పాక్ విషయంలో భారత్ కు బలోచిస్తాన్ కీలక సూచన!
ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 May 2025 12:00 PM ISTఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) స్పందించింది. ఈ సందర్భంగా భారత్ కు కీలక సూచన చేసింది. తాజా నిర్ణయం వెనుక పాక్ ఉద్దేశం ఇదేనని వెల్లడించింది!
అవును... భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణ కుదిరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన బీఏల్ఏ.. పాకిస్థాన్ ఊసరవెల్లి అని, దాని మాటలు నమ్మొద్దని.. పాక్ వినిపించే శాంతి, సోదరభావం, కాల్పుల విరమణ వంటి ప్రవచానాలన్నీ కేవలం మోసాలని.. అవి యుద్ధ వ్యూహాలని.. పాకిస్థాన్ తో అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.
ఇదే సమయంలో విదేశీ మద్దతు ఉన్న సంస్థగా, పోరాటంగా చూస్తూ వారిపై వస్తోన్న విమర్శలపైనా బీఏల్ఏ స్పందించింది. ఇందులో భాగంగా.. తాము కీలుబొమ్మలం కాదని, రిమోట్ తో తమను ఆడించలేరని.. ఈ ప్రాంతానికి సంబంధించి అన్ని విషయాల్లోనూ తమకు సరైన స్థానం ఉందని తెలిపింది. తమది డైనమిక్ పార్టీ అని చెప్పుకుంది.
కాగా... భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్న తరుణంలో బలోచిస్థాన్ ప్రావిన్స్ లోని కాలత్ జిల్లా మంగోచర్ పట్టణాన్ని తాము స్వాధీనం చేసుకున్నట్లు బీఏల్ఏ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం కూడా వీరి దాడిలో పాక్ సైనికులు 22 మంది మరణించినట్లు వార్తలొచ్చాయి.
వాస్తవానికి ప్రత్యేక దేశంగా ఏర్పడాలని పాకిస్థాన్ లోని బలోచిస్థాన్ ప్రావిన్స్ లోని ప్రజలు కొన్ని దశాబ్ధాలుగా పోరాడుతున్నారు. ఇక్కడ బొగ్గు, బంగారం, చమురు, రాగి, సహజ వాయు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఫలితంగా... పాక్ ఖజానా నిండుతోంది. అయితే... ఇక్కడ వ్యవసాయానికి ఆమోదయోగ్యత తక్కువ. కారణం.. ఇక్కడ కఠినమైన ఎడారి ఉంటుంది.
దీంతో.. పేదరికం పెరిగింది.. జనాభా తక్కువైపోయింది.. అభివృద్ధికి దూరమైపోయింది.. ఈ నేపథ్యంలోనే రాజకీయ అనిశ్చితి నెలకొని, వేర్పాటువాదులు శక్తిమంతులయ్యారు. ఇప్పుడు పాక్ ను వణికిస్తున్నారు.
