11 నిమిషాలపాటు పైకి వెళ్లి వచ్చారు.. స్పెషల్ ఏమిటంటే..?
జెఫ్ బెజోస్ రోదసిలో ఓ వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా... మహిళా సెలబ్రెటీల టీమ్ తో అంతరిక్ష యాత్ర నిర్వహించారు.
By: Tupaki Desk | 15 April 2025 9:01 AM ISTఇటీవల కాలంలో అమెరికాకు చెందిన వ్యాపార దిగ్గజం జెఫ్ బెజోస్ సంస్థ బ్లూ ఆరిజిన్ వరుస రోదసి యాత్రలు చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ 10 అంతరిక్ష యాత్రలు చేపట్టగా.. 11వ యాత్రను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా... మహిళా సెలబ్రెటీల బృందంతో ఈ అంతరిక్ష యాత్రను ప్లాన్ చేసింది.. ఈ యాత్ర మొత్తం 11 నిమిషాల పాటు సాగింది.
అవును... జెఫ్ బెజోస్ రోదసిలో ఓ వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా... మహిళా సెలబ్రెటీల టీమ్ తో అంతరిక్ష యాత్ర నిర్వహించారు. న్యూ షెపర్డ్ వ్యోమనౌక ద్వారా ఈ యాత్ర సాగగా.. పశ్చిమ టెక్సాస్ నుంచి ఇది ప్రారంభమైంది. ఈ క్రమంలో నింగిలో 107 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో పర్యాటకులంతా కొన్ని నిమిషాలపాటు బారరహిత స్థితిని ఆస్వాదించారు.
11 నిమిషాల పాటు సాగిన ఈ యాత్రలో ఆరుగురు మహిళలు పాల్గొన్నారు. వారిలో జెఫ్ బెజోస్ కు కాబోయే సతీమణి లారెన్ శాంచెజ్ తో పాటు అమెరికన్ గాయని కెథీ పెర్రీ, చిత్ర నిర్మాత కెరియాన్ ఫ్లీన్, ప్రముఖ జర్నలిస్ట్ గేల్ కింగ్, నాసాలో ఇంజినీర్ గా పనిచేసి అనంతరం సొంత సైన్స్ విద్యను ప్రోత్సహించడానికి సొంత కంపెనీ ప్రారంభించిన ఐషా బోవ్, గ్రహాలపై పరిశోధనలు చేసిన అమండా ఎంగుయెన్ ఉన్నారు.
కాగా... అమెరికాకు సంబంధించి పూర్తిగా మహిళలతోనే అంతరిక్ష యాత్రను నిర్వహించడం ఇదే తొలిసారి కాగా.. 1963లో సోవియట్ వ్యోమగామి వాలెంటీనా తెరిష్కోవా ఒక్కరే రోదసిలోకి వెళ్లి వచ్చారు. మరోపక్క ఈ యాత్రలో పాల్గొన్న లారెన్ శాంచెజ్ తో బ్లూ ఆరిజన్ సంస్థ యజమాని జెఫ్ బెజోస్ తో మరో రెండు నెలల్లో వివాహం జరగనుంది.