ఏపీకి బ్లాక్ డే : ఆర్టికల్ 100 ప్రకారం విభజన జరగలేదా ?
ఇక ఫిబ్రవరి 18ని బ్లాక్ డే గా ఆయన అభివర్ణిస్తున్నారు. సరిగ్గా ఇదే రోజు 2014న లోక్ సభలో ఉమ్మడి ఏపీని రెండుగా విడగొడుతూ బిల్లుని ఆమోదించారని ఆయన గుర్తు చేశారు.
By: Satya P | 18 Feb 2026 11:11 PM ISTరాష్ట్రాలు అయినా దేశాలు అయినా విడిపోవచ్చు. కలసి ఉండమని కోరే హక్కు ఎవరికీ లేదు, ప్రజాస్వామ్యంలో అసలు లేదు, అంతా ఐక్యంగా ఉండాలని అనుకుంటే ఆ తీరు వేరు. అలా కాదు, మేము విడిపోతామని అన్యాయం జరుగుతోంది అంటే తప్పనిసరిగా ఆ ప్రకారం చేయాల్సిందే. అయితే ఏది చేయాలన్నా విధి విధానాలు ఉంటాయి. పార్లమెంటరీ పద్ధతులు ఉంటాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ అనేక చట్టాలను గత ఎనభై ఏళ్ళలో చేసింది. అంతే కాదు ఎన్నో కీలకమైన నిర్ణయాలు అత్యున్నత చట్ట సభల వేదికగా తీసుకున్నారు. అయితే దీని మీద వివాదాలు అయితే రాజ్యాంగపరంగా ఏర్పడలేదు. కానీ ఉమ్మడి ఏపీ విభజన సందర్భంగా మాత్రం అడ్డగోలుగా చేశారు ఈ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 100 ని పక్కన పెట్టారు అని తీవ్ర ఆరోపణలు వినిపించాయి. దాని మీద మాజీ ఎంపీ స్వతహాగా న్యాయవాది అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ రోజుకీ సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. ఉమ్మడి ఏపీ విభజన జరిగిన విధానం తప్పు అని ఆయన వాదిస్తున్నారు.
బ్లాక్ డే నా :
ఇక ఫిబ్రవరి 18ని బ్లాక్ డే గా ఆయన అభివర్ణిస్తున్నారు. సరిగ్గా ఇదే రోజు 2014న లోక్ సభలో ఉమ్మడి ఏపీని రెండుగా విడగొడుతూ బిల్లుని ఆమోదించారని ఆయన గుర్తు చేశారు. అయితే ఆ రోజు జరిగిన పార్లమెంటరీ వ్యవహారాలు కానీ తీర్మానం మీద ఓటింగ్ తీసుకోకుండా అందరినీ బయటకు పంపించి ఆమోదించిన విధానం కానీ పార్లమెంటరీ వ్యవస్థకే మాయని మచ్చ అని ఆయన అంటున్నారు మార్షల్స్ ని పెట్టించి విభజనను వ్యతిరేకిస్తున్న వారు అందరినీ బయటకు పంపించేసి తలుపులు మూసేసి టీవీలు ఆపేసి విభజన బిల్లు ఆమోదించారు అని ప్రెస్ మీట్ లో ఉండవల్లి మరోసారి చెప్పారు. ఎక్కడా ఒక రాష్ట్రాన్ని విభజించినపుడు ఈ విధంగా నిబంధనలను కాలరాసిన తీరు లేదని ఆయన మండిపడ్డారు. దీని మీద తాను 2016లో సుప్రీంకోర్టులో కేసు వేశాను అని ఈ రోజుకీ ఆ కేసు విషయంలో తాను న్యాయ పోరాటం చేస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.
ఆర్టికల్ 100 అంటే :
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 100 ఎంతో కీలకమైనది. ఓటింగ్ విధానాలు, కోరం అవసరాలు ఖాళీలు ఉన్నప్పటికీ పార్లమెంటు సభలు వ్యవహరించే అధికారం గురించి ఈ ఆర్టికల్ విస్పష్టంగా వివరిస్తుంది. ఇక ఓటింగ్ నిర్ణయం తీసుకోవడం వంటివి ఆర్టికల్ 100(1)) ప్రకారం ఉంటాయి. అంటే సభలో లేదా ఉభయ సమావేశాలలో నిర్ణయాలు హాజరై ఓటు వేసే మెజారిటీ సభ్యులను లెక్కించి మరీ వారి ఒపీనియన్ ని తీసుకుంటారు. ఒకవేళ సమానంగా ఓట్లు వచ్చి టై అయిన సందర్భంలో మాత్రమే ప్రిసైడింగ్ అధికారి ఓటు వేస్తారు. అదే విధంగా ఆర్టికల్ 100(2) అంటే సభలో ఖాళీలు ఉన్నప్పటికీ లేదా అనధికార వ్యక్తి పాల్గొన్నప్పటికీ ఉభయ సభలలోని ప్రొసీడింగ్స్ చెల్లుబాటు అవుతాయి అని చెబుతుంది. ఆర్టికల్ 100(3) అలాగే 100(4)) సమావేశానికి మొత్తం సభ్యులలో కనీసం పదో వంతు సభ్యులు ఉండాలి అని స్పష్టం చేస్తుంది. దీనినే కోరం అని అంటారు. అలా కోరం పూర్తి కాకపోతే ప్రిసైడింగ్ అధికారి సమావేశాన్ని వాయిదా వేయాలి లేదా నిలిపివేయాలి అని ఈ అధికరణం చెబుతోంది.
ఏ వివరాలు లేవంటూ :
అయితే లోక్ సభలో విభజన బిల్లు ప్రవేశపెట్టినపుడు ఎంత మంది సభ్యులు ఉన్నారు, కోరం ఉందా అన్నది చూడలేదని ఉండవల్లి అంటున్నారు. అంతే కాదు సభలో మెజారిటీ ఎంత మంది బిల్లుకు సమర్ధించారు అన్నది కూడా వివరాలు లేవని చెబుతున్నారు. ఈ విధంగా ఏమీ లేకుండా బిల్లుని ఆమోదించారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విధంగా అన్యాయంగా జరిగిన విభజన మీద తాను పోరాడుతున్నాను అని ఏపీ ప్రభుత్వం కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయి తమ వాదనలు మరింత సమర్ధంగా వినిపిస్తే ఏపీకి జరిగిన అన్యాయం ఇక మీదట ఎక్కడా ఎపుడూ జరగకుండా ఉంటుంది అన్నదే తన ఆలోచన అని ఆయన అంటున్నారు. అంతే కాదు విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కానీ ఇతరత్రా చట్టపరమైనవి కానీ ఈ రోజుకీ దక్కలేదని అది బాధాకరమని ఈ విషయంలో కూడా ప్రభుత్వం తరఫున న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నారు.
