Begin typing your search above and press return to search.

పాక్ కు ముచ్చెమటలు... బీఎల్ఏ దాడుల్లో 39 మంది జవాన్లు మృతి!

పాకిస్థాన్ కు బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) గ్యాప్ ఇవ్వడం లేదు. ఇందులో భాగంగా... గత రెండ్రోజుల్లో 39 మంది పాకిస్థాన్ సైనికులను మట్టుపెట్టినట్లు ఆ సంస్థ ప్రకటించింది

By:  Tupaki Desk   |   17 July 2025 6:18 PM IST
పాక్  కు ముచ్చెమటలు... బీఎల్ఏ దాడుల్లో 39 మంది జవాన్లు  మృతి!
X

పాకిస్థాన్ కు బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) గ్యాప్ ఇవ్వడం లేదు. ఇందులో భాగంగా... గత రెండ్రోజుల్లో 39 మంది పాకిస్థాన్ సైనికులను మట్టుపెట్టినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఓ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. కలాత్ లో 27 మంది.. మరోచోట జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందినట్లు వెల్లడించింది.

అవును... పాక్ సైన్యానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ ముచ్చెమటలు పట్టించేస్తోంది. ఇందులో భాగంగా.. కరాచీ నుంచి క్వెట్టాకు పాక్ దళాలను బస్సులో తరలిస్తుండగా.. బీఎల్‌ఏ కు చెందిన ఫతే స్క్వాడ్‌ కలాత్‌ లోని నిమ్రాగ్‌ క్రాస్‌ వద్ద ఆ బస్సును లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. ఇందులో 27 మంది సైనికులు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

మరో ఘటనలో క్వెట్టాలోని హజార్‌ గంజ్‌ లో ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పేల్చి మరో ఇద్దరు సైనికులను హతమార్చినట్లు బీఎల్‌ఏ వెల్లడించింది. ఇదే సమయంలో... కలాత్‌ లోని ఖజినా ప్రాంతంలో మరో ఐఈడీ పేల్చి నలుగురు సైనికులను, గుజ్రోకొర్‌ ఏరియాలో దాడి చేసి మరో ఆరుగురు సైనికులను హత్య చేసినట్లు బీఎల్‌ఏ ప్రకటించింది.

ఈ విధంగా వేర్వేరు చోట్ల దాడి చేసి 39 మంది పాక్ సైనికులను బలోచ్ లిబరేషన్ ఆర్మీ మట్టుబెట్టింది. వీరిలో మేజర్‌ సయిద్‌ రబ్‌ నవాజ్‌ తరీక్‌ కూడా ఉన్నట్లు తెలిపింది. ఇదే సమయంలో... పాక్ దాడుల్లో ముగ్గురు బీఎల్‌ఏ సభ్యులు చనిపోయినట్లు వచ్చిన వార్తలను ఖండించింది.

కాగా... ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ మధ్య బలోచ్‌ రెబల్స్‌ మొత్తం 286 దాడులు చేశారు. వీటిలో తొమ్మిది ప్రత్యేక ఆపరేషన్లు, మూడు ఆత్మాహుతి దాడులు కూడా ఉన్నాయి. బీఎల్‌ఏ చేసిన మొత్తం దాడుల్లో 697 మందికి పైగా చనిపోయారని నివేదికలు చెబుతున్నారు. ఈ క్రమంలో.. 290 మందిని అదుపులోకి తీసుకొన్నట్లు బీఎల్‌ఏ చెబుతోంది.

ఇదే సమయంలో... పాక్ కు చెందిన 133 వాహనాలను ధ్వంసం చేయడం, ఒక రైలును హైజాక్ చేయడం, 17 సైనిక స్థావరాలను దెబ్బతీయడంతో పాటు అదనంగా 115 కి పైగా ఆయుధ రకాలను, పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు బీఎల్ఏ తెలిపింది. అదేవిధంగా... 45 వ్యూహాత్మక ప్రదేశాలను స్వాధీనం చేసుకున్నట్లు నివేదించబడింది.

'ఆపరేషన్ బూమ్'!:

మరోవైపు పాక్‌ ప్రభుత్వంపై అతిపెద్ద దాడిని బలోచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ గత వారం ప్రారంభించింది. దీనికి 'ఆపరేషన్‌ బామ్‌' అనే పేరు పెట్టింది. ఇందులో భాగంగా.. బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌ లోని పలు జిల్లాల్లో ప్రభుత్వ, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది. దశాబ్ధాల నాటి పోరాటంలో కొత్త అధ్యాయం మొదలైందని ఈసందర్భంగా ఆ సంస్థ పేర్కొంది.