Begin typing your search above and press return to search.

పాక్-చైనా నోట్లో బ‌లూచిస్థాన్ వెల‌క్కాయ‌.. అమెరికా దెబ్బ అదుర్స్

బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ (బీఎల్ఏ).. పాకిస్థాన్ లోని అత్య‌ధిక విస్తీర్ణంలో ఉన్న ప్రావిన్స్ (రాష్ట్రం)లో మిలిటెంట్ కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న సంస్థ‌.

By:  Tupaki Desk   |   20 Sept 2025 9:33 AM IST
పాక్-చైనా నోట్లో బ‌లూచిస్థాన్ వెల‌క్కాయ‌.. అమెరికా దెబ్బ అదుర్స్
X

ఒక ఎయిర్ పోర్ట్ పై దాడి.. ఒక నౌకాశ్ర‌యంపై దాడి.. ఒక రైలు హైజాక్..! ఇవ‌న్నీ ఒక‌టే మిలిటెంట్ సంస్థ ఏడాది వ్య‌వ‌ధిలో చేప‌ట్టిన చ‌ర్య‌లు..! ఓ ద‌శ‌లో త‌మ ప్రాంతాన్ని ప్ర‌త్యేక దేశంగానూ ప్ర‌క‌టించుకునే వ‌ర‌కు వెళ్లింది ఆ సంస్థ‌..! ఇంకేం..? అమెరికా రంగంలోకి దిగింది. ఆ మిలిటెంట్ సంస్థ‌ను ఉగ్ర‌వాద సంస్థ‌గా ప్ర‌క‌టించింది. దీనిని చూసి పాకిస్థాన్ సంబ‌ర‌ప‌డింది. చైనా కూడా దానికి వంత‌పాడింది. కానీ, చివ‌ర‌కు అమెరికా ఈ రెండింటి కంట్లోనూ కారం కొట్టింది.

ఇంత‌కూ ఉగ్ర సంస్థేనా..?

బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ (బీఎల్ఏ).. పాకిస్థాన్ లోని అత్య‌ధిక విస్తీర్ణంలో ఉన్న ప్రావిన్స్ (రాష్ట్రం)లో మిలిటెంట్ కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న సంస్థ‌. బీఎల్ఏ వెనుక ఉన్న‌ది ఎవ‌రో కానీ.. పాకిస్థాన్ కు మాత్రం అది చుక్కలు చూపిస్తోంది. గ‌త ఏడాది పాక్ వాణిజ్య రాజధాని క‌రాచీలోని విమానాశ్ర‌యం, కీల‌క‌మైన గ్వాద‌ర్ నౌకాశ్రయంపై దాడి చేసింది. ఈ ఏడాది మార్చిలో జాఫ‌ర్ ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసింది. 31 మంది ప్ర‌జ‌లు, పాక్ సైనికుల‌ను చంపేసింది. ఇవికాక ప‌లు ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడుల‌కు తెగ‌బ‌డింది.

మా ప్రాంతం మా దేశం కావాలి...

బ‌లూచిస్థాన్ అనేది పాక్ లోని పెద్ద ప్రావిన్సే కాదు.. అత్య‌ధిక ఖ‌నిజాలున్న‌ది. బొగ్గు, గ్యాస్, బంగారం, రాగి వంటివీ ఇక్క‌డ ఉన్నాయి. కానీ, పాక్ పాల‌కులు వీటిని వాడుకుంటూ డెవ‌ల‌ప్ మెంట్ ను మాత్రం విస్మ‌రిస్తున్నారు. అందుకే బీఎల్ఏ ఏర్ప‌డింది. బ‌లూచిస్థాన్ దేశం కోసం పోరాడుతోంది. వాస్త‌వానికి కొద్ది రోజుల కింద‌ట అమెరికా... బీఎల్ఏను విదేశీ ఉగ్ర‌వాద సంస్థ (ఫారిన్ టెర్ర‌రిస్ట్ ఆర్గ‌నైజేష‌న్‌)గా గుర్తించింది. దీంతో పాక్ సంబర‌ప‌డిపోయింది. తాజాగా బీఎల్ఏను ఉగ్ర‌వాద సంస్థ‌గా గుర్తించాల‌ని ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో చైనాతో క‌లిసి పాక్ ప్ర‌పోజ‌ల్ పెట్టింది. కానీ, దీనికి భ‌ద్ర‌తామండ‌లి శాశ్వ‌త‌ స‌భ్య దేశాలైన అమెరికా, ఫ్రాన్స్, బ్రిట‌న్ ఒప్పుకోలేదు. త‌గిన ఆధారాలు లేనందున బీఎల్ఏను ఉగ్ర‌వాద సంస్థగా ప్ర‌క‌టించ‌లేమ‌ని చెప్పాయి. బీఎల్ఏకు ఆల్ ఖైదా స‌హా తెహ్రీక్ ఇ తాలిబ‌న్ పాకిస్థాన్ వంటి సంస్థ‌లు అఫ్ఘానిస్థాన్ కేంద్రంగా ప‌నిచేస్తున్నాయ‌ని పాక్ ఆరోపించినా అవేమీ చెల్ల‌లేదు.

ఇదీ అస‌లు కార‌ణం..

బీఎల్ఏను విదేశీ ఉగ్ర‌వాద సంస్థ‌గా అమెరికా గుర్తించినా... భ‌ద్ర‌తామండ‌లి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి మాత్రం ప్లేటు ఫిరాయించింది. దీనికి కార‌ణం.. పాకిస్థాన్ చేసిన తిక్క ప‌నే. అమెరికా బ‌ద్ద శ‌త్రువైన చైనాతో క‌లిసి బీఎల్ఏను ఉగ్ర‌సంస్థ‌గా గుర్తించాల‌ని కోర‌డ‌మే అది చేసిన త‌ప్పు. ఇక బ‌లూచిస్థాన్ మీదుగానే చైనా ప‌లు ప్రాజెక్టుల‌ను చేప‌డుతోంది. అందుకే అది పాక్ తో క‌లిసి ఎత్తు వేసింది. కానీ, దానిని అమెరికా చిత్తు చేసింది.