Begin typing your search above and press return to search.

ఉద్యోగాల కోతలో ఏఐ పాత్ర ఎంత..? కంపెనీల మాయాజాలం

తాను తప్పు చేసి దాన్ని ఎదుటి వారిపైకి నెట్టడం మనిషి నిత్యం చేసే పనుల్లో ఒకటే.. ఇలా అయితేనే రోజు ముందుకు వెళ్తుంది.

By:  Tupaki Political Desk   |   5 Nov 2025 12:22 PM IST
ఉద్యోగాల కోతలో ఏఐ పాత్ర ఎంత..? కంపెనీల మాయాజాలం
X

తాను తప్పు చేసి దాన్ని ఎదుటి వారిపైకి నెట్టడం మనిషి నిత్యం చేసే పనుల్లో ఒకటే.. ఇలా అయితేనే రోజు ముందుకు వెళ్తుంది. ఇది సాధారణ వ్యక్తి నుంచి పెద్ద పెద్ద వాణిజ్య ప్రపంచాలు ఏర్పాటు చేసిన వ్యక్తులకైనా ఉండేదే. ఒక్కోసారి మనం తీసుకున్న నిర్ణయాలు మంచికి ఉపయోగపడితే మరోసారి చెడు వైపునకు తీసుకెళ్తాయి. మంచి గుర్తింపును తెస్తే.. చెడు అనుభవాన్ని తెస్తుంది. కంపెనీలు ఎదగాలని వందలాది మందిని ఉద్యోగాలుగా నియమించుకున్న యాజమాన్యం. నేడు ఆ కంపెనీల భవిష్యత్ కోసం తొలగింపులు చేపట్టక తప్పలేదు. దాన్ని యాజమాన్యంపై వేసుకునే దాని కంటే ‘ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలీజెంట్)పై వేస్తే తమ చేతులకు మట్టి అంటదని భావిస్తున్నారు. అదే విధంగా చేస్తున్నారు కూడా.

ప్రపంచ వ్యాప్తంగా ఒకే నినాదం వినిపిస్తోంది. ‘ఏఐ ఉద్యోగాలను తినేస్తోంది.’ కానీ ఈ నినాదం వెనుక నిజం ఎంత ఉందో ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇటీవల అమెజాన్‌, గూగుల్‌ నుంచి డిస్నీ, వాల్‌మార్ట్‌ వరకు పెద్ద పెద్ద కంపెనీలు భారీగా లేఆఫ్స్ ప్రకటించాయి. అన్ని చోట్లా కారణం ఒక్కటే ‘ఏఐ ఆటోమేషన్‌.’ కానీ వాస్తవానికి ఇది సాంకేతిక విప్లవం పేరు చెప్పుకొని జరుగుతున్న ఆర్థిక పునర్వ్యవస్థీకరణ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు.

ఏఐ ఒక కారణం కాదు..

ఏఐ అభివృద్ధి కారణంగా ఉద్యోగాల స్వరూపం మారుతుందని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. కానీ జరుగుతున్నది వేరేలా ఉంది. అనేక సంస్థలు ఖర్చును తగ్గించుకునే పదే పదే చర్యలు తీసుకుంటున్నాయి. అందులో బాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్నారు. కానీ దీనిని ఏఐ పేరుతో సమర్థించుకుంటున్నాయి. అనలిస్టులు చెబుతున్నట్లుగా, ‘ఇన్వెస్టర్ల ఒత్తిడి, వృద్ధి మందగించడం, ఆదాయ నష్టాలు ఇవన్నీ అసలు కారణాలు. కానీ ప్రజల ముందు ఏఐని పెట్టడం సులభం.’

MITకు చెందిన ఓ లేబర్‌ ఎకనామిస్ట్‌ మాట్లాడుతూ.. ‘ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన సంఖ్య, ఏఐ వాడుక స్థాయికి సరిపోలడం లేదు.

కంపెనీలు తమ ఆర్థిక నిర్ణయాలను సవరించుకునేందుకు ఏఐని కవచంగా వాడుతున్నాయి’ అన్నారు.

‘ఆటోమేషన్‌’ పేరుతో నిర్ణయాలు

నిజానికి ఏఐ పరికరాలు ఇప్పటి వరకు కొన్ని రంగాల్లో మాత్రమే సమర్థతను పెంచాయి. కానీ వేలాది మంది ఉద్యోగాలను ఒకే సారి భర్తీ చేసే స్థాయికి ఇంకా చేరలేదు. చాలా సందర్భాల్లో ఉద్యోగులు తొలగించబడిన తర్వాత వారి పని ఏఐ కాదు.. తక్కువ వేతనం తీసుకునే వారు, లేదా మరో వ్యక్తి చేసే పనిలో కలపడం చేస్తున్నారు.

టెక్‌ విశ్లేషకురాలు ప్రియా షా చెప్పినట్లుగా ‘ఉద్యోగాలను తీసేది ఏఐ కాదు, మేనేజ్‌మెంట్‌ నిర్ణయాలే.’ అంటే యంత్రాలు కాదు మనుషుల లోభం, వ్యాపారతత్వం నిజమైన కారణం.’ అన్నారు.

ఆయుధంగా మార్చుకున్న కంపెనీలు

‘ఏఐ ఉద్యోగాలను కబలిస్తోంది’ అనే భయం కంపెనీలకు అనుకూలంగా మారింది. ఇప్పుడు వారు ఉద్యోగాలను తగ్గించినా పెద్దగా వ్యతిరేకత ఉండదు. ఎందుకంటే ఇది ‘సాంకేతిక ప్రగతి’ పేరుతో జరిగిపోతుంది.

ఈ విధంగా లాభాల కోసం తీసుకున్న కఠిన నిర్ణయాలు ‘ఇన్నోవేషన్‌’గా కనిపిస్తున్నాయి. అందుకే కంపెనీలు ఈ భయాన్ని మార్కెటింగ్‌ టూల్‌గా వాడుకుంటున్నాయి.

కేవలం పని తీరును మారుస్తోంది..

ఏఐ మన పనితీరును మారుస్తోంది ఇది నిజం. కానీ అది ఉద్యోగాల తొలగింపునకు సమానమైనది కాదు.. ఆ స్థాయికి ఇంకా రాలేదు. ఇది కొత్త విధానాల ఆవిష్కరణకు.. సాంకేతిక అప్‌డేట్‌లకు వేదిక మాత్రమే. కానీ దానిని వాడే విధానమే అదే అసలు ప్రశ్న. ఏఐని మానవ సంక్షేమానికి వాడతామా.. లేక లాభాల కోసం మానవ వినాశనానికి వాడతామా అన్నదే భవిష్యత్తు నిర్ణయిస్తుంది.

దోషిగా చూపడం సులభం..

వ్యాపార, వాణిజ్య రంగాల్లో నిర్ణయాలు, కంపెనీల భవిష్యత్ కోసం యాజమాన్యం తీసుకునే నిర్ణయాలను కప్పిపుచ్చుకునేందుకు ఏఐని దోషిగా చూపిస్తున్నారు. ఇక్కడ అసలు దోషి మానవుడే. యంత్రాలు పని చేస్తాయి, కానీ నిర్ణయాలు మాత్రం మనమే తీసుకుంటాం. హ్యుమనాయిడ్ రోబోలు సొంత నిర్ణయాలు తీసుకుంటాయని ప్రయోగాల్లో తెలిశాయి. కానీ అవి ఏ మేరకు అన్నది మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు.