడం ప్లానర్లకు ఒక సవాలుగా మారింది.
అలాగే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రకృతి పరంగా.. అలాగే భౌగోళిక పరంగా సవాళ్లు కూడా ఎక్కువే ఉన్నాయి. ఈ రైలు మార్గం ప్రయాణించే బోహై సముద్ర గర్భంలో లోతైన లోయలు.. బలహీనమైన రాతి వలయాలు.. భూకంపాలు సంభవించే క్రియాశీల ఫాల్ట్ ఏరియాలు ఉన్నాయి. వీటిని తట్టుకుని నిలబడేలా అత్యంత సున్నితమైన సెన్సార్లు, లీక్ డిటెక్షన్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం ప్రాజెక్ట్ భద్రతకు అత్యంత కీలకం. యాంటాయ్ నగరం 2026 ప్రభుత్వ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ ప్రణాళికల పరిధిలో `రిజర్వుడ్ లేదా `డెమోన్‌స్ట్రేషన్` దశలోనే ఉంది. అమెరికాలోని కాలిఫోర్నియా బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ తరహాలోనే చైనా కూడా ఈ ఉత్తర ప్రాంత పారిశ్రామిక జోన్ల మధ్య వాణిజ్యాన్ని బలోపేతం చేయడానికి వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా రవాణాను సులభతరం చేయడానికి దీనిని ఒక ప్రతిష్టాత్మక మైలురాయి ప్రాజెక్టుగా భావిస్తోంది. చైనా నిర్మిస్తున్న ఇలాంటి భారీ ప్రాజెక్టులను భారతదేశం సహా ప్రపంచ దేశాలు సునిశితంగా పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా చైనా ఉపయోగించే అధునాతన టెక్నిక్ లు ప్రపంచాన్ని విస్మయపరుస్తున్నాయి.
