Begin typing your search above and press return to search.

బీజేపీ హంగూ ఆర్భాటం అంతా హంగ్ కోసమా..?

బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ అయితే తెలంగాణాలో హంగ్ వస్తుందని అంటున్నారు. పై పెచ్చు అధికారం మనదే అంటున్నారు.

By:  Tupaki Desk   |   6 Oct 2023 11:30 PM GMT
బీజేపీ హంగూ ఆర్భాటం అంతా హంగ్ కోసమా..?
X

కింగ్ మేకర్ కింగ్ ఈ పదాలు రాజకీయాల్లో చాలా చిత్రంగా తమాషాగా వినిపిస్తాయి. దేశంలో సంకీర్ణ రాజకీయాల యుగం 1989 తరువాత స్టార్ట్ అయింది. అది చాలా కాలం కొనసాగింది. ఇప్పటికీ కొన్ని చోట్ల హంగ్ అసెంబ్లీలు వస్తున్నాయి. కేంద్రంలో అయితే గత పదేళ్ళుగా ఫుల్ మెజరిటీతో ప్రభుత్వం వచ్చింది.

ఇంతకీ హంగ్ ఎందుకు అంటే ఒక్క సీటు ఉన్న వారూ ఓవర్ నైట్ లో కింగ్ మేకర్ అయిపోవడానికే అన్నది తెలిసిందే. బీజేపీకి కేంద్రంలో ఫుల్ మెజారిటీ కావాలి. కానీ తెలంగాణాలో హంగ్ రాలని ఉందని అంటున్నారు. బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ అయితే తెలంగాణాలో హంగ్ వస్తుందని అంటున్నారు. పై పెచ్చు అధికారం మనదే అంటున్నారు. అంతా ఎన్నికల యుద్ధంలోకి దిగాలని సూచించారు.

తెలంగాణా బీజేపీ నేతలతో ఆయన మాట్లాడుతూ ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన బల్ల గుద్దుతున్నారు. ఏ సర్వే చూసినా బీజేపీకి డబుల్ డిజిట్ నంబర్ సీట్లు ఇవ్వడం లేదు. తెలంగాణాలో అధికారంలోకి రావాలంటే అరవై సీట్లు రావాలి.

మరి బీజేపీకి ఇంత ధైర్యం ఎలా వస్తోంది. అధికారం మనదే అని ఎలా చెబుతోంది అన్నదే చర్చగా ఉంది. కర్నాటకలో మధ్యప్రదేశ్ లో మహారాష్ట్రలో చేసినట్లుగా తెలంగాణాలో బీజేపీ చేస్తుందా అన్న సందేహాలు వస్తున్నాయి. అయితే పైన చెప్పిన రాష్ట్రాలలో బీజేపీ అధికారానికి చాలా దగ్గరగా వచ్చింది. మెజారిటీని కొద్దిలో మిస్ అయింది. కాబట్టి మిగిలిన పార్టీల నుంచి కొంతమందిని రప్పించుకుని సర్దుకుని మరీ ప్రభుత్వాలని ఏర్పాటు చేసింది.

మరి తెలంగాణాలో ఎలా సాధ్యం అన్నదే ప్రశ్న. ఇక్కడ బీయారెస్ గట్తిగా ఉంది. కాంగ్రెస్ ఢీ కొడుతోంది. ఒకవేళ సంతోష్ అన్నట్లుగానే హంగ్ అంటూ వస్తే మెజారిటీకి ఆ రెండు పార్టీలే కాస్తా దగ్గరగా వచ్చి ఆగిపోతాయి. అపుడు బీయారెస్ ఆపరేషన్ స్టార్ట్ చేయవచ్చు. లేదా కాంగ్రెస్ నుంచి అయినా ఆహ్వానాలు ఇతర పార్టీలకు రావచ్చు. అంతే తప్ప బీజేపీకి ఎలా చాన్స్ వస్తుంది అన్నది కీలక ప్రశ్న.

మరో వైపు చూస్తే హంగ్ వస్తే అయిదారు సీట్లు తక్కువ పడితే ఎటూ మజ్లీస్ బీయారెస్ కి అండగా ఉంటుందని కూడా అంటున్నారు. ఒకవేళ మజ్లీస్ మనసు మార్చుకుంటే కాంగ్రెస్ కి చాన్స్ ఉంటుంది. మరి సింగిల్ డిజిట్ లో సీట్లు తెచ్చుకునే బీజేపీకి ఈ పొలిటికల్ గేం లో హంగ్ లో ఆర్భాటం చేసే అవకాశం ఎలా వస్తుంది అన్నదే చర్చ.

అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటుంది కాబట్టి సామదాన భేద దండోపాయాలు ఏమైనా రచించి మొత్తం కధను అడ్డంగా నిలువుగా తిప్పుతారేమో అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. మొత్తం మీద చూస్తే కాషాయం పార్టీ వారు మెజారిటీ గురించి మాట్లాడడం లేదు హంగ్ అంటున్నారు.

కాబట్టి కాంగ్రెస్ అయినా బీయారెస్ అయినా అభ్యర్ధుల ఎంపిక నుంచే జాగ్రత్త పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. బీజేపీ హంగ్ కింగ్ కింగ్ మేకర్ కలలు ఎలా సాకారం అవుతాయో మరో మూడు నెలలు ఆగితే అంతా తెలుస్తుంది అని కూడా అంటున్నారు.