పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో అన్న రచయిత మృతి.. అనుమానాలు?
యూట్యూబర్ .. ‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
By: A.N.Kumar | 15 Feb 2026 10:36 AM ISTయూట్యూబర్ .. ‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో కారు పడిపోయిన ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోవడం, డ్రైవర్ వ్యవహారశైలి ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.
నిన్న బొగ్గుల శ్రీనివాస్ ప్రయాణిస్తున్న కారు ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం వద్ద అదుపు తప్పి నీటిలోకి దూసుకెళ్లింది. కారు వెనుక సీట్లో కూర్చున్న శ్రీనివాస్ నీట మునిగి మృతి చెందగా కారు నడుపుతున్న డ్రైవర్ మాత్రం సురక్షితంగా బయటపడటం గమనార్హం.
అనుమానాలకు కారణాలివే
కారు నీటిలో పడగానే డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారికి సమాచారం ఇవ్వకుండా లేదా సహాయం కోరకుండా ఆయన అక్కడి నుంచి పరార్ కావడం పలు సందేహాలకు దారితీస్తోంది. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న స్థానిక మత్స్యకారులు డ్రైవర్ నీటి నుంచి బయటకు వచ్చి పారిపోవడాన్ని గమనించినట్లు పోలీసులకు తెలిపారు. సాధారణంగా ప్రమాదాల్లో డ్రైవర్ సీటులో ఉన్నవారికి గాయాలయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.. కానీ ఇక్కడ డ్రైవర్ క్షేమంగా ఉండి.. వెనుక సీట్లో ఉన్న వ్యక్తి మరణించడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ బొగ్గుల శ్రీనివాస్ ప్రస్థానం
కర్నూలు జిల్లాకు చెందిన బొగ్గుల శ్రీనివాస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా, యూట్యూబర్‌గా రాజకీయ వర్గాల్లో సుపరిచితులు. ఆయన ప్రధానంగా రాజకీయ విశ్లేషణలు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేవారు. ‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అనే టైటిల్‌తో ఆయన రాసిన పుస్తకం అప్పట్లో పెను దుమారం రేపింది. జనసేన పార్టీపై, ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌పై ఆయన చేసిన విమర్శల పట్ల జనసేన కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఈ వివాదాల కారణంగా ఆయన కొంతకాలం అజ్ఞాతంలోకి కూడా వెళ్లారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసే వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అయ్యేవి.
పోలీసుల దర్యాప్తు.. రాజకీయ రంగు?
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది కేవలం ప్రమాదవశాత్తూ జరిగిన ఘటననా? లేక దీని వెనుక రాజకీయ కక్షలు ఏవైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. "డ్రైవర్ దొరికితేనే అసలు నిజాలు బయటపడతాయి. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ , శ్రీనివాస్ ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నాం." అని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
సోషల్ మీడియాలో ఈ మృతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తుండగా.. మరికొందరు విచారణ ముగిసే వరకు ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని నెటిజన్లను కోరుతున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న డ్రైవర్ పట్టుబడితే తప్ప, బొగ్గుల శ్రీనివాస్ మృతిపై నెలకొన్న నీలినీడలు తొలగే అవకాశం లేదు.
