Begin typing your search above and press return to search.

హాస్పటల్ ఎం.ఆర్‌.ఐ ల్యాబ్‌ లో ఆయుధాలు... గ్యాప్ ఇవ్వకున్న ఐడీఎఫ్!

తమదేశ ప్రజలను ఊచకోత కోసిన హమాస్‌ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం గాజాపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Nov 2023 5:30 PM GMT
హాస్పటల్  ఎం.ఆర్‌.ఐ ల్యాబ్‌  లో ఆయుధాలు... గ్యాప్  ఇవ్వకున్న ఐడీఎఫ్!
X

తమదేశ ప్రజలను ఊచకోత కోసిన హమాస్‌ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం గాజాపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇకపై పాలస్థీనాలో హమాస్ అనే శబ్ధం వినిపించకూడదనేది తమ లక్ష్యం అని ఇజ్రాయేల్ ప్రధాని ఇప్పటికే ప్రకటించారు. పైగా తాము యుద్ధం చేస్తున్నది మానవమృగాలతో కావడం వల్ల తమ సైన్యం తీసుకునే నిర్ణయాలు, చేపట్టే చర్యలూ అదేస్థాయిలో ఉంటాయని హెచ్చరించారు. ఈ సమయంలో ఇజ్రాయేల్ సైన్యం టార్గేట్ మార్చింది.

అవును... గతకొన్ని రోజులుగా గాజాను గజగజ లాడిస్తున్న ఇజ్రాయేల్ సైన్యం... భూతల, వైమానిక దాడులతో చెలరేగిపోతుంది. ఈ క్రమంలో ఉత్తర గాజాను ఆల్ మోస్ట్ క్లీన్ చేసేసిందని అంటున్నారు! ఈ క్రమంలో హమాస్ ఉగ్రవాదులు దక్షిణగాజాలోని హాస్పటల్స్ లో తలదాచుకుంటున్నారని అనుమానిస్తున్నారు. దీంతో గాజా స్ట్రిప్‌ లో అతిపెద్దదైన అల్‌ షిఫా ఆసుపత్రిలో ఇజ్రాయెల్‌ సైన్యం తనిఖీలు రెండో రోజు కూడా కొనసాగాయి.

ఈ హాస్పిటల్‌ ప్రాంగణంలో ఓ భవనంలోని ఎం.ఆర్‌.ఐ స్కానింగ్ ల్యాబ్‌ లో హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ పెద్ద ఎత్తున ఆయుధాలు నిల్వ చేసిందంటూ దానికి సంబంధిత వీడియోను తాజాగా ఇజ్రయేల్ సైన్యం విడుదల చేసింది. వీటిలో అసాల్ట్‌ రైఫిల్స్, గ్రెనేడ్స్, హమాస్‌ మిలిటెంట్ల యూనిఫాం దుస్తులు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. దీంతో... అల్‌ షిఫా ఆసుపత్రి చుట్టూ ఇజ్రాయెల్‌ యుద్ధ ట్యాంకులు మోహరించాయి.

ఈ పరిస్థితులతో అల్‌ షిఫా ఆసుపత్రిలో నీరు, విద్యుత్తు, ఔషధాల సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో గాజాలో మళ్లీ కమ్యూనికేషన్ల వ్యవస్థ స్తంభించింది. ఈ సమయంలో ఇజ్రాయేల్ సైన్యం దక్షిణ గాజాపై దృష్టి పెట్టిందని తెలుస్తుంది. ఈ సమయంలో హమాస్ మిలిటెంట్లు ఉత్తర గాజా నుంచి దక్షిణానికి తరలి తలదాచుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తుంది.

మరోవైపు హమాస్‌ కీలక నేత ఇస్మాయిల్‌ హనియా ఇంటిని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ధ్వంసం చేసింది. ఇందులో భాగంగా అతడి నివాసంపై యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయె ల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. గురువారం జరిపిన దాడుల్లో హనియా నివాసం, హమాస్‌ నౌకా దళానికి చెందిన వివిధ ఆయుధాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది.

ఐరాస భద్రతా మండలిలో తీర్మానం ఆమోదం:

ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం ఎట్టకేలకు ఆమోదం పొందింది. ఇజ్రాయెల్‌ సైన్యం చేస్తున్న దాడుల వల్ల గాజాలో సామాన్య ప్రజానికం తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారని ఐరాస భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా దాడులకు విరామం ఇవ్వాలని ఇజ్రాయెల్‌ కు సూచిస్తూ.. బందీలను వెంటనే విడుదల చేయాలని హమాస్‌ కు విజ్ఞప్తి చేశాయి.

కాగా... ఐరాస భద్రతా మండలిలో 15 సభ్యదేశాలుండగా... ఈ తీర్మానానికి మద్దతుగా 12 దేశాలు ఓటు వేశాయి. అమెరికా, యూకే, రష్యాలు గైర్హాజరయ్యాయి!