Begin typing your search above and press return to search.

ముక్క లేకుండా ముద్ద దిగదా? ముందు మీ బ్లడ్ గ్రూప్ ఏంటి?

అయితే.. తాజాగా వెలుగు చూసిన పరిశోధనల్లో కొత్త విషయం తెర మీదకు వచ్చింది. బ్లడ్ గ్రూప్ నకు తగ్గట్లు మటన్..చికెన్ ను ఎంపిక చేసుకొని తినాలని చెప్పటం ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   30 March 2024 7:30 AM GMT
ముక్క లేకుండా ముద్ద దిగదా? ముందు మీ బ్లడ్ గ్రూప్ ఏంటి?
X

మారుతున్న కాలానికి తగ్గట్లు కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. ముక్క తినే విషయంలో నాన్ వెజ్ ప్రియులు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముక్క లేనిదే ముద్ద దిగటం లేదంటూ వారు తరచూ గోల పెట్టేస్తుంటారు. వారానికి ఒక్క రోజు నుంచి రెండు రోజులకు ఒకసారి ముక్క తినాలన్నట్లుగా ఈ మధ్యన ట్రెండ్ నడుస్తోంది. వీలైనన్ని రోజులు ముక్క తినే ఛాన్సును మిస్ కావొద్దన్నట్లుగా నాన్ వెజ్ ప్రియుల తీరు తతతత.

అయితే.. తాజాగా వెలుగు చూసిన పరిశోధనల్లో కొత్త విషయం తెర మీదకు వచ్చింది. బ్లడ్ గ్రూప్ నకు తగ్గట్లు మటన్..చికెన్ ను ఎంపిక చేసుకొని తినాలని చెప్పటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ఫలానా బ్లడ్ గ్రూప్ అయితే నాన్ వెజ్ అస్సలు తినొద్దంటూ వార్నింగ్ ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు చికెన్.. మటన్ లాంటివి తినొచ్చు? ఏ బ్లడ్ గ్రూప్ వారు తినకూడదన్న అంశంలోకి వెళితే..

ఇంతకూ బ్లడ్ గ్రూప్ నకు.. నాన్ వెజ్ కు లింకేమిటన్న విషయంలోకి వెళితే.. కొన్ని బ్లడ్ గ్రూప్ ల వారికి నాన్ వెజ్ సులువుగా జీర్ణమైతే.. మరికొన్ని గ్రూపుల వారికి సులువుగా జీర్ణం కాదు. ఇంతకీ మన బ్లడ్ గ్రూపుల విషయానికి వస్తే ఏ మనిషి అయినా ఓ.. ఏ.. బీ.. ఏబీ గ్రూపులకు చెందిన వాళ్లు ఉంటారు. ఇందులోనూ నెగిటివ్.. పాజిటివ్ అన్న విభాగాలు ఉండటం తెలిసిందే. బ్లడ్ గ్రూప్ నకు అనుగుణంగా నాన్ వెజ్ జీర్ణమయ్యే అంశం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

గ్రూపుల వారీగా ఈ లెక్కను చూస్తే.. తొలుత..

'ఏ' గ్రూప్

'ఏ' బ్లడ్ గ్రూప్ వారిలో రోగనిరోధక శక్తి చాలా సున్నితంగా ఉంటుంది. వారు ఫుడ్ పై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ గ్రూప్ వారికి శాఖాహారం అనువుగా ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారు నాన్ వెజ్ ను సులువుగా జీర్ణం చేసుకోలేరు. వీరంతా నాన్ వెజ్ ను తక్కువగా తినటం మంచిది. ఒకవేళ సీఫుడ్ తినాలంటే మాత్రం అందులో వీలైనన్ని పప్పులు కలిసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అయితేనే తేలికగా జీర్ణమయ్యే వీలుంది.

'బీ' గ్రూప్

ఈ గ్రూప్ వారికి రోగనిరోధక శక్తి ఎక్కువని చెబుతున్నారు. చికెన్.. మటన్ లాంటి ఏ నాన్ వెజ్ అయినా హాయిగా తినొచ్చు. అయితే.. వీరు తీసుకునే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు.. పండ్లు.. చేపలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

'ఏబీ'.. 'ఓ' గ్రూప్

మిగిలిన గ్రూప్ వారితో పోలిస్తే వీరు చాలా లక్కీ. ప్రత్యేకంగా పరిమితులు లేనప్పటికీ మటన్.. చికెన్ తినటంలో సమతుల్యత పాటిస్తే చాలు. ఆకుకూరలు.. సీఫుడ్ తినొచ్చు. కాస్తంత సంయమనం పాటిస్తే చాలు. అయినప్పటికీ జీర్ణ సమస్యలు ఎదురైతే మాత్రం వైద్యుల్ని కలవటం మంచిది. అయితే..బ్లడ్ గ్రూపుల వారిగా నాన్ వెజ్ తినాలా? వద్దా? అన్న అంశం మీద అవగాహన తప్పించే.. ఇదే పక్కా అని మాత్రం ఫీల్ కావొద్దు. కొందరు వైద్యులు చెప్పిన అంశాల్ని ఇక్కడ ప్రస్తావించటం జరిగింది. ఎవరికి వారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని వైద్యులను సంప్రదించటం ద్వారానే తగిన నిర్ణయాన్ని తీసుకోగలరన్న కీలక పాయింట్ను మిస్ కావొద్దు.