Begin typing your search above and press return to search.

వందేళ్ళ బోయింగ్ విమానం....కుప్పకూలుతోంది !

అలా ఆయన తన కలప వ్యాపారం నుంచి బయటకు వచ్చి విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టారు. తన పేరుతోనే బోయింగ్ విమానాలను నడుపుతూ వచ్చారు.

By:  Tupaki Desk   |   15 Jun 2025 9:41 AM IST
వందేళ్ళ బోయింగ్ విమానం....కుప్పకూలుతోంది !
X

బోయింగ్ విమానం చరిత్ర చాలా సుదీర్ఘమైనది. వందేళ్లకి పైదాటింది. 1909లో యేల్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న ధనిక వర్గానికి చెందిన విలియం ఈ బోయింగ్ సీటెల్‌లోని అలాస్కా యుకాన్ -పసిఫిక్ ఎక్స్‌పోజిషన్‌లో ఒక విమానాన్ని చూసిన తర్వాత వాటి పట్ల ఆకర్షితుడయ్యారు. అలా ఆయన తన కలప వ్యాపారం నుంచి బయటకు వచ్చి విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టారు. తన పేరుతోనే బోయింగ్ విమానాలను నడుపుతూ వచ్చారు.

అలా 1919లో బోయింగ్ మోడల్ ఫ్లయింగ్ బోట్ తన మొదటి విమాన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇది ఒక పైలట్, ఇద్దరు ప్రయాణీకులతో మాత్రమే ప్రయాణించింది. ఆ తర్వాత ఎనిమిది సంవత్సరాల కాలంలో ఇది సీటెల్ నుండి బ్రిటిష్ కొలంబియాలోని విక్టోరియాకు అంతర్జాతీయ ఎయిర్ మెయిల్ విమానాలను బోయింగ్ సంస్థ నడిపింది.

ఈ క్రమంలో 1920 మే 24 బోయింగ్ మోడల్ 8 తో తన మొదటి విమాన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. ఇదన్న మాట అమెరికన్ ఏరోస్పేస్ తయారీ సంస్థ బోయింగ్ చరిత్ర. అలా 1916లో విలియం ఇ. బోయింగ్ చేత పసిఫిక్ ఏరో ప్రొడక్ట్స్ కంపెనీగా స్థాపించబడిన ఈ కంపెనీని 1934లో బోయింగ్ ఎయిర్‌ప్లేన్ కంపెనీగా పేరు మార్చారు. ఆ క్రమంలో 1961 నుండి బోయింగ్ కంపెనీగా ఉంది. ఇది సైనిక పౌర ఉపయోగం కోసంతో పాటుగా పౌర విమానాలు, జెట్‌లు, హెలికాప్టర్లు, క్షిపణులు, ఉపగ్రహాలు, విండ్ టర్బైన్‌లు సహా ఇతర ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రపంచంలో అగ్రగామిగా దూసుకుని పోయింది.

ఇప్పటిదాకా బోయింగ్ సంస్థ నుంచి 14 వేలకు పైగా విమానాలు ఉత్పత్తి చేయబడ్డాయి. మంచి ట్రాక్ రికార్డు ఉన్న సంస్థ ఇది. ఇంతింతై అన్నట్లుగా అనేక సాంకేతిక విప్లవాలను కూడా తన ఉత్పత్తులలో చూపిస్తూ కాలానికి తగినట్లుగా కొత్త విమానాలను తయారు చేస్తూ వచ్చింది.

అలా 2005లో 777-200ళృ వరల్డ్‌లైనర్ ని తీసుకుని వచ్చింది. ఇది ఇతర వాణిజ్య విమానాల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగినదిగా ఉంది. 777-200 అత్యంత పొడవైన నాన్-స్టాప్ విమానంగా ప్రపంచ రికార్డును నెలకొల్పింది. అంతర్జాతీయ సేవలలో భాగంగా తరువాత కాలంలో ఇదే సంస్థ డ్రీమ్ లైనర్ పేరుతో కొత్త సిరీస్ ని స్టార్ట్ చేసింది. వీటిని సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు ఎక్కువ ఇష్టపడతారు.

అత్యంత సౌకర్యాలతో కూడిన డ్రీమ్ లైనర్ విమానాలు బోయింగ్ సంస్థకు మంచి పేరు తెచ్చాయి. అయితే ఈ సిరీస్ ల తయారీలో కొన్ని లోపాలతో కూడిన విమానాలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు విమర్శలు గడచిన దశాబ్ద కాలంలో వినిపిస్తూ వచ్చింది. 787-8 డ్రీమ్ లైనర్ మీద ఎన్నో విమర్శలు ఆరోపణలు వచ్చాయి.

ఆ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి జాన్ బార్నెట్ అయితే 2019 ప్రాంతంలో 787-8 డ్రీమ్ లైనర్ బోయింగ్ విమానాల మీద తీవ్ర విమర్శలే చేశారు. ఆయన బీబీసీతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బోయింగ్ సంస్థ లోపాలను విడమరచి చెప్పారు. బోయింగ్ ఫ్యాక్టరీలో సరిగ్గా లేని లోపభూయిష్టమైన భాగాలను ఉద్దేశ్యపూర్వకంగాన అమర్చారు అని ఆయన ఆరోపించారు. అంతే కాదు ఆక్సిజన్ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని చెప్పారు.

అత్యవసర సమయాల్లో ప్రతీ నాలుగు ఆక్సిజన్ మాస్కులలో ఒకటి పనిచేయడం లేదని ఆయన కనుగొన్నారు. ఈ తరహా సీరిస్ విమానాల తయారీలో భద్రత విషయంలో రాజీపడుతున్నారని ఆయన కీలక విషయాలను వెల్లడించారు.

ఇలా సంచలన ఆరోపణలు చేసిన జాన్ బార్నెట్ 2004 మార్చి 9న అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం జరిగింది. బోయింగ్ విమానాల విషయంలో తనకు తెలిసిన సమాచారాన్ని ఆయన విజిల్ బ్లోయర్ కేసులో సాక్ష్యం చెప్పడానికి సమాయత్తం అవుతున్న క్రమంలో ఈ మరణం సంభవించడం విశేషం.

ఇదిలా ఉంటే ఆయన లోపాలు ఉన్నట్లుగా ఆరోపించిన క్రమంలో ఇపుడు అహ్మదాబాద్ లో కుప్పకూలిన 787-8 బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం గురించి అంతా చర్చిస్తున్నారు. ఆనాడు ఆయన బీబీసీకి ఇచ్చిన ఇంటర్వూ గురించి ఇపుడు అంతా ఆలోచిస్తున్నారు. ఇలా బోయింగ్ విమానాల విషయంలో గతంలో వచ్చిన ఆరోపణలు హాట్ డిస్కషన్ గా మారాయి. ఒక వందేళ్ళ సంస్థ. ఎంతో ప్రఖ్యాతి చెందిన సంస్థ. ఈ మధ్య కాలంలో ఎందుకు ఇలా జరుగుతోంది అన్నదే అంతా చర్చిస్తున్న విషయం. ఏది ఏమైనా విమానాల తయారీలో భద్రతా లోపాలు ఉంటే వాటిని పూర్తిగా పరిష్కరించుకోవాల్సి ఉంది అని అంటున్నారు.